గ్యాస్ట్రైటిస్‌ అంటే ఏమిటి?

30 Jan, 2017 00:20 IST|Sakshi
గ్యాస్ట్రైటిస్‌ అంటే ఏమిటి?

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 35 ఏళ్లు. నేను ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. నేను కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతోను బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా నయమబవుతుందా? – రమేశ్‌కుమార్, హైదరాబాద్‌
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో గ్యాస్ట్రైటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల అందరిలోనూ నెలకొంటున్న తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం అనే అంశం దీనికి ఆజ్యం పోస్తోంది. శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఇటీవల చాలామంది గ్యాస్ట్రైటిస్‌ సమస్య బారిన పడుతున్నారు.

గ్యాస్ట్రైటిస్‌ అంటే: జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.

కారణాలు: దాదాపు 20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది.
 → తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం n కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం n పైత్య రసం వెనక్కి ప్రవహించడం n కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్‌ డిసీజ్‌), కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు

 → శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో n ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది.

లక్షణాలు: కడుపు నొప్పి, మంట n కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం n అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు n ఆకలి తగ్గిపోవడం n కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: n సమయానికి ఆహారం తీసుకోవాలి n కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి n పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి n ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి  తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.

చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండ్‌డి హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
హైదరాబాద్‌

కిడ్నీ వ్యాధులను నివారించడమెలా?
కిడ్నీ కౌన్సెలింగ్‌

నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా అమ్మగారు, వారి తండ్రిగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు.  జన్యుపరమైన అంశాలు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలే చదివాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు పరిష్కార మార్గాలున్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – నిత్యానంద ప్రసాద్, ఖమ్మం
మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్‌. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 40 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సైలెంట్‌ కిల్లర్స్‌గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్‌ క్రియాటనిన్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్‌ఆర్, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రం నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.

డాక్టర్‌ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు