అరచేతిలో ‘e’ జ్ఞానం

1 Aug, 2019 10:37 IST|Sakshi

డిజిటల్‌ రూపంలో పుస్తకాలు లభ్యం

ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం

సాక్షి, బాపట్ల(గుంటూరు) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌ వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడో జరిగిన విషయాలను క్షణాల్లో మన ముందుంచడంతో పాటు, సక్రమంగా ఉపయోగించుకుంటే, చిన్న పిల్లల బొమ్మల దగ్గర నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన సమాచారం లభిస్తోంది. ఈ కోవలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు డిజిటల్‌ రూపంలో వివిధ వెబ్‌సైట్లలో లభిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేయలేని విద్యార్థులకు ఉచితంగా ఆయా పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండటంతో ‘ఈ’ జ్ఞానం ఎంతో ఉపయోగకరంగా మారింది.  గ్రంథాలయ శాఖ పుస్తకాలను డిజిటల్‌ రూపంలో ఉంచింది. ఇందులో నుంచి చాలా రకాలైన పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా పుస్తకాలు అందుబాటులో..  
మన దేశంలో 18 శతాబ్దంలో కోల్‌కతాలో పౌర గ్రంథాలయం, ఇంపీరియర్‌ గ్రంథాలయాలు ఉన్నాయి. 1953లో ఇంపీరియర్‌ గ్రంథాలయాన్ని భారత ప్రభుత్వం జాతీయ గ్రంథాలయంగా ప్రకటించింది. ఇక్కడ విలువైన వేలాది పుస్తకాలను భద్రపరిచారు. ఆ గ్రంథాలయంలోని పుస్తకాలను 2002లో ఇంటర్నెట్‌కు అనుసంధానించారు. ఇంటర్నెట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (బెంగళూరు) వారి సహకారంతో డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అందులో విలువైన పుస్తకాలను డిజిటల్‌ రూపంలో చదువుకునేందుకు వీలుగా ఉంచింది.  

తిరిగి ఇచ్చేయవచ్చు  
ఇంటర్నెట్‌లో అనేక రకాలైన పుస్తకాలు లభ్యమవుతున్నా కాఫీరైట్‌ ఉన్న పుస్తకాలు లభించే అవకాశం లేదు. అలాంటి వాటిని కొనుగోలు చేయడం లేదా, అద్దెకు తీసుకునే అవకాశం కల్పించారు. రెంట్‌ మై టెక్ట్స్, కాఫీ కితాబ్‌ టెక్టŠస్‌ బుక్స్‌ వంటి వెబ్‌సైట్ల ద్వారా 30 నుంచి 70 శాతం వరకు పుస్తకాలు  కొనుగోలు చేయవచ్చు. కొత్త పుస్తకాలు చదవాలంటే వాటిని కొనుగోలు చేసి చదివిన తర్వాత తిరిగి ఇచ్చేస్తే, కొనుగోలు చేసిన ధరలో మనకు 70 శాతం నగదు మళ్లీ ఇచ్చేస్తారు.


ఇంజినీరింగ్, మెడికల్‌ విద్యార్థులకు ఉపయోగం 
ఇంజినీరింగ్, ఐటీ, మెడికల్‌ కోర్సులు చాలా ఖరీదైనవి. వాటికి సంబంధించిన పుస్తకాలు మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే రూ.500 నుంచి రూ.1000 పైనే ధర ఉంటుంది. ఆ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఆయుర్వేదం, యునానీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పుస్తకాల ధర అధికంగా ఉన్నా, కొనుగోలు చేయాలన్నా మార్కెట్‌లో లభ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైకోర్సులకు సంబంధించి పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు. 

ఐఏఎస్, ఐపీఎస్‌ కోర్సుల పుస్తకాలు లభ్యం  
ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు సైతం ఉచితంగా ఈ గ్రంథాలయంలో దొరుకుతాయి. విజ్ఞానానికి పనికివచ్చే ప్రముఖుల జీవిత చరిత్రల పుస్తకాలు, చరిత్రాత్మక, విజ్ఞాన సంబంధం, వినోద సంబంధ పుస్తకాలు చదువుకోవచ్చు.     

పుస్తకాలు డౌన్‌లోడ్‌కు ఉపయోగించే వెబ్‌సైట్లు 
► www.nationallibrary.com
► www.bookbum.com
► www.medicalstudent.com
► www.onlinelibrary.com
► www.rentmytext.com
► www.compitative.com

మరిన్ని వార్తలు