ఆత్మ హననం

1 Oct, 2018 00:56 IST|Sakshi

కథాసారం

అమృత్‌సర్‌ నుంచి మధ్యాహ్నం రెండింటికి బయలుదేరిన ప్రత్యేక రైలు ఎనిమిది గంటల తర్వాత ముఘల్‌పురా చేరుకుంది. దారిలో చాలామంది చనిపోయారు, ఎందరో గాయపడ్డారు, ఇంకొంతమంది ఎటో చెల్లాచెదురయ్యారు. పొద్దున పదింటికి క్యాంపులోని చల్లటి నేల మీద సిరాజుద్దీన్‌ కళ్లు తెరిచేప్పటికి నలువైపులా పోటెత్తుతున్న సముద్రంలా మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు కనబడేసరికి అతడి ఆలోచనాశక్తి మరింత మందగించింది. అతడు అలాగే చీకటిగావున్న ఆకాశం వంక చూస్తూవున్నాడు. అంతటి కల్లోలం కూడా వినబడనంతగా వృద్ధుడైన సిరాజుద్దీన్‌ చెవులు మూసుకుపోయినై. ఎవరైనా చూస్తే అతడు దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిలువెల్లా స్తబ్ధత అతడిని ఆవరించింది. అతడి అస్తిత్వం మొత్తం శూన్యంలో వేలాడుతోంది.దట్టంగా ఉన్న ఆకాశం వైపే చూస్తున్న సిరాజుద్దీన్‌ చూపు సూర్యుడిని ఢీకొట్టడంతో ఆ తీవ్రమైన కాంతికి అతడి నరనరమూ కదలడంతో మేల్కొన్నాడు. అతడి మస్తిష్కంలో దృశ్య పరంపర కదలాడింది– దోపిడి, మంటలు, తొక్కిసలాట, స్టేషన్, బుల్లెట్లు, రాత్రి, సకీనా... సిరాజుద్దీన్‌ ఒక్కసారిగా లేచి నిలబడి నలుదిశల్లోని జనప్రవాహాన్ని పిచ్చివాడిలా తేరిపారా చూశాడు.

మూడు గంటల పాటు ‘సకీనా, సకీనా’ అంటూ క్యాంపు మొత్తం గాలించినా అతడి ఒక్కగానొక్క కౌమార కూతురి జాడ దొరకలేదు. ఆ ప్రదేశమంతటా చెవులు చిల్లులుపడేలా శబ్దాలు. ఒకరు, వాళ్ల పిల్లాడి కోసం వెతుకుతున్నారు, మరొకరు భార్య కోసం, ఇంకొకరు కుమార్తె కోసం. సిరాజుద్దీన్‌ అలసిపోయి ఒకచోట కూలబడి, సకీనా ఎప్పుడు, ఎలా తనతో విడిపడిందో గుర్తు చేసుకోవడం కోసం మెదడు మీద ఒత్తిడి పెట్టాడు. కానీ అతడి ప్రతి ఆలోచనా చివరకు పేగులు బయటికొచ్చేట్టుగా నరకబడిన భార్య శవం దగ్గర అంతం కాసాగింది.సకీనా వాళ్లమ్మ చచ్చిపోయింది. ఆమె సిరాజుద్దీన్‌ కళ్లముందే తుదిశ్వాస విడిచింది. కానీ సకీనా ఎక్కడ? ఆమె చనిపోతూ, ‘నన్ను వదిలెయ్, త్వరగా సకీనాను తీసుకొని ఇక్కణ్నుంచి పారిపో’ అని చెప్పింది.సకీనా అతడి వెంటే ఉండింది. ఇద్దరూ చెప్పుల్లేని కాళ్లతో పరుగెత్తారు. ఆమె దుపట్టా కింద పడిపోయింది. అతడు ఆగి దాన్ని తీసుకోబోతుంటే, ‘అబ్బాజీ, వదిలెయ్‌’ అని సకీనా అరిచింది. అప్పటికే అతడు దాన్ని తీసేసుకున్నాడు. దాని గురించే ఆలోచిస్తూ తన ఉబ్బెత్తుగా ఉన్న కోటు జేబువైపు చూపు సారించాడు. జేబులో చేయి పెట్టి అందులోంచి ఒక బట్టను బయటికి తీశాడు. అది సకీనా దుపట్టా. కానీ సకీనా ఎక్కడుంది?

