గూఢచారి 100

14 Jul, 2017 23:06 IST|Sakshi
గూఢచారి 100

15 అక్టోబర్‌ 1917, పారిస్‌
నిలబడి ఉంది మాతాహరి. నలభై ఏళ్ల అందమైన ‘గూఢచారి’! ఆమె ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఫ్రెంచి ఆర్మీ ఫైరింగ్‌ స్క్వాడ్‌ ఆఫీసర్‌ ఉన్నాడు. ఆయన వెనుక మరికొంత మంది ఫైరింగ్‌ సిబ్బంది ఉన్నారు. క్షణాలు గడుస్తున్నాయి. మతాహరి కళ్లు వాళ్లందరి వైపు అమాయకంగా చూస్తున్నాయి. మరికొన్ని క్షణాలు గడిచాయి. ఆ తర్వాత.. కాలం కొన్ని లిప్తలు స్తంభించింది. ఒక్కసారిగా ఫైరింగ్‌ ఆఫీసర్‌ ఆమెపై కాల్పులు జరిపాడు. మొదట మాతాహరి తల వాలిపోయింది. క్రమంగా ఆమె తన మోకాళ్ల మీద ఒరిగిపోయింది. అలా వాలిపోతూ, ఒరిగిపోతూ  ఫైరింగ్‌ ఆఫీసర్‌ కళ్లలోకి చూసింది! ఫైరింగ్‌ ఆఫీసర్‌ ఆమె దగ్గకు వచ్చి రివాల్వర్‌తో మళ్లీ ఒకసారి ఆమె నుదుటిపై కాల్చి, మరణించిందని నిర్థారించుకుని వెళ్లిపోయాడు.

2017... వందేళ్ల తరువాత
మాతాహరిని ఫ్రాన్స్‌ ప్రభుత్వం అన్యాయంగా చంపేసిందని.. ఈ రంగస్థల నటి అందమైనదే కానీ దేశాలను వణికించేటంతటి తెలివితేటలున్న గూఢచారి కాదనీ.. ఫ్రాన్స్‌ ఆర్మీ తన తప్పిదాలను, అసమర్థతలను కప్పిపుచ్చుకోడానికి మాతహరిని పొట్టనపెట్టుకుందని ఈ వందేళ్లుగా చరిత్రకారులు ఘోషిస్తూనే ఉన్నారు. ఆ ఘోషను భరించలేక ఫ్రాన్స్‌ ఆర్మీ ఆనాటి మాతాహరి విచారణ పత్రాలను తప్పనిసరై నేడో రేపో ప్రపంచానికి బహిర్గతం చెయ్యబోతోంది. ఈ సందర్భంగా.. చరిత్రలో మంచికో, చెడ్డకో ప్రఖ్యాతిగాంచిన కొందరు గూఢచారుల గురించి తెలుసుకుందాం.

బయటపడేవరకు ‘స్పై’ ఎవరో, మామూలు ‘గై’ ఎవరో నరమానవుyì కి తెలీదు. బయటపడ్డాకైనా స్పై కనిపించడు. ఉంటే జైల్లో ఉంటాడు లేదంటే సమాధి కింద ఉంటాడు! శత్రువుకు దొరికి బతికి బట్టకట్టిన స్పైలు ఎవరూ ప్రపంచ చరిత్రలోనే లేరు! డేంజరస్‌ అండ్‌ డెడ్లీ జాబ్‌ అది! అయినా అంత డేంజరస్‌ పనిని స్పైలు ఎందుకు ఎంచుకుంటారు? డబ్బు కోసం. కాకుంటే.. దేశం కోసం! నవలల్లో, సినిమాల్లో డైనమిక్‌ స్పైలను చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. నిజానికి రియల్‌ లైఫ్‌లోని స్పైలు అంతకంటే చురుగ్గా, దుస్సాహసాలు చేస్తూ ఉంటారు. అలాంటి ఓ టాప్‌ టెన్‌ స్పైలు వీళ్లు.
http://img.sakshi.net/images/cms/2017-07/41500052986_Unknown.jpg
రిచర్డ్‌ సార్జ్‌ (49), సోవియట్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌
కోడ్‌ నేమ్‌ రామ్సే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్నలిస్టుగా జపాన్‌లోకి, జర్మనీలోకి ఎంటర్‌ అయ్యాడు. జపాన్, జర్మనీ కలిసి రష్యాకు వ్యతిరేకంగా పన్నుతున్న వ్యూహాలను కనిపెట్టి రష్యాకు చేరవేశాడు. 1941లో జపాన్‌ అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఉరి తీసింది.

