చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా!

22 Dec, 2019 00:32 IST|Sakshi

కె. వి. రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్‌లో నేను చిన్న శశిరేఖగా నటించాను. నాకు తొమ్మిదేళ్ల వయసులో సావిత్రి అమ్మ చిన్నప్పటి వేషంలో నేను నటించడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పటికీ. ఈ సినిమా ‘శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా!’ అనే పాటతో ప్రారంభమవుతుంది. ఈ పాటలో నా చేత చాలా బాగా నటింపచేశారు దర్శకులు. సావిత్రిగారికి ఏ కాస్ట్యూమ్స్‌ వాడారో నాకు కూడా అవే వాడారు. మాయాబజార్‌లో నటించిన పెద్దపెద్ద నటులంతా నన్ను ఆశీర్వదించారు. ‘సకల సౌభాగ్యవతి రేవతీదేవి తల్లిౖయె దయలెల్ల వెల్లివిరియగను/అడుగకే వరములిడు బలరామదేవులే జనకులై కోరిన వరములీయగను’ అంటూ గుమ్మడిగారు, ఛాయాదేవిగారు నన్ను ఆశీర్వదిస్తారు.

ఆ తరవాత ‘శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి పినతల్లిౖయె నిన్ను గారాము శాయా/అఖిల మహిమలు కలుగు కృష్ణపరమాత్ములే పినతండ్రిౖయె సకల రక్షణలు శాయా’ అంటూ ఎన్‌.టి. రామారావుగారు, సంధ్య గారు నన్ను గారాం చేస్తారు. ఇక చివరి చరణంలో ‘ఘనవీరమాతయగు శ్రీసుభద్రాదేవి మేనత్తౖయె నిన్ను ముద్దు శాయగను/ పాండవాయువరాజు బాలుడభిమన్యుడే బావౖయె నీవె తన లోకమని మురియ’ అంటూ ఋష్యేంద్రమణిగారు సుభద్రగా నన్ను ఆప్యాయంగా దీవిస్తారు. ఈ పాటలో అందరూ నన్ను దీవించడం నాకు చాలా సంతోషంగా ఉండేది. నేను చిన్నపిల్లను అయినా నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను చాలా అదృష్టవంతురాలిని. హాలీవుడ్‌ సినిమటోగ్రాఫర్‌ మార్కస్‌ బార్ట్‌లే నన్ను చాలా అందంగా చూపించారు. పసుమర్తి కృష్ణమూర్తిగారు కొరియోగ్రఫీ చేశారు. నేను చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకోవడం వల్ల నా ముఖంలో భావాలు బాగానే చూపించగలిగాను.

షూటింగ్‌ సమయంలో అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఎవరు ఎలా చేస్తే అలా వెంటనే అనుకరించేదాన్ని. సావిత్రి అమ్మ నటనను బాగా గమనించమని కె. వి. రెడ్డిగారు సూచించారు. నేను బాగా పరిశీలించి అచ్చం ఆవిడ చేసినట్లు చేయడానికే ప్రయత్నించాను. ఈ పాట షూటింగ్‌ అంతా వాహినీ స్టూడియోలో జరిగింది. నాగిరెడ్డి, చక్రపాణిగార్లకు నేనంటే ఇష్టం. మాయా బజార్‌ చిత్రానికి బాలతారగా వంద రోజుల మెమెంటోను అందుకున్నాను. మా స్వస్థలం చెన్నై. నా అసలు పేరు  సరస్వతి. మా అమ్మమ్మ సచ్చు అని పిలిచేది. సినిమా రంగంలో నా పేరు సచ్చుగానే స్థిరపడిపోయింది. మాయాబజార్‌ సినిమాకి  నా డబ్బింగ్‌ నేనే ఇచ్చాను. కె. వి. రెడ్డి గారు, పింగళి నాగేంద్ర గారు దగ్గరుండి స్పష్టంగా వచ్చేవరకు నేర్పారు. నేను బేబీ ఆర్టిస్టుని అనే చిన్నచూపు లేకుండా తర్ఫీదు ఇచ్చారు. మాది సంప్రదాయ కుటుంబం. అమ్మనాన్నలకు నేను సినిమాలలో నటించడం ఇష్టం లేదు. కాని మా అమ్మమ్మ నన్ను బాగా ప్రోత్సహించేది. ఆవిడే దగ్గరుండి షూటింగ్‌కి తీసుకువెళ్లేది. కొంతకాలం బాలతారగా నటించాక, ప్రజానాయకుడు, విమల, బొమ్మా బొరుసా వంటి అనేక చిత్రాలలో ప్రధాన పాత్రలో నటించాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు