నాలుగో బొమ్మ

21 Dec, 2017 00:47 IST|Sakshi

చెట్టు నీడ 

ఒక రాకుమారుడి పట్టాభిషేకానికి ముందు ఒక సాధువు మూడు చిన్న బొమ్మలను అతడికి కానుకగా ఇచ్చాడు. ‘‘నేనేమైనా ఆడపిల్లనా! నాకు బొమ్మలిస్తున్నావు?’’ అన్నాడు రాకుమారుడు. సాధువు నవ్వాడు. ‘‘కాబోయే రాజుకు అవసరమైన కానుకలివి’’ అన్నాడు.  ప్రశ్నార్థకంగా చూశాడు రాకుమారుడు.‘‘ప్రతి బొమ్మకు చెవిలో రంధ్రం ఉంటుంది. ఈ దారాన్ని ఆ బొమ్మల చెవిలోకి ఎక్కించి చూడు’’ అన్నాడు సాధువు.  రాకుమారుడు మొదటి బొమ్మను తీసుకున్నాడు. ఆ బొమ్మ చెవిలోకి దూర్చిన దారం అవతలి చెవిలోంచి బయటికి వచ్చింది. ఈ రకం మనుషులు విన్నది విన్నట్లుగా గాలికి వదిలేస్తారు అని చెప్పాడు సాధువు. రాకుమారుడు రెండో బొమ్మ చెవిలోకి దూర్చిన దారం బొమ్మ నోట్లోంచి బయటికి వచ్చింది. ఈ రకం మనుషులు విన్నది విన్నట్లుగా బయటికి చెప్పేస్తారు అని చెప్పాడు సాధువు. రాకుమారుడు మూడో బొమ్మ చెవిలోకి దూర్చిన దారం ఎటు నుంచీ బయటికి రాలేదు! ఈ రకం మనుషులు విన్న దానిని తమ లోపలే నిక్షిప్తం చేసుకుంటారు అని చెప్పాడు సాధువు.  ‘‘ఈ ముగ్గురిలో ఏ రకం మనుషులు నేను నమ్మదగినవారు?’’ అని అడిగాడు రాకుమారుడు. సాధువు నాలుగో బొమ్మను రాకుమారుడి చేతికి అందించాడు.

ఆ నాలుగో బొమ్మ చెవిలోకి దారం దూర్చమన్నాడు. రాకుమారుడు దారం దూర్చగానే అది రెండో చెవిలోకి బయటికి వచ్చింది. మళ్లీ అదే బొమ్మలోకి ఇంకోసారి దారం దూర్చమని చెప్పాడు సాధువు. ఈసారి దారం నోట్లోంచి వచ్చింది. మళ్లీ ఒకసారి దారాన్ని దూర్చమని చెప్పాడు. అది ఎటువైపు నుంచీ బయటికి రాలేదు! ‘‘రాకుమారా ఈ నాలుగో రకం మనుషులే నువ్వు నమ్మదగినవారు, నువ్వు ఆధారపడదగినవారు. ఎప్పుడు వినకూడదో, ఎప్పుడు మాట్లాడకూడదో, ఎప్పుడు మౌనంగా ఉండకూడదో తెలిసిన వారే రాజ్యపాలనలో నీకు సహకారులుగా ఉండాలి’’ అని చెప్పాడు సాధువు.  రాకుమారుడు సాధువుకు నమస్కరించి, నా నాలుగు బొమ్మలనూ తన దగ్గర ఉంచుకున్నాడు. ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడం విజ్ఞత. ఎలా ఉండకూడదో అలా ఉండకపోవడం వివేకం. ఈ రెండూ ఉన్న వ్యక్తులు జీవితంలో రాణిస్తారు.

మరిన్ని వార్తలు