ఏం చేరవేశాడు?: ∙సోవియట్‌ యూనియన్‌పై హిట్లర్‌ దాడి చేయబోతున్నాడని. ∙సమీప భవిష్యత్తులో జపాన్‌ సోవియట్‌ యూనియన్‌పై దాడి చేసే అవకాశాలు లేవని.

సిడ్నీ రెయిలీ (52) బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌
‘ఏస్‌ ఆఫ్‌ స్పైస్‌’ అని పేరు. అంటే.. మేటి గూఢచారి అని. పూర్తి పేరు సిగ్మండ్‌ జార్జీవిచ్‌ రోజెన్‌బ్లమ్‌. పుట్టింది రష్యాలో. ఇతడు ఒక దేశానికే స్పైలా పని చేయలేదు! నిన్న గడపిన ట్లు నేడు, నేడు గడిపినట్లు మర్నాడు గడపలేదు. భోగిలా జీవించాడు. జేమ్స్‌ బాండ్‌ పాత్ర కల్పనకు ఇతడూ ఒక ఇన్‌స్పిరేషన్‌.  

ఏం చేరవేశాడు?: చేరవేయడం అన్నది చిన్నమాట. పెద్ద పెద్ద ప్లాన్‌లే వేశాడు.
సోవియట్‌ నాయకుడు లెనిన్‌ హత్యకు ప్లాన్‌ ఇతడిదే. కానీ ఆ ప్లాన్‌ విఫలమైంది. తెలివిగా తప్పించుకున్నాడు.  ∙1925లో సోవియట్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం దొరికిపోయాడు. వెంటనే రష్యా అతడికి మరణశిక్ష విధించింది. సిడ్నీ గుండెల్లోకి బులెట్‌ పేల్చి చంపేశారు.

ది కేంబ్రిడ్జ్‌ ఫైవ్‌ (ఐదుగురి బృందం)
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్‌ సీక్రెట్‌ సర్వీస్‌లో పనిచేసిన ఐదుగురు సోవియట్‌ స్పైల గ్రూప్‌ ఇది! వీళ్లు అయిదుగురూ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదువుకున్నారు. ‘ది కేంబ్రిడ్జ్‌ ఫైవ్‌’ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఈ ఐదుగురిలో కిమ్‌ ఫిల్బీ మోస్ట్‌ పాపులర్‌.  గ్రూపులోని మిగతా సభ్యులు.. డొనాల్డ్‌ డ్యూవర్ట్‌ మక్లీన్, గై బర్జెస్, ఏంథోనీ బ్లంట్‌. చివరి వ్యక్తి ఎవరో ఇప్పటికీ ప్రపంచానికి తెలీదు. కేంబ్రిడ్జిలో ఉన్నప్పుడు మార్క్సిస్టులుగా మారిన ఈ ఐదుగురూ ఆ ప్రభావంతోనే సోవియట్‌కు అనుకూలంగా వివిధ దేశాలలో స్పయింగ్‌ చేశారు. వీళ్లలో ఒక్కరు కూడా శత్రుదేశాలకు చిక్కలేదు. చివరి వరకు మాస్కోలోనే సురక్షితంగా ఉండి వయసుతోపాటు వచ్చే అనారోగ్యాలతో మరణించారు.

ఏం చేరవేశారు?: ∙అమెరికా, బ్రిటిష్‌ దేశాలలోని గూఢచారుల వివరాలు సేకరించి సోవియట్‌ యూనియన్‌కి అందించేవారు. సోవియెట్‌ యూనియన్‌ ఆ గూఢచారులను హతమార్చేది.

ఆల్డ్రిచ్‌ ఏమ్స్‌ (76) సి.ఐ.ఎ. ఆఫీసర్‌
ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. రష్యాకు, అమెరికాకు మధ్య పైకి కనిపించని యుద్ధం (కోల్డ్‌ వార్‌) జరుగుతున్నప్పుడు స్వదేశానికి వ్యతిరేకంగా సోవియట్‌ యూనియన్‌కు గూఢచారిగా పనిచేశాడు ఈ అమెరికన్‌ ఆఫీసర్‌! ‘నా దగ్గర అమెరికా రహస్యాలు ఉన్నాయి. వాటిని మీకు ఇస్తే నాకు ఎంత ఇస్తారు?’ అని కె.జి.బి.(రష్యా గూఢచార సంస్థ)తో బేరం కూడా కుదుర్చుకున్నాడు. ఆల్డ్రిచ్‌ ఎంత సంపాదించినా, అతడి విలాసవంతమైన జీవితానికి అది సరిపోయేది కాదు. చివరికి దేశద్రోహానికి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్‌ చేశారు. అమెరికా అతడికి జీవిత ఖైదు విధించింది.


