కాలం వెనక్కు వస్తుంది

22 Jul, 2020 02:10 IST|Sakshi
గీతా, ప్రమీలా, ఖుష్బు

నిముషం లేటైతేనే పరీక్ష రాయనివ్వరు. కొన్ని సంవత్సరాలు లేటైతే రానిస్తారా! ఇప్పుడీ పనికిపోతున్న ఆడపిల్లలు.. ఏదో ఒక ఉపాధిలో ఉన్న మహిళలు.. మళ్లీ చదువుకోవాలని ఆశపడితే?! ఎప్పుడో చూసిన క్లాసు పుస్తకాలను.. కనులపై మోసిన భవిష్యత్తు కలలను.. కాలం గిర్రున తిరిగి వెనక్కు తెచ్చిస్తుందా? ఇచ్చింది! గీతకు, ప్రమీలకు, కుష్బూకు ఇచ్చింది!!

గీత ఒక్కటే ఉంటుంది. ఊరందరికీ ఆమె అక్క. ‘దీదీ’ అని కష్టం చెప్పుకోడానికి వస్తారు. ‘దీదీ’ అని సాయం అడగడానికి వస్తారు. ‘దీదీ’ అని చేతిలో పని అందుకోడానికి వస్తారు. గీత చేతిలో పని అందుకోవడం అంటే ఆమె చేతిలోని బంతిపూల గంపకు.. ఎత్తేటప్పుడు, దించేటప్పుడు.. ఒక చెయ్యి పట్టడం. గీతకు బంతిపూల తోటే ఉంది. పనివాళ్లు లేకుండా ఉంటారా! ఉన్నారు. అయితే తనూ ఒక గంప మొయ్యాలి. అప్పుడే తృప్తి. కొన్ని నెలల క్రితమే తోట పూయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు గీత అరవై వేల పూలను చుట్టుపక్కల మార్కెట్‌లలో అమ్మింది. తోట ఆమెదే, స్థలం మరొకరిది.

ఒడిశాలోని రాయగడ జిల్లా కేంద్రానికి  39 కి.మీ. దూరంలో ఉన్న గిరిజన గ్రామం నిమల్‌లో ఉంటుంది గీత. ఐక్యరాజ్యసమితి నుంచి ‘సెకండ్‌ చాన్స్‌ ఎడ్యుకేషన్‌’ ప్రోగ్రామ్‌ వాళ్లు వచ్చినప్పుడు, వాళ్ల గురించి తెలుసుకుని రాయగడ వెళ్లింది. తనకు చదువూ ఇష్టమే. పూలతోటల పెంపకమూ ఇష్టమే అని చెప్పింది. పూల పెంపకాన్నే పుస్తకాల చదువుగా చేసుకొమ్మని చెప్పారు వాళ్లు. ఎలా పండించాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలా మార్కెట్‌ చేసుకోవాలి.. వీటిల్లో శిక్షణ ఇచ్చారు.

శిక్షణ చక్కగా పండుతోంది. ప్రస్తుతానికి గీత రాబడి కొద్దిగానే ఉన్నా సొంత కాళ్ల మీద నిలబడిన మహిళగా ఊళ్లో బాగానే గుర్తింపు వచ్చింది. పూల సాగును, పూల వ్యాపారాన్ని పెంచుకునేందుకు గ్రామంలోని యువతులకు ఆమె ఉపాధి కల్పించబోతోంది. తెలిసిన విద్య కనుక వారికి శిక్షణ కూడా ఆమే ఇస్తుంది. గీతకు ఒక అన్న ఉండేవాడు. చిన్నప్పుడు గీతను పనిలోకి పంపించడానికి బడి మాన్పించాడు. ‘నేనొక్కడినే అయితే ఎలాగైనా బతికేవాడిని. నిన్నూ బతికించాలి కనుక నువ్వూ పనికి వెళ్లాలి’ అనేవాడు! ఇప్పుడు గీతే అతడికి డబ్బులు పంపుతోంది.

ప్రమీల టీనేజ్‌లో ఉంది. స్థోమత ఉంటే బాగా చదువుకోవలసిన వయసు. ఐదవ తరగతితో ఆమె చదువు ఆగిపోయింది. బంధువుల కలహాలలో తండ్రిని అవతలివైపు వాళ్లు చంపేశారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ప్రమీల కన్నా పెద్దవాళ్లు నలుగురు ఉన్నా, చిన్న వయసులోనే పెళ్లిళ్లు అయి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. తల్లిని తనే చూసుకోవాలి. తల్లి కష్టపడి, నీరసపడి నాలుగు రాళ్లతో ఇంటికి రావడం చూడలేకపోయింది. వీళ్లది అస్సాం. పనమ్మాయిగా ఐదు వేలు రూపాయలు వస్తాయంటే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లిపోయింది.

