‘‘చిన్న బట్టలు వేసుకుంటే రేప్‌ చేస్తారా?’’

11 Nov, 2017 23:45 IST|Sakshi

‘‘పసిపిల్లల్నీ వదలడం లేదు పండు ముసలివాళ్లపై కూడా అత్యాచారం చేస్తున్నారు. మృగానికి చిన్నా పెద్దా తెలియదు. చెడు తెలుసు.. అంతే! వేసుకున్న దుస్తులను బట్టి అమ్మాయి క్యారెక్టర్‌ నిర్ణయించే మగాళ్లు బయల్దేరారు. అమ్మాయిలు తిరగబడితే.. ఇలాంటి పిరికిపందలు పారిపోవాల్సిందే...’’ అంటున్నారు రెజీనా!

అమ్మాయిలు వేసుకునే దుస్తులను బట్టి వాళ్ల క్యారెక్టర్‌ని.. హీరోయిన్లనైతే సినిమాల్లో వాళ్లు వేసుకునే డ్రెస్సులతో క్యారెక్టర్‌ని ఫిక్స్‌ చేస్తున్నారు. చిట్టిపొట్టి దుస్తుల వల్లే జరగకూడనివి జరుగుతున్నాయంటున్నారు...
మన ఇండియాలో రేప్‌కి గురైన అమ్మాయిలందరూ చిన్న స్కర్టులు వేసుకున్నవాళ్లేనా? పసిపాపలను కూడా రేప్‌ చేస్తున్నారు, పెద్దవాళ్లనూ వదిలిపెట్టడంలేదు కదా? పోనీ.. నిండుగా సల్వార్‌ కమీజో, చీరో కట్టుకుంటే రేపులు ఆగుతాయా? రోడ్డు మీదకొచ్చి ఎలా పడితే అలా రెచ్చిపోయే మగవాళ్లను అనడం మానేసి, ఆడవాళ్ల బట్టల గురించి మాట్లాడతారా? సినిమాలో క్యారెక్టర్, కథను బట్టి హీరోయిన్లు డ్రెస్సులు వేసుకుంటారు. అవి చూసి, మా క్యారెక్టర్‌ని జడ్జ్‌ చేస్తారా? ఒకవేళ నేను ఏదైనా సినిమాలో చీర కట్టుకుంటే రియల్‌గా ట్రెడిషనల్‌గా ఉన్నట్లా? చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటే అదో టైపా? డ్రెస్సులను బట్టి క్యారెక్టర్‌ని డిసైడ్‌ చేసేవాళ్లలోనే మార్పు రావాలి.

ప్రతి అమ్మాయి లైఫ్‌లో ఏదో ఒక్క చేదు అనుభవం అయినా ఉంటుంది.. మీ లైఫ్‌లో?
కాలేజ్‌ డేస్‌లో జరిగిన రెండు ఇన్సిడెంట్స్‌ని మరచిపోలేను. కాలేజీకి వెళుతుంటే వెనక నుంచి ఒకడు టచ్‌ చేసి, ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. నాకలా జరగడం అది ఫస్ట్‌ టైమ్‌. అడుగు ముందుకు పడలేదు. తప్పు చేసినవాడు అంత క్యాజువల్‌గా ఉన్నాడు.

ఏ తప్పూ చేయని మనం ఎందుకిలా అయిపోయాం? అనుకున్నాను. ఆ ఇన్సిడెంట్‌ని మరచిపోక ముందే మరోసారి ఇలాంటిదే జరిగింది. ఒకడు నన్ను టచ్‌ చేసుకుంటూ, అసలు తనేమీ చేయనట్లు నడుచుకుంటూ వెళ్లాడు. నాకు ఒళ్లు మండిపోయింది. ఒక్కటిచ్చాను. తిరగబడతాడనుకున్నా. కానీ, పారిపోయాడు. తప్పు చేసినవాళ్లను వదలకూడదు.. తిరగబడాలి.