ఏం చేరవేశాడు?: ∙రష్యాలో గూఢచర్యం చేస్తున్న దాదాపు 100 మంది అమెరికన్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ల వివరాలు రష్యాకు వెల్లడించాడు.


మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రోజెన్‌బర్గ్స్‌ (అమెరికన్‌ పౌరులు!)
వీళ్లిద్దరూ భార్యాభర్తలు. భర్త పేరు జూలియస్‌ రోజెన్‌బర్గ్స్‌. భార్య ఎథెల్‌. వీళ్లిద్దరూ చరిత్రలోనే ప్రసిద్ధి చెందిన ఏజెంట్‌ కపుల్‌. జూలియస్‌ రష్యా గూఢచార సంస్థ కె.జి.బి.లోని అత్యున్నస్థాయి అజ్ఞాత స్పైలలో ముఖ్యుడు. ఇంకా చాలమందిని ఇతడే స్పైలుగా కె.జి.బి.లో నియమించాడు. భార్య, భార్య సోదరుడు సార్జెంట్‌ డేవిడ్‌ గ్రీన్‌ గ్లాస్‌లతో కలిసి అమెరికా వైమానిక, అణు పరిశోధన వివరాలను కూడా కె.జి.బి.కి అందించాడు. గ్రీన్‌గ్లాస్‌ పోలీసులకు చిక్కినప్పుడు నిజాలన్నీ చెప్పేశాడు. భార్యాభర్తలు అరెస్ట్‌ అయ్యారు. 1953లో అమెరికా ప్రభుత్వం వీరిని ఎలక్ట్రిక్‌ ఛెయిర్‌లో కూర్చోబెట్టి మరణశిక్ష అమలు చేసింది.

ఏం చేరవేశారు?: ∙సోవియట్‌ యూనియన్‌కి స్వదేశీ అణు రహస్యాలను అందించారు. ∙అమెరికా రాడార్లు, జెట్‌ ఇంజన్‌ల టెక్నాలజీని కూడా రష్యాకు పాస్‌ చేశారు.

క్లాస్‌ ఫోక్స్‌ (76) సోవియట్‌ గూఢచారి
జర్మనీలో పుట్టాడు. కెరియర్‌ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడి లాస్‌ అలామోస్‌ లేబరేటరీలో థియరిటికల్‌ఫిజిక్స్‌ డివిజన్‌లో చేరాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్, కెనడాల ఉమ్మడి ప్రయోజనాల కోసం మాన్‌హట్టన్‌ పేరుతో ఆ ల్యాబ్‌లో జరుగుతున్న అణ్యాయుధాల పరిశోధనా వివరాలను రహస్యంగా సేకరించి పెట్టుకున్నాడు.  ఫోక్స్‌ మొదట్లో అణు బాంబు తయారు చేయడం కోసం బ్రిటిష్‌ ప్రాజెక్టులో పని చేశాడు. మాన్‌హటన్‌ ప్రాజెక్ట్‌లో చేరాక, సోవియట్‌ స్పైగా మారాడు. 1950లో అరెస్ట్‌ అయ్యాడు. జైలుకు వెళ్లొచ్చాడు. జర్మనీలో స్థిరపడ్డాడు.

ఏం చేరవేశాడు?: ∙మాన్‌హటన్‌ ప్రాజెక్టు గురించి సోవియెట్‌ యూనియన్‌కు కీలకమైన ఇన్ఫర్మేషన్‌ ఇచ్చాడు.

డ్యుసన్‌ పోపోవ్‌ (69), బ్రిటిష్‌ ఏజెంట్‌
జగద్విఖ్యాతి చెందిన జేమ్స్‌బాండ్‌ పాత్రకు ఇన్‌స్పిరేషన్‌ ప్రధానంగా ఇతడేనని అంటారు. పోపోవ్‌ సెర్బియాలో పుట్టాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎం.ఐ.16 (బ్రిటన్‌ గూఢచార సంస్థ)లో పనిచేశాడు. జర్మనీలో ఇతడి కోడ్‌ నేమ్‌ ఇవాన్‌. బ్రిటన్‌ పెట్టుకున్న కోడ్‌ నేమ్‌ ట్రై సైకిల్‌. ఏ దేశానికి ఇతడు ఎలాంటి ఇన్‌ఫర్మేషన్‌ ఇస్తాడో తెలీదు! బ్రిటన్‌ తరఫున జర్మనీకి తప్పుడు ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ గూఢచారి మీద కూడా రానన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలో పోపోవ్‌ మీద వచ్చాయి.    

ఏం చేరవేశాడు? : ∙పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడి చేయబోతున్నదనే సమాచారం ఇచ్చి ఎఫ్‌.బి.ఐ.ని హెచ్చరించింది ఇతడే.