నెల నెలా తల్లికి మూడు వేలు పంపిస్తోంది. పని చేస్తోంది కానీ, ప్రమీలకు చదువు మీద ఆశ పోలేదు. కనీసం టెన్త్‌ అయినా పూర్తి చేయాలని ఆమె తపన. ఇంటి యజమానులు బాగా చదువుకున్నవాళ్లు. ఆమెను సెకండ్‌ ఛాన్స్‌ ప్రోగ్రామ్‌లో చేర్పించడంతో పాటు, చదువుకునే వెసులుబాటునూ కల్పించారు. ప్రోగ్రామ్‌ వాళ్లు ఆమెను ఎన్‌.ఐ.ఒ.ఎస్‌. (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌) లో చేర్పించారు. ప్రస్తుతం ప్రమీల పనిచేస్తూనే టెన్త్‌ చదువుతోంది. స్టడీ కిట్‌ను కూడా వాళ్లే ఇప్పించారు. ఆ అమ్మాయిలో ఇప్పుడు అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మునుపటి నిరాసక్తత లేదు. 

జీవితంలో చదువు అనేది ఒకటి ఉంటుందని పద్దెనిమిదేళ్లకే మర్చిపోయింది ఖుష్బూ కుమారి. స్త్రీ పురుష సమానత్వ సాధనకు, స్త్రీ సాధికారతకు చదువే ముఖ్యం అని ఆమె ఇప్పుడు గ్రహించింది. అంత అమాయకపు ప్రాణానికి ఇవి పెద్ద మాటలు అనుకోనక్కర్లేదు. బిహార్‌లోని గయ జిల్లాలో, దొహారీ గ్రామం ఖుష్బూది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె కుటుంబం ఆమెను చదువు మానేయమంది. తల్లి, తండ్రి, తోబుట్టువులు. అందర్లోకి ఖుష్బూ పెద్ద. ఇంటిని పోషించలేక కూతుర్నీ కొన్నాళ్లు పనికి పంపించాడు తండ్రి. సెకండ్‌ ఛాన్స్‌ ఎడ్యుకేషన్‌ టీమ్‌ ఆ ఊరు వచ్చినప్పుడు ఎవరో చెబితే ఖుష్బూ వెళ్లి వాళ్లను కలిసింది. వాళ్ల స్టడీ ప్రోగ్రాంలో చేరిపోయింది. ఇంటికి వచ్చి మరీ తండ్రికి నచ్చజñ ప్పి ఆ అమ్మాయికి స్టడీ బుక్స్‌ ఇచ్చి వెళ్లారు యు.ఎన్‌. వాళ్లు.  హిందీ, సోషల్‌ సైన్స్, హోమ్‌ సైన్స్‌ ఆమె సబ్జెక్టులు. కరోనా ఆమె చదువుకేమీ అంతరాయం కలిగించడం లేదు. కొరియర్‌లో పాఠాలు వస్తున్నాయి. 

వారం క్రితమే జూలై 15న ‘యూత్‌ స్కిల్స్‌ డే’ రోజు ఐక్యరాజ్యసమితి ‘ఉమెన్‌ ఇండియా’ విభాగం.. గీత, ప్రమీల, ఖుష్బూలను ‘పట్టుదల గల అమ్మాయిలు’ అని అభినందించింది. చదువు, ఉద్యోగం ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఆడపిల్లను బడి మాన్పించి, పనిలో చేర్పిస్తే కుటుంబానికి ఆమె ఆసరా అవొచ్చు. తిప్పలు పడైనా ఆమెను చదివిస్తే ఆ తర్వాత కుటుంబానికి, సమాజానికి కూడా ఆమె ఇచ్చే ఆసరా ముందు ఇది చాలా స్వల్పం, స్వార్థం అనిపిస్తుంది.

సెకండ్‌ చాన్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌.సి.ఇ.)
బడికెళ్లి చదువుకునే భాగ్యం అందరు ఆడపిల్లలకూ ఉండదు. పనికి వెళ్లి పది రూపాయలు సంపాదించుకు రావడమే వారి పుట్టుకకు పరమావధి అన్నట్లు ఉంటుంది. మన దేశంలో పదిహేనేళ్ల వయసు దాటిన ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురు పనికి వెళితే కానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నవారే. వీళ్లను పని నుంచి చదువుకు మళ్లించి, పదిమందికి వీళ్లే పనిచ్చే చదువునూ చెప్పించి జీవితంలో నిలబడేలా చేస్తోంది ‘సెకండ్‌ చాన్స్‌ ఎడ్యుకేషన్‌’.

ఈ చదువుల శిక్షణను ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ‘యు.ఎన్‌. ఉమెన్‌’ 2018 నుంచి దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా ఇప్పిస్తోంది. చదువుకోవాలని ఆశ ఉండి చదువుకోలేకపోయిన వారికి, ఏదో ఒక పనితో జీవితాన్ని నెట్టుకొస్తూ.. సొంతంగా ఏదైనా చేసుకుంటే బాగుంటుందని ఆశ పడుతున్న వారికి ‘సెకండ్‌ చాన్స్‌ ఎడ్యుకేషన్‌’ ఉపయోగకరంగా ఉంటోంది. ఎడ్యుకేషన్‌ అంటే రెండూ.. పుస్తకాల ఎడ్యుకేషన్, ఉపాధి ఎడ్యుకేషన్‌.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు