కొబ్బరికొట్టులో కొలువుతీరిన బాలబాలాజీ

2 Jan, 2018 23:57 IST|Sakshi

పుణ్య తీర్థం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతూ... కోనసీమవాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ బాల బాలాజీ స్వామి కొలువు తీరిన గ్రామం అప్పనపల్లి. పవిత్ర వైనతేయ గోదావరి నది సోయగాలతో నిత్యం వేలాదిమంది భక్తుల గోవింద నామస్మరణలతో అలరారుతున్న ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. గ్రామ చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు స్ఫురణకు వస్తాయి. బాలాజీ ఎక్కడున్నా నిత్యకల్యాణం పచ్చతోరణమే కదా... అప్పనపల్లి కూడా అదే సంప్రదాయాన్ని అందిపుచ్చుకుంది.

 దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ‘అప్పన్న’ అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివసాక్షాత్కారం పొందాడని, ఈ ‘అర్పణ’ ఫలితాలు కాలక్రమేణా ‘అప్పనపల్లి’గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం ప్రచారంలో ఉంది. 

కొబ్బరి కొట్టులో కొంగుబంగారంగా...
ఆలయ వ్యవస్థాపకుడు మొల్లేటి రామస్వామి పూర్వకాలం నుంచి కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారం నష్టాలతో నడుస్తుండడంతో తిరుమల శ్రీవారికి వ్యాపారంలో వాటా పెడతానని మొక్కుకున్నారు. అప్పటినుంచి ఆ వ్యాపారం లాభాల బాటలో పయనించింది. దాంతో మొక్కుబడి ప్రకారం లాభంలో 10 శాతం వాటాను తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి సమర్పించేవారు. 1960వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని తీసుకు వచ్చి కొబ్బరి కొట్టులో ప్రతిష్టించారు. లాభంలో కొంత వాటాను తిరుమల తిరుపతి తీసుకు వెళ్లి స్వామివారి పాదాల చెంత పెట్టేందుకు రామస్వామి ప్రయత్నించగా అర్చకులు అంగీకరించలేదు. అర్చకులతో వాదించి, వాదించి అలసి నిద్రిస్తున్న రామస్వామికి స్వప్నంలో శ్రీనివాసుడు సాక్షాత్కరించి తానే అప్పనపల్లి వస్తానన్నాడట. అన్నమాట ప్రకారం ముద్దులొలికే బాలుడి విగ్రహ రూపంలో కొబ్బరికాయల మధ్యన కనిపించాడట. ఆ ముద్దుల బాలుని చూసి మైమరచిన రామస్వామి కొట్టులో ప్రతిష్టించిన స్వామి వారికి బాల బాలాజీగా నామకరణం చేశారు. ఆ విధంగా ప్రతిష్టించిన శ్రీబాల బాలాజీ స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చేవారు. వారి సంఖ్య క్రమేపి పెరిగి దిన దిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పోటెత్తడంతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రామస్వామి. 

నూతన ఆలయ నిర్మాణం
1970 మార్చి18న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కొబ్బరికొట్టులో ప్రతిష్టించిన శ్రీవారి చిత్రపటాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో నూతన ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. కొత్తగుడిపై చిత్రీకరించిన గోవు–గొల్లవాడు, గీతోపదేశం వంటి అద్భుత చిత్రాలు భక్తులను పరవశింపజేస్తాయి. 1991లో పద్మావతి, ఆండాళ్, గరుడాళ్వార్‌లను శ్రీమాన్‌ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించారు. 

అన్నదానానికి ఆదర్శంగా ఆ ఆలయం
అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి ఆలయం అన్నదానానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అప్పనపల్లిలోనే అన్నదానానికి నాంది పలికారు. 1977వ సంవత్సరంలో ఆలయ నిర్మాత మొల్లేటి రామస్వామి నిత్యాన్నదాన పథకానికి శ్రీకారం చుట్టారు. అన్నదానానికి అప్పనపల్లి ఆదర్శంగా నిలిచింది. నిత్యం బూరె, పులిహోర, మూడు రకాల కూరలు, పెరుగుతో అమలు చేస్తున్న అన్నదాన పథకం ఆలయ చరిత్రలో విశిష్టంగా నిలుస్తుంది. రోజూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ ఆలయంలో భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. 
నిత్యం రెండు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శని, ఆదివారాలు ఈ సంఖ్య గణనీయంగా ఉంటోంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులో అధిక శాతం మంది స్వామి వారి భోజనాన్ని అన్నప్రసాదంగా స్వీకరిస్తున్నారు. నిత్యం లక్ష్మీనారాయణ హోమం, ఉభయదేవేరులతో కల్యాణం, ఏడాదికోసారి దివ్య తిరుకల్యాణోత్సవాలు, అధ్యయనోత్సవాలతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణలతో మారుమోగుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న ధనుర్మాస దీక్షలు భోగిరోజున జరిగే గోదా కల్యాణోత్సవంతో ముగియనున్నాయి. 

ఆలయానికి చేరుకునేది ఇలా...  
స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా తాటిపాక చేరుకోవాలి. రాజమండ్రి నుంచి ఆలయానికి 70 కిలో మీటర్లు దూరం. కాకినాడ నుంచి అమలాపురం పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలోమీటర్లు. పైన పేర్కొన్న ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయాలు ఏర్పాటు చేశారు.
– ఏడిద బాలకృష్ణారావు 
సాక్షి, మామిడికుదురు, తూర్పు గోదావరి జిల్లా 

అద్భుతాలమయం భోగేశ్వరాలయం
ఓరుగల్లు అనగానే కాకతీయులు నిర్మంచిన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం (వేయిస్తంభాల గుడి), శ్రీ సిద్ధేశ్వర ఆలయం, శ్రీ పద్మాక్షి ఆలయం, శ్రీ భద్రకాళి ఆలయం వంటివి జ్ఞాపకం రావడం సహజం. అయితే, వాటితోపాటు వరంగల్లు, హన్మకొండల నడుమ మరో సుప్రసిద్ధమైన ఆలయం ఉంది. అదే శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం. మట్టెవాడ అనే ప్రదేశంలోని ఈ ఆలయం గర్భాలయంలోని ప్రధానలింగం ఎంతో విశిష్టమైనది. పానవట్టం పైన ఉన్న లింగభాగాన్ని పక్కకు జరపడానికి వీలుగా ఉంటుంది. పానవట్టం కింది భాగం బోలుగా ఉంటుంది. పానవట్టం అడుగుభాగంలో, శివలింగం కింద మేరుప్రస్తార రూపంలో ఉన్న ఒక శ్రీచక్రం ఉన్నదట. ఆ శ్రీచక్రం కింద సువర్ణలింగం ఉన్నదని ప్రతీతి. ఆ శ్రీచక్రం బిందుస్థానంలో మరొక చిన్న రాతి లింగం ఉన్నదట. అంటే అది అంతరలింగం అన్నమాట. ఆ శ్రీచక్రాన్ని కప్పివేస్తూ పానవట్టం ఉంటుంది. ఈ భోగేశ్వరలింగానికి అభిషేకం చేస్తే, ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు. మరోవిశేషం ఏమిటంటే, ఈ శివలింగానికి ఎన్ని బిందెల నీళ్లతో అభిషేకం చేసినా, ఒక్క చుక్క నీరు కూడా సోమసూత్రం ద్వారా బయటకు రాదు. గుడికి నైరుతి భాగంలోని బావిలోకి పోతుందంటారు. శివలింగానికి వెనకవైపున వామాంకిత స్థితౖయెన గౌరీదేవితో సహా ఈశ్వరుని విగ్రహం, ఆ విగ్రహం పైభాగంలో ఒక తల ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి, గోడలపై చెక్కిన శిలాశాసనాలను బట్టి అది కాకతీయుల కాలం నాటిదని ఇట్టే చెప్పవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  ఎక్కడ ఉంది? వరంగల్‌ స్టేషన్‌ నుంచి దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ భోగేశ్వర ఆలయం ఉంది. వరంగల్‌ నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాలద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

మరిన్ని వార్తలు