కాఫీ వాసన గుప్పుమంటే.. మెదడుకు చురుకు!

20 Jul, 2018 01:10 IST|Sakshi

ఉదయాన్నే కాఫీ తాగితే రోజంతా చురుకుగా ఉంటామని కొందరు అంటూ ఉంటారు. దీని మాటేమిటోగానీ కాఫీ వాసన తగిలినా చాలు.. మీరు వేగంగా లెక్కలు వేసేస్తారు అంటోంది స్టీవెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. ఆశ్చర్యంగా అనిపిస్తోందా? వివరాలు తెలుసుకుందాం. జీమ్యాట్‌ పరీక్ష గురించి మీకు తెలిసే ఉంటుంది. బిజినెస్‌ స్కూల్స్‌లో ప్రవేశానికి నిర్వహిస్తూంటారు దీన్ని. స్టీవెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఓ వంద మందికి పది ప్రశ్నలతో ఈ పరీక్ష పెట్టారు. విడదీసిన రెండు గుంపుల్లో ఒకదానికి మంచి కాఫీ వాసన వచ్చేలా చేశారు.

ఇంకో గుంపులోని వ్యక్తులకు మామూలుగా పరీక్ష పెట్టారు. ఫలితాలను బేరీజు వేసినప్పుడు కాఫీ వాసన ఉన్న గదిలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇదంతా కాఫీ వల్లనే జరిగిందా? అన్నది తెలుసుకునేందుకు ఇంకో 200 మందిపై నాలుగు దఫాలుగా సర్వే జరిపారు. చివరకు తేలింది ఏమిటి అంటే.. కాఫీ వాసన వచ్చినప్పుడు తాము మరింత అలర్ట్‌గా, చురుకుగా ఉండగలుగుతున్నామూ అని! మిగిలిన సువాసనలతో పోలిస్తే కాఫీ వాసన మెదడుకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవకాశమిస్తున్నాయని తెలిసింది. 

మరిన్ని వార్తలు