సాంగత్య బలం

11 Jun, 2017 23:15 IST|Sakshi
సాంగత్య బలం

ఆత్మీయం

జనన మరణ చక్రంనుండి విడుదల పొందడం అనేది వాసనాబలం ఉన్న మనుష్యజన్మలో మాత్రమే సాధ్యం. వాసనలలో అన్నివేళలా మంచివే ఉండవు. ఎన్ని మంచి గుణాలు ఉన్నా, ఒక్కొక్క దాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. ఇక్కడ వాసన అంటే ముక్కుతో పీల్చేదికాదు, గత జన్మలనుంచి లేదా గత అనుభవాలనుంచి తెచ్చుకున్నవి. మనలో ఉన్న ఒక్క చెడు వాసన... అంటే అలవాటు మిగిలి ఉన్న మంచి గుణాలను పాడు చేసేస్తుంది. ఇది పోవాలంటే భగవంతుడిని శరణాగతి వేడుకోవాలి. లేదా సత్పురుషుల సాంగత్యం చేయాలి. అప్పుడు ’ఛీ ! ఛీ ! నేనిలా బతక్కూడదు...’ అనే బుద్ధి కలుగుతుంది.

దీని గురించే రామకృష్ణ పరమహంస ఏమంటారంటే....‘‘ఏనుగు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు తొండం ఎత్తి ఒక జాజితీగ పీకుతుంది, ఓ చెట్టుకొమ్మను పట్టుకుని విరిచేస్తుంది. అలా వెళుతూ పక్కన ఒక దుకాణంలోంచి ఒక అరటిపళ్ళగెల ఎత్తి లోపల పడేసుకుంటుంది. అదే ఏనుగు పక్కన మావటివాడు అంకుశం పట్టుకుని నడుస్తూ పోతున్నాడనుకోండి. అది తొండం ఎత్తినప్పుడల్లా అంకుశం చూపగానే దించేస్తుంది తప్ప దేనినీ పాడుచేయదు. అలాగే మంచివారి సాంగత్యబలం మనలో ఉన్న వాసనాబలం పాడవకుండా రక్షింపబడుతుంది’’ అంటారు.

>
మరిన్ని వార్తలు