కూతురు ఎందుకొద్దు?

5 Feb, 2016 23:21 IST|Sakshi
కూతురు ఎందుకొద్దు?

షార్ట్ ఫిల్మ్

 ఆడపిల్ల ఇంటికి వెలుగు. అది మన ఇల్లా? ఇంకొకరి ఇల్లా అని కాదు. పుట్టినింట, మెట్టినింట సంతోషపు దివ్వెలు వెలిగించి, శాంతి సామరస్యాల పూల మొక్కలు నాటి, ఆ సుమ సౌరభాలను కుటుంబంలో అందరికీ పంచుతుంది ఆడపిల్ల. అంతటి అపురూమైన ఆడపిల్ల.. మన ఇంట పుట్టబోతోందంటే ఎందుకంత కలవరం? ఎందుకంత ఆలోచన? ఎందుకంటే ఆడపిల్ల మీద ఉండే ప్రేమ.. ఆమె భద్రతను గురించిన భయాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి. ఆ భయం.. ఆమె పట్ల తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా మన బాధ్యతను మరింత పెంచుతుంది కాబట్టి. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి భయాలను తట్టుకోలేమా? బాధ్యతలను ఇష్టంగా గుండెలపై మోయలేమా? తట్టుకోవాలి. మోయాలి. అది మనం ఆడపిల్లకు చేస్తున్న మేలు కాదు. మనకు మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం స్వీకరించవలసిన ‘భారం’.
   
ఆడపిల్ల, భారం.. అన్నవి మన సమాజంలో సమానార్థాలు. ఈ భావనను పోగొట్టేందుకు అనేక విధాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు బాలికల సంక్షేమం కోసం, సంరక్షణ కోసం ప్రణాళికలు రచిస్తూ, పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రముఖ వ్యక్తులు, సగటు పౌరులు కూడా ఎవరిస్థాయిలో వారు సమాజంలో మార్పు తెచ్చి, బాలికల మనుగడకు అవసరమైన పరిస్థితులను నెలకొల్పాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఇక సృజనశీలురు, కళాకారులైతే.. బాలికల పట్ల సమాజం ఆలోచనా ధోరణిని మార్చేందుకు తమ కళను ఒక సాధనంగా, శక్తిమంతమైన ఆయుధంగా మలచుకుంటున్నారు. అలాంటి ఒక సృజనాత్మక ఉద్వేగభరిత ఆయుధం.. ‘వై నాట్ ఎ గర్ల్’ లఘు చిత్రం. నిన్ననే విడుదలైన ఈ చిత్రం నిడివి 10 నిమిషాలు. ప్రాణం.. పది తరాలు. ఆపై తరతరాలు! సమాజంలో మార్పు వచ్చేంత వరకు.

‘వై నాట్ ఎ గర్ల్’ చిత్ర దర్శకుడు సునీల్ పప్పుల. నిర్మాత భార్గవి రెడ్డి. చిత్రంలోని యువ దంపతులు నందు, పావనిరెడ్డి. కథ వాళ్లిద్దరిదే. చూశాక అందరిదీ. ఇంటింటిదీ! అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇంట్లో అందరూ సంతోషిస్తారు. భార్యాభర్తలు అప్పటికే మేఘాలలో తేలియాడుతూ ఉంటారు. ఫస్ట్ బేబీ మరి. అయితే ఆ తేలిపోవడం ఎంతోసేపు ఉండదు. ఇంట్లో అందరూ... పుట్టబోయేది అబ్బాయే అని అంటుంటారు. అబ్బాయే పుట్టాలని కూడా ఆశిస్తుంటారు. వీళ్లు హర్ట్ అవుతారు. వీళ్ల ఆలోచనలో ఉన్నది బిడ్డ మాత్రమే. ఆడబిడ్డా, మగబిడ్డా అని కాదు. వీళ్ల అనందానికి కారణమైంది బిడ్డ మాత్రమే. ఆడబిడ్డా, మగబిడ్డా అని కాదు. ఇంట్లో మాత్రం అందరికీ మగపిల్లాడే కావాలి. యువజంటలో ఆనందం ఆవిరైపోయి, ఆలోచన మాత్రం మిగులుతుంది. ఒకవేళ ఆడపిల్ల పుడితే..? ఈ సందేహం వాళ్లది కాదు. డెరైక్టర్ సునీల్‌ది. అక్కడి నుంచి కథను లాక్కొస్తాడు.

నిజానికైతే.. సునీల్ ఈ కథను వాళ్ల అక్క చేతుల్లోంచి లాక్కొచ్చాడు! రెండోసారి ఆమె గర్భిణి అయినప్పుడు.. తనకు ఆడపిల్లే పుట్టాలని అనుకుంది. అనుకోవడం కాదు. కోరుకుంది. కోరుకోవడం కాదు. ఆశించింది. అయితే ఆమె ఆశ నెరవేరలేదు. మళ్లీ అబ్బాయే పుట్టాడు! ఆడపిల్ల కోసం కళ్లు కాయలు కాసేలా చూసి, మగపిల్లాడు పుట్టగానే కళ్లు ఉబ్బిపోయేలా ఏడ్చింది. సునీల్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ ఎదురుచూపులు? ఏమిటి ఈ ఆశ నిరాశలు. ఎవరు పుట్టేదీ మన చేతుల్లో లేదని తెలిసీ.. మగపిల్లాడే పుట్టాలనీ, లేదంటే ఆడపిల్లే పుట్టాలని అనుకోవడం ఏమిటి అనుకున్నాడు. ఈ ధోరణి.. కొత్త దంపతులను అయోమయంలో పడేస్తుందని సునీల్‌కి అనిపించింది. అందుకే షార్ట్ ఫిల్మ్ తియ్యాలనుకున్నాడు. సునీల్ అక్కలా అబ్బాయి పుడితే ఫీల్ అయ్యేవాళ్లు సమాజంలో చాలా తక్కువమంది. అందుకే ఎక్కుమంది ఫీలింగ్స్‌కి తగ్గట్టు ఆడపిల్లను సబ్జెక్ట్‌గా తీసుకుని ‘వై నాట్ ఎ గర్ల్’ తీశాడు. చూసిన వాళ్లలో ఛేంజ్ వస్తుందని ఆశిస్తున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించిన భార్గవీరెడ్డికి... సునీల్‌కి ఉన్నట్లే.. ఓ అనుభవం ఉంది. వాళ్ల దగ్గరి బంధువుల్లో ఒకావిడ తనకు మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని చెప్పి ఎవరికైనా దత్తతు ఇచ్చేయాలనుకుందట. అది విని భార్గవి షాక్ తిన్నారు. అలా ఈ ప్రొడ్యూజరు, డెరైక్టరూ కలిసి సొంత అనుభవాల్లోంచి ‘వై నాట్ ఎ గర్ల్’ తీశారు. ఒకేలా ఆలోచించేవారంతా కదిలి వచ్చి భ్రూణ హత్యల్ని ఆపాలని వీళ్లు కోరుతున్నారు. సినిమా చూడండి.. ఇంకా వీళ్లేం మార్పు తేవాలనుకుంటున్నారో తెలుస్తుంది.       

మరిన్ని వార్తలు