ఇసబెల్లా బాయ్‌డ్‌ (56), అమెరికన్‌ స్పై
బెల్‌ బాయ్‌డ్‌గా ప్రసిద్ధి. అమెరికా అంతర్యుద్ధంలో ఈమె కాన్ఫెడరేట్‌ ఆర్మీ గూఢచారిగా పనిచేశారు. బెల్‌ తండ్రికి హోటల్‌ ఉండేది. అందులో కూర్చొని ఈమె తన ఆపరేషన్స్‌ని నిర్వహించేవారు.  బెల్‌ 1862లో ఒకసారి అరెస్ట్‌ అయ్యారు. కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటికి వచ్చాక ఇంగ్లండ్‌ వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ అమెరికా వచ్చారు. 1900లో చనిపోయారు.


ఏం చేరవేశారు?: అమెరికా అంతర్యుద్ధంలో కాన్ఫెడరేషన్‌ ఆర్మీ తరఫున ప్రత్యర్థి వర్గమైన ‘యూనియన్‌ ఆర్మీకి’కు వ్యతిరేకంగా సమాచారాన్ని సేకరించి కాన్ఫెడరేషన్‌కి లబ్ధి గలిగేలా చేశారు.  

మాతా హరి (41) జర్మనీ గూఢచారి
మాతా హరి స్టేజ్‌ ఆర్టిస్ట్‌. డాన్సర్‌. పారిస్‌లో సంపన్న పురుషుల కలలరాణి. మాతా హరి ‘క్వీన్‌ ఆఫ్‌ స్పైస్‌’. మనం అనడం కాదు. ఆ పేరుతోనే ఆమె ప్రసిద్ధి. జన్మస్థలం నెదర్లాండ్స్‌. అసలుపేరు మార్గరీటా గీర్ట్రూడ జెల్లె యాక్లియోడ్‌. దేశాధినేతలతో సంబంధం ఉన్న ధనవంతులను వశపరుచుకుని విలువైన రహస్య సమాచారాన్ని సేకరించడంలో మాతాహరి ఎక్స్‌పర్ట్‌. 1917లో ఫ్రెంచి నిఘా వర్గాలు... ఈమె తమ దేశంలో జర్మనీ స్పైగా పనిచేస్తున్నట్లు కనిపెట్టి అరెస్ట్‌ చేశాయి. విచారణ జరిపి మరణశిక్ష విధించారు. తుపాకీతో ఆమె నుదుటిపై కాల్చి చంపడం ద్వారా ఆ శిక్ష అమలయింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆమె పంపిన చిన్న మెసేజ్‌ వల్ల మాతాహరి గూఢచర్యం బయటపడింది.

ఏం చేరవేశారు?: ∙యాభై వేల మంది ఫ్రెంచి సైనికుల మరణానికి కారణమైన అత్యంత కీలక సమాచారాన్ని జర్మనీకి అందించారని ఒక ఆరోపణ. ∙పారిస్‌లోని రాజకీయ ప్రముఖుల అక్రమ సంబంధాల çసమాచారాన్ని జర్మనీకి  అందించేవారని మరో ఆరోపణ.

నేతన్‌ హేల్, అమెరికన్‌ సోల్జర్‌
‘నా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి నాకు ఒకటే జన్మ ఉండడం నాకు దిగులనిపిస్తుంది’ అనే మాట నేతన్‌ హేల్‌దే. తొలి అమెరికన్‌ స్పైగా ప్రఖ్యాతి చెందిన నేతన్‌ తనను ఉరితీయబోతుండగా అన్నమాటలివి. అమెరికా విప్లవ పోరాటంలో ఇతడు కాంటినెంటల్‌ ఆర్మీ కెప్టెన్‌గా పని చేశాడు. బ్రిటన్‌ వ్యతిరేక గూఢచారుల సమావేశానికి టీచర్‌ వేషంలో వెళ్లినప్పుడు బ్రిటిష్‌ ఆర్మీకి పట్టుబడ్డాడు. విచారణ జరిపి అనంతరం నేతన్‌ను ఉరితీశారు. అప్పుడు అతడి వయసు 21 సంవత్సరాలు మాత్రమే.

ఏం చేరవేశాడు? : ∙అమెరికా బ్రిటన్‌ అధీనంలో ఉన్నప్పుడు అమెరికా సైనికుడిగా బ్రిటన్‌ ప్రయోజనాలను దెబ్బతీయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి, బ్రిటన్‌పై పోరాడుతున్న స్వదేశీ విప్లవయోధులకు అందించేవాడు.

మరిన్ని వార్తలు