తిరగబడే ధైర్యం ఉన్న అమ్మాయిలు తక్కువ కావడం వల్లే వేధింపులు ఎక్కువయ్యాయి..
నిజమే. వరల్డ్‌ మొత్తాన్ని తీసుకుందాం. మన ఇండియాలో జరిగినన్ని రేప్స్‌ బహుశా ఎక్కడా జరగవేమో? ఎందుకంటే మనవాళ్లల్లో తిరుగుబాటు ధోరణి తక్కువ. మన సొసైటీలో అమ్మాయిల పట్ల చాలా రూడ్‌గా ఉంటున్నారు. అందరినీ అనడం లేదు. అమ్మాయిల దగ్గర ఎవరైతే అమానుషంగా ప్రవరిస్తున్నారో వాళ్ల గురించి అంటున్నా. హర్ట్‌ చేయాలని ఫిక్స్‌ అయిపోయి వస్తారనుకుంటా. వెకిలి వేషాలు వేస్తారు. ఎదురు తిరిగితే తోక ముడుచుకుంటారు.

ఇలాంటి వేధింపుల గురించి పక్కన పెట్టండి.. అసలు అమ్మాయిలకు పెట్టే ఆంక్షలుంటాయే.. అవి టూ మచ్‌..
కరెక్టే. గోడ దూకామనుకోండి.. ఏంటి అబ్బాయిలా? అంటారు. ఫుట్‌బాల్‌ ఆడితే.. ఇది ఆడపిల్లల ఆట కాదంటారు. దాంతో అమ్మాయిలు ‘మనం తక్కువ’ అని మెంటల్‌గా ఫిక్సయిపోతారు. లక్కీగా మా ఇంట్లో అలా కాదు. ఎందులోనూ తక్కువ కాదన్నట్లే పెంచారు.

అవునూ... ఈ రెండేళ్లల్లో నాలుగు తెలుగు, ఏడు తమిళ సినిమాలు సైన్‌ చేశారు.. తెలుగు ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు తెలుసా?
అవునండి. తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నానని నాకూ అనిపిస్తోంది. రెండు భాషలనూ బ్యాలెన్స్‌ చేయాలి. ఆ సంగతి పక్కన పెడితే.. నాకు తమిళ సినిమాలు చేయడమంటే ఇష్టం. అక్కడి అమ్మాయిని కదా.. మాతృభాష అంటే కొంచెం ‘సాఫ్ట్‌ కార్నర్‌’ ఉంటుంది.

1945 – ఓ కొత్త అనుభూతి!
ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల్లో ‘1945’ ఒకటి. ఆ కాలం కట్టుబొట్టుతో డిఫరెంట్‌గా కనిపిస్తాను. చీరల గురించి నా డిజైనర్‌తో కలసి చాలా డిస్కస్‌ చేశా. ఈ సినిమాలో సిల్క్, కాటన్‌ చీరల్లో కనిపిస్తా. కాంచీపురం చీరలు సెలక్ట్‌ చేసుకున్నా. మేకప్‌ చాలా చాలా తక్కువ. అసలు లేకపోయినా నో ప్రాబ్లమ్‌. మేకప్‌ వేసుకోవడం నాకు అంతగా నచ్చదు.

ఇలా చెబితే.. తెలుగువాళ్లు ఫీలవుతారు..
ఆ క్లారిఫికేషన్‌ ఇద్దామనుకునే లోపు మీరు క్వొశ్చన్‌ అడిగేశారు. ఆర్టిస్ట్‌గా నాకు బ్రేక్‌ ఇచ్చింది తెలుగు పరిశ్రమే. మంచి కెరీర్‌ ఇచ్చిన తెలుగు పరిశ్రమను మరచిపోతే పెద్ద తప్పవుతుంది. అలాగని ఫస్ట్‌ చాన్స్‌ ఇచ్చిన తమిళ ఇండస్ట్రీని కూడా మరచిపోకూడదు. సింపుల్‌గా చెప్పేస్తానండి. రెండు భాషలకూ ఈక్వల్‌ ఇంపార్టెన్స్‌ ఇస్తా.

