శవాలకు పూసిన పూలు!

2 Nov, 2014 23:21 IST|Sakshi
శవాలకు పూసిన పూలు!

 ఫొటో స్టోరీ
 
ప్రముఖ ఫొటోగ్రాఫర్ జాన్  ఐజక్... 1993లో ఓసారి కంబోడియా వెళ్లారు. అక్కడ ఆయనను ఓ దృశ్యం ఆకర్షించింది. ఓ పేద అమ్మాయి... ఒక కొలనులో దిగి, కలువ పూలను ఏరుకుంటోంది. పువ్వును కోసిన ప్రతిసారీ ఆ చిన్నారి ముఖం సంతోషంతో విచ్చుకుంటోంది. అది చూసి ముచ్చటపడిన ఐజక్... ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ ఫొటో వెనుక... పెద్ద కథే ఉంది!
 
కలువపూలతో కళకళలాడుతోన్న ఈ కొలను... కేవలం కొలను కాదు. ఓ పెద్ద శ్మశానవాటిక! అవును. హింస, భయానక వ్యాధులు, ఆకలి మంటల కారణంగా కంబోడియాలో ఎప్పుడూ మృత్యుదేవత స్వైరవిహారం చేస్తూనే ఉంటుంది. ఎందరినో కర్కశంగా కబళిస్తూ ఉంటుంది. వాళ్లందరికీ అంత్యక్రియలు చేయడం పెద్ద పని. కాబట్టి  ఆ మృతదేహాలను తీసుకెళ్లి కొలనుల్లో పారేస్తుంటారు.

అలాంటి కొలనుల్లో ఇదీ ఒకటి. పైకి పూల అందాలతో అలరిస్తోన్నా... అడుగున శవాల గుట్టలను తనలో దాచుకుందీ కొలను. అది తెలియని ఈ చిట్టితల్లి... చక్కగా కొలనులోకి దిగి, ఆనందంగా కలువపూలను రోజూ కోసుకుంటుంది. వాటిని తీసుకెళ్లి అమ్ముకుంటుంది. పాపం తనకి మాత్రం ఏం తెలుసు... ఆ పూలు కొన్ని వందల విగత జీవుల మీద వికసించాయని, కొన్ని అభాగ్య జీవితాల ఆనవాళ్లను తమలో దాచుకున్నాయని!
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా