అమ్మకు తెలియదా!

26 Aug, 2019 06:40 IST|Sakshi

ఒకరోజున ఆరుగురు వ్యాపారస్థులు నెత్తిన దూది బస్తాలు పెట్టుకొని వ్యాపార నిమిత్తం సమీప పట్టణానికి బయలు దేరారు. ప్రయాణం అడవిమార్గం గుండా సాగుతుంది. ఆ మార్గం కాస్త భయంకరమైనదని, క్రూరమృగాలతోపాటు దోపిడీదారులున్నారని కూడా తెలుసు. దాంతో వీలైనంత తొందరగా భయం భయంగా అడవి దాటాలని చూస్తున్నారు. నిజంగానే ఒక అడవిదొంగ దారికాచి వీరిని గమనించాడు. ఇప్పుడు వీరిని అడ్డగించి దోచుకోవడంవల్ల ప్రయోజనముండదు. వీరు వ్యాపారం ముగించుకొని తిరిగి వచ్చేటపుడు వీరి దగ్గర ధనముంటుంది. అప్పుడు దోచుకోవచ్చనుకున్నాడు. అతని దగ్గర తుపాకి వుంది. తూటాలు వేరుగా దాచుకున్నాడు. అవి తను స్వయంగా పేలుడు మందు, రవ్వలు దట్టించి, తూటా మూసి మైనపు పూతతో కప్పి తయారు చేసుకున్నాడు. వ్యాపారస్థులు అడవి దాటి మైదానం చేరుకున్నారు. ముందుకు సాగుతున్నారు. కనుచూపు మేరలో నీడలేదు.

ఎండ మెండుగా వుంది. వేడికి తట్టుకోలేకపోతున్నారు. అటూ ఇటూ చూస్తే కొద్ది దూరంలో ఓ చెట్టు కనబడింది. ఆ నీడ చాల చిన్నది. ఆరుగురు నిలబడితే మాత్రం నీడ పడుతుంది. బస్తాలు నీడన పెట్టలేరు. సరే కాసేపు సేదదీరుదామని ఆరుగురూ చెట్టు నీడన చేరి, పత్తిబస్తాలు ఎండలోనే చుట్టూ పెట్టుకొని నిలుచున్నారు. కొంచెం సాంత్వన కలిగింది. ఇంతలో చూస్తుండగనే ఎండ వేడికి పత్తిబస్తాలు అంటుకున్నాయి. గమనించే లోపే ఆరు పత్తిబస్తాలు కాలి బూడిదయిపోయాయి. ‘‘అమ్మా! నిన్ను తలచి వ్యాపారానికి బయలుదేరాను. కానీ నువ్వు చేసిందేమిటి? నా సరుకును సర్వనాశనం చేశావు. నేను బతికేదెలా? నిన్ను ప్రార్థించడం, పూజించడం వృథా’’ అంటూ నిందించడం మొదలుపెట్టాడు వారిలోని ఓ వ్యాపారి. మిగతా వారు అతన్ని ఓదార్చారు. కాసేపయ్యాక  చేసేదేమీ లేక తిరుగు ప్రయాణమయ్యారు.

అడవిదొంగ వీరి రాకను గమనించి వారివద్ద ధనం దోచుకుందామని, తుపాకీ పేల్చి భయపెట్టాలనుకున్నాడు. తుపాకీ పేలలేదు. ఎండవేడిమికి తూటాలపై పూసిన మైనం కరిగిపోవడంవల్ల, తూటాలో మందు పట్టుతగ్గడంవల్ల తూటా పేలలేదు. అతను ఒక్కడు... వీరు ఆరుగురు. లాభం లేదనుకొని దొంగ పారిపోయాడు. ఐదుగురు బతుకుజీవుడా అనుకున్నారు. అమ్మను నిందించిన వాడు మాత్రం భూమిపై పడి, భూమికి నమస్కరించి ఏడుస్తున్నాడు. ‘‘అమ్మా! నీ కరుణను తెలుసుకోలేకపోయాను. మన్నించు. నిన్ను నమ్మినవారికి నాశనమేముంటుంది? బతుకునిచ్చావమ్మా. క్షమించు’’ అంటూ చింతిస్తున్నాడు. పశ్చాత్తాపపడుతున్నాడు. అమ్మకు తెలియదా... తన బిడ్డలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో!– విశ్వేశ్వరవర్మ భూపతిరాజు

మరిన్ని వార్తలు