త్వరలో రిలీజ్‌ కాబోతున్న ‘బాలకృష్ణుడు’లో మీరు చేసిన క్యారెక్టర్‌ గురించి?
ఇందులో నేను బాగా డబ్బున్న అమ్మాయిని. ధైర్యం ఎక్కువ. నాకేం కావాలంటే అది దక్కాల్సిందే. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. పెంకి అమ్మాయిని. ఇలాంటి క్యారెక్టర్స్‌లో యాక్టింగ్‌కి మంచి స్కోప్‌ ఉంటుంది. గ్లామరస్‌గా కనిపిస్తాను. బాగా డ్యాన్స్‌ చేశాను. ఫైట్స్‌ కూడా చేశానండి. రోప్‌ షాట్స్‌ చేశాను. భలే థ్రిల్‌గా అనిపించింది.

మీ అమ్మానాన్నలకు మీరు ఒక్కతే కూతురు కాబట్టి, రియల్‌గానూ మీరేదనుకుంటే అదేనా?
అంత సీన్‌ లేదు. మా అమ్మగారి డిక్షనరీలో ‘ప్యాంపర్‌’ (గారం) చేయడం అనేది లేదు. తప్పు చేస్తే పనిష్‌మెంట్‌ తప్పదు. అబద్ధాలు ఆడకూడదు. క్రమశిక్షణ పాటించాల్సిందే. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే.

మీ ఫ్యామిలీలో ఫిల్మ్‌ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్‌ పర్సన్‌ మీరే.. ఇక్కడికి రావాలని డిసైడ్‌ అయినప్పుడు మీ అమ్మానాన్నల ఫీలింగ్‌?
జనరల్‌గా పిల్లలు కొత్త జాబ్‌కి వెళితే ఏ పేరెంట్స్‌కి అయినా కొంత భయం ఉంటుంది. ఇక, ఫిల్మ్‌ ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి, భయపడ్డారు. నాకూ భయంగానే ఉండేది. అయితే బయట అందరూ చెప్పుకునేంత ఇబ్బందులు ఉండవు. మన పని మనం చేసుకుంటూ వెళితే ఎవరూ ఏమీ అనరు.

ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చామని ఎప్పుడైనా ఫీలయ్యారా?
ఒకట్రెండుసార్లు అనిపించింది. ముఖ్యంగా 2015లో. ఆ సమయంలో నన్ను ఎగై్జట్‌ చేసే చాన్స్‌లు రాలేదు. ఎందుకిలా జరుగుతోంది? లైఫ్‌ ఎటువైపు వెళుతోంది? అనే ఆలోచన మొదలైంది. డిఫరెంట్‌ ప్రాబ్లమ్స్‌. వాటిని ఎలా ఓవర్‌కమ్‌ చేయాలి? అని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు ఒక్క విషయం తెలిసింది. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు మన గురించి మనకు ఏమీ తెలియదని.

డౌన్‌ ఫాల్‌లో ఉన్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్‌? ఎంత బాగా ఆలోచించగలుగుతాం? నిర్ణయాలు తీసుకోగలుగుతామా? లేదా.. ఇలా మన గురించి మనకు ఓ క్లియర్‌ పిక్చర్‌ వచ్చేస్తుంది. అందుకే అంటున్నా.. జీవితంలో ‘డౌన్‌ఫాల్‌’ కూడా ముఖ్యం. నేను డైలమాలో పడినప్పుడు అవసరాల శ్రీనివాస్‌ నుంచి ‘జో అచ్యుతానంద’ ఆఫర్‌ వచ్చింది.. అంగీకరించాను. ఆ సినిమా నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ఆ తర్వాత తమిళంలో బిజీ కావడం, తెలుగులోనూ చేస్తుండటంతో ఆ ‘డిఫరెంట్‌ ఫేజ్‌’ దాటేశాను.

డిసెంబర్‌లో సర్‌ప్రైజ్‌!
నేనిప్పటివరకూ 25 సినిమాలకు పైగా చేశాను. వీటిన్నింటిలో కనిపించిన దానికన్నా ఓ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించబోతున్నా. ఈ సినిమాకి సంబంధించిన నా కొత్త లుక్‌ డిసెంబర్‌లో వస్తుంది. ఆ లుక్‌ అందరికీ ఓ సర్‌ప్రైజ్‌. ఆ సినిమా వివరాలు కూడా అప్పుడే చెబుతా.

హిందీలో ‘ఆంఖే 2’కి అవకాశం వచ్చింది కదా.. ఇప్పుడా సినిమా ముందుకు వెళ్లినట్లు అనిపించడం లేదు?
నేనా సినిమా చేయడంలేదు. ‘ఆంఖే 2’ కరెంట్‌ స్టేటస్‌ తెలీదు. ప్రస్తుతానికి ఆగిందని విన్నాను.

ఫస్ట్‌ హిందీ మూవీకే ఇలా జరగడం బాధగా...
అలాంటిదేం లేదు. ఇది లైఫ్‌. ఏం జరుగుతుందో చెప్ప లేం. అందుకే లైట్‌ తీసుకున్నా.

మీ మాటలు ‘కర్మ సిద్ధాంతాన్ని’ ఫాలో అవుతారేమో అనిపించేలా ఉన్నాయా?
ఎగ్జాట్లీ. ‘ఎల్లామ్‌ తల విధి. ఎన్న ఎళుది ఇరుక్కో అదుదాన్‌ నడక్కుం’. (అంతా తలరాత. ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అని అర్థం).

సడన్‌గా మీ మాతృభాషలోకి వచ్చేశారేంటి?
ఇలాంటి పెద్ద విషయాల గురించి మాట్లాడేటప్పుడు మదర్‌ టంగ్‌లో ఈజీగా ఎక్స్‌ప్లెయిన్‌ చేయొచ్చు. ‘తల విధి’ని తెలుగులో ఏమంటారో తెలియదు (నవ్వుతూ).

మణిరత్నం ‘యువ’లో సూర్య చెల్లెలి క్యారెక్టర్‌కి తీసుకోవాలనుకుంటే.. మీరేమో అందుబాటు లో లేరట.. అదేమైనా బాధగా ఉంటుందా?
దూరదర్శన్‌ కోసం నేనో షో చేశాను. ఒక్క ఎపిసోడ్‌కే అది ఆగిపోయింది. ఆ షో డైరెక్టర్‌ మణిరత్నంగారికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌. ‘యువ’లో చెల్లెలి క్యారెక్టర్‌ కోసం నన్ను తీసుకోవాలనుకున్నారట. కానీ, మేం వేరే ఇంటికి మారడంతో అడ్రస్‌ తెలుసుకోలేకపోయారు. అలా ‘యువ’ చాన్స్‌ మిస్సయ్యాను. మణిరత్నంగారు గ్రేట్‌ డైరెక్టర్‌. చూద్దాం.. భవిష్యత్తులో చాన్స్‌ వస్తుందేమో.

శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ వదులుకోవడం ‘రాంగ్‌ డెసిషన్‌’ అని ఎప్పుడైనా అనిపించిందా?
ఆ టైమ్‌కి అదే కరెక్ట్‌ డెసిషన్‌ అనే ఫీలింగ్‌ ఇప్పటికీ ఉంది. శేఖర్‌ కమ్ములగారంటే నాకు గౌరవం. ఆయన మంచి డైరెక్టర్‌. అయితే ఆ టైమ్‌లో ‘సోలో’ హీరోయిన్‌గా ‘ఎస్సెమ్మెస్‌’ మూవీలో చాన్స్‌ వచ్చింది. అందుకని ఆ ∙సినిమా చేయడమే బెటర్‌ అనిపించింది.

ఆ చాన్స్‌ వస్తే.. కత్తి తిప్పుతా
‘బాహుబలి’ లాంటి సినిమాకి అవకాశం వస్తే.. కాదనకుండా ఒప్పేసుకుంటా. అయితే నాకు హార్స్‌ రైడింగ్, స్వోర్డ్‌ ఫైట్‌ తెలియదు. కానీ, సినిమా కోసం నేర్చుకుంటా. కొత్త విషయాలు నేర్చుకోవడమంటే నాకు సరదా. రిస్క్‌ అయినా ఫర్వాలేదు..

త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఈ ఏడాది ఎలా గడిచింది?
తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడిచింది. మంచి క్యారెక్టర్స్‌కి అవకాశం వచ్చింది. వచ్చే ఏడాది కూడా ఇలానే పాజిటివ్‌గా ఉండాలనుకుంటున్నా.

– డి.జి. భవాని

మరిన్ని వార్తలు