సిరాజుద్దీన్‌ ఎంత ఆలోచించినా ఫలితం లేకపోయింది. సకీనాను వెంటబెట్టుకొని అతడు స్టేషన్‌ దాకా వచ్చాడా? ఆమె తన వెంటే రైల్లో ప్రయాణించిందా? దారిలో అల్లరిమూకలు బండిని ఆపించి లోపలికి జొరబడినప్పుడు తాను స్పృహలోనే ఉన్నాడా? అప్పుడుగానీ వాళ్లు ఆమెను ఎత్తుకెళ్లారా?సిరాజుద్దీన్‌ లోపల ప్రశ్నల మీద ప్రశ్నలు, కానీ ఏ ఒక్కదానికీ జవాబు లేదు. అతడు సానుభూతి కోరుకున్నాడు, కానీ తన చుట్టుపక్కల ఉన్నవాళ్లందరికీ అదే కావాలి. అతడికి ఏడవాలనిపించింది, కానీ కళ్లు సహకరించలేదు. కన్నీళ్లు ఎప్పుడు ఇంకిపోయినాయో!ఆరు రోజుల తర్వాత, కొంచెం కోలుకున్నాక, సిరాజుద్దీన్‌ తనకు సాయపడటానికి సిద్ధంగా ఉన్న మనుషులను కలుసుకున్నాడు. మొత్తం ఎనమండుగురు యువకులు. వాళ్ల చేతుల్లో లాఠీలు, ఆయుధాలు ఉన్నాయి. సిరాజుద్దీన్‌ వాళ్లకు శుభవచనాలు పలికి, సకీనా రూపురేఖలు వివరించాడు. ‘ఆమెది ఎర్రటి రంగు, అందంగా ఉంటుంది... నాలాగా కాదు, వాళ్లమ్మను పోలింది... పదిహేడేళ్లు వస్తాయి... కళ్లు పెద్దవి... నల్లటి వెంట్రుకలు, కుడి చెంప మీద పెద్ద పుట్టుమచ్చ. ఆమె నా ఒక్కగానొక్క బిడ్డ. దయచేసి వెతికిపెట్టండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’.

స్వచ్ఛంద సేవకులైన ఆ నవయువకులు ఆవేశంతో, ‘ఒకవేళ మీ కూతురుగానీ బతికివుంటే కొద్ది రోజుల్లోనే మీ దగ్గర ఉంటుం’దని వృద్ధుడైన సిరాజుద్దీన్‌కు అభయం ఇచ్చారు. ఎనిమిదిమంది యువకులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రాణాలకు తెగించి వాళ్లు అమృత్‌సర్‌ వెళ్లారు. ఎంతోమంది ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలను కాపాడి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కానీ పదిరోజులైనా సకీనా జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు.ఒకరోజు ఇదే పనిమీద వాళ్లు లారీలో అమృత్‌సర్‌ వెళ్తుండగా ఛహ్‌రరా దగ్గర రోడ్డు మీద ఒకమ్మాయి భారంగా నడుస్తూ కనబడింది. లారీ శబ్దం వినగానే అమ్మాయి భీతిల్లి పరుగెత్తడం మొదలుపెట్టింది. స్వచ్ఛంద సేవకులు బండిని ఆపించి ఆమె వెంటబడి పరుగెత్తారు. ఒక పొలంలో ఆమెను దొరికించుకున్నారు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. కుడిచెంప మీద పెద్ద పుట్టుమచ్చ. ఒక యువకుడు ఆమెను భయపడొద్దని చెప్పి, ‘నీ పేరు సకీనానా?’ అని అడిగాడు.ఆమె ముఖం పాలిపోయింది. ఏమీ మాట్లాడలేదు. కానీ యువకులు నమ్మకం కలిగించాక ఆమె భయంపోయింది. సిరాజుద్దీన్‌ కూతురు ఈమేనని వాళ్లకు అర్థమైంది.

ఆ యువకులందరూ ఆమెకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించారు. ఆమెకు తినబెట్టారు, తాగడానికి పాలు ఇచ్చారు, ఆమె లారీలోకి ఎక్కడానికి సాయం చేశారు. దుపట్టా లేని కారణంగా ఆమె ఇబ్బందిగా తన ఛాతీని చేతులతో కప్పుకోవడానికి విఫలయత్నం చేస్తుండటం చూసిన ఒక యువకుడు తన కోటు విప్పి ఇచ్చాడు.సకీనా గురించిన వార్త ఏమీ తెలియకుండానే సిరాజుద్దీన్‌ చాలా రోజులు గడిపాడు. బిడ్డను  జాడ తీయడానికి క్యాంపుల చుట్టూ, అధికారుల చుట్టూ నిష్ఫలంగా తిరుగుతూనే ఉన్నాడు. నీ కూతురు గనక బతికివుంటే కొద్ది రోజుల్లోనే వెతికి తెస్తామని అభయమిచ్చిన స్వచ్ఛంద సేవకుల క్షేమం కోసం అతడు రాత్రుళ్లు దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు.ఒకరోజు ఆ స్వచ్ఛంద సేవకులను అతడు క్యాంపు దగ్గర చూశాడు. వాళ్లు లారీలో కూర్చునివున్నారు. లారీ అంతలో కదులుతుండటంతో సిరాజుద్దీన్‌ పరుగెత్తి, ‘‘నాయనా, సకీనా కనబడిందా?’’ అని అడిగాడు.‘‘మేము కనిపెడతాం, కనిపెడతాం’’ అని ముక్తకంఠంతో వాళ్లు జవాబిచ్చారు. లారీ వెళ్లిపోయింది.తన హృదయ భారం తొలగించిన ఆ యువకుల విజయం కోసం సిరాజుద్దీన్‌ మళ్లీ ప్రార్థించాడు.

ఆ సాయంత్రం అతడు కూర్చున్న చోటుకు దగ్గరే ఏదో గడబిడ వినబడింది. నలుగురు మనుషులు ఏదో మోసుకుని వస్తున్నారు. వాకబు చేస్తే ఎవరో అమ్మాయి రైలు పట్టాల దగ్గర స్పృహ లేకుండా పడివుంటే మోసుకొస్తున్నారని తెలిసింది. సిరాజుద్దీన్‌ వాళ్లనే అనుసరించాడు. ఆసుపత్రి సిబ్బందికి ఆమెను అప్పగించి వాళ్లు మరలిపోయారు. కొద్దిసేపు అతడు అక్కడే ఆసుపత్రి బయట ఉన్న గుంజకు ఆనుకొని నిలబడ్డాడు. నెమ్మదిగా లోపలికి నడిచాడు. గదిలో ఎవరూ లేరు. ఆ శవాన్ని పడుకోబెట్టిన స్ట్రెచర్‌ తప్ప ఇంకేమీ కనబడలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ సిరాజుద్దీన్‌ శవం వైపే నడిచాడు. గదిలోకి ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగు వచ్చింది. చనిపోయిన అమ్మాయి తెల్లటి ముఖం మీద తళుక్కుమన్న పుట్టుమచ్చను చూడగానే ‘‘సకీనా’’ అని అరిచాడు సిరాజుద్దీన్‌.లైటు వేసిన డాక్టర్‌ ‘‘ఏమైంది?’’ అని ప్రశ్నించాడు. ‘‘నే... సర్, నేను ఆమె బాపు’’ సిరాజుద్దీన్‌ గొంతులోంచి మాటలు గరగరా వచ్చాయి. మృతదేహపు నాడీని పరీక్షిస్తూనే, సిరాజుద్దీన్‌కు కిటికీని చూపిస్తూ, ‘‘తెరువు’’ అన్నాడు డాక్టర్‌.స్ట్రెచర్‌ మీద ఉన్న శవం భయంతో కంపించింది, నిర్జీవమైన చేతులతోనే బొందులు విప్పి  షల్వార్‌ను కిందకు జార్చింది. ‘బతికేవుంది, నా బిడ్డ బతికేవుంది!’’ అంటూ ముసలి సిరాజుద్దీన్‌ ఆనందంతో కేకలు వేశాడు.
డాక్టర్‌ ఒళ్లు ఆపాదమస్తకం చెమటతో చల్లబడింది.

సాదత్‌ హసన్‌ మంటో
సాదత్‌ హసన్‌ మంటో (1912–55) ఉర్దూ కథ ‘ఖోల్‌దో’ ఇది. 20వ శతాబ్దపు అత్యుత్తమ ఉర్దూ రచయితల్లో ఒకడిగా పేరొందిన మంటో అవిభాజ్య భారత్‌లో జన్మించి, తన 42వ యేట పాకిస్తాన్‌లో మరణించాడు. దేశవిభజన సమయంలో జరిగిన మానవ హననం ప్రపంచ చరిత్రలోనే అత్యంత పాపపంకిళమైన ఘట్టం. ఆ నేపథ్యంలోనేగాక, చీకటి జీవితాలను గురించి తీవ్రమైన స్వరంతో కథలు రాశాడు మంటో. ఏ మతాన్నీ వెనకేసుకు రాకపోవడం ఈ కథలోని గొప్పదనం. అనువాదం సాహిత్యం డెస్క్‌. నందితాదాస్‌ దర్శకత్వంలో ‘మంటో’ బయోపిక్‌ ఇటీవలే విడుదలైంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా