మృత్యువును పరహసించే చిర్నవ్వు గీతాంజలి

8 Jun, 2017 23:22 IST|Sakshi
మృత్యువును పరహసించే చిర్నవ్వు గీతాంజలి

నాటి  సినిమా

ఆ అమ్మాయి చచ్చిపోబోతోంది.‘నువ్వు చచ్చిపోతావా’ ఆ యువకుడు అడిగాడు.‘చూడూ... నువ్వు చచ్చిపోతావ్‌. ఈ చిత్రా చచ్చిపోతుంది. ఆ శారదుందే అదీ చచ్చిపోతుంది. పళ్లికలిస్తుందే ఈ చంటిది.. ఇదీ చచ్చిపోతుంది. ఈ చెట్లు చచ్చి పోతాయ్‌. ఆ తీగా చచ్చిపోతుంది. నేనూ చచ్చిపోతాను. కాకపోతే నేను రెండురోజుల ముందు చచ్చిపోతాను. నాకు రేపు గురించి బెంగలేదు. ఈ రోజే నాకు ముఖ్యం’... ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. అప్పటి వరకూ ఆ యువకుడు నైరాశ్యంతో కొట్టు మిట్టాడుతున్నాడు. కేన్సర్‌ వల్ల త్వరలో చావబోతున్నానని అనుక్షణం కృశించిపోతున్నాడు.

ఈ అమ్మాయి కూడా వైద్యానికి వీలు లేని గుండె జబ్బుతో చావబోతోంది. కాని తనకూ ఈ అమ్మాయికీ ఎంత తేడా. తను ఘనీభవించి ఉంటే ఈ అమ్మాయి ప్రవహిస్తూ ఉంది. తను కన్నీరు కారుస్తుంటే ఈ అమ్మాయి చిన్నచిన్న సంతోషాలను వెతుక్కుంటూ ఆనందబాష్పాలు రాలుస్తోంది. ఈ అమ్మాయికి ప్రకృతిలో ప్రతిక్షణం ఒక జన్మ. అందమైన జన్మ.ఆ యువకుడికి ధైర్యం వచ్చింది. జీవితం పట్లఅవగాహన ఏర్పడింది. రేపటి చింత ఇవాళ ఎందుకు? ఈ క్షణాన్ని ఆనందంగా గడుపుదాం అని ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయీ అతడితో మనస్ఫూర్తిగా ప్రేమలో పడింది.

గీతాంజలి సినిమాలో గీతాంజలిగా చేసిన గిరిజ ఒట్టి అల్లరి పిల్ల. చనిపోతానని తెలిసినా మృత్యువు ఎదురైతే దానినీ అల్లరి పెడదామని చూసే పిల్ల. ప్రకాష్‌ పాత్ర పోషించిన నాగార్జున కూడా కొంటె పిల్లాడేకాని హటాత్తుగా మృత్యువు తనని కావలించుకోవడానికి వస్తుందని తెలిసే సరికి కొంచెం డిస్టర్బ్‌ అవుతాడు. ఆడుతూ పాడుతూ ‘జగడ జగడ జగడం... చేసేస్తాం రగడ రగడ రగడం’... అని చిందులేసే వయసులో నోరు తిరగని కేన్సర్‌ తన దేహంలో అడ్వాన్డ్స్‌ స్టేజ్‌లో తిష్టవేసిందని తెలిసి కుదిపినట్టు అవుతాడు. ఇంట్లో ఏడుపులుపెడబొబ్బలు. బయట సానుభూతి చూపులు. వీటి నుంచి పారిపోవాలనిపిస్తుంది. అందుకే దూరంగా ఊటీకి వచ్చేస్తాడు. ఊటీ అంతా కొండలు. మబ్బులు. ముఖాన్ని తడుముతూ వెళ్లే మేఘాలు. చొక్కా లోపలికి దూరి గిలిగింతలు పెట్టే చలిగాలులు. చెంపలను మెల్లగా చరిచి నవ్వుకుంటూ వెళ్లే మంచు తెరలు... వాటి మధ్య ఈ అల్లరి అమ్మాయి గిరిజ కూడా పరిచయం అవుతుంది. ఆమెకు ఆరోగ్యం బాగ లేదని ప్రకాష్‌కు ముందే తెలుసు. కాని ప్రకాష్‌కు ఆరోగ్యం బాగలేదని ఆ అమ్మాయికి తెలియదు. ఇన్నాళ్లు నిస్పృహగా సాగుతున్న జీవితంలో ప్రకాష్‌ ఒక ప్రాణవాయువులా రావడం ఆమెకు ఓదార్పుగా అనిపిస్తుంది. ప్రకాష్‌ ఒడిలో కూచుని, ప్రకాష్‌ గుండెలలో తల దాచుకుని ఒక నిశ్చింతను పొందుతుంది. అంతవరకూ ఆమె జీవితం ఒక ఆటా పాటా. హటాత్తుగా ఇప్పుడు ఆమెకు దాని మీద తీపి ఏర్పడింది.

డాక్టరైన తన తండ్రి దగ్గరకు ఆ రాత్రి వెళ్లి–‘నాకు బతకాలని ఉంది నాన్నా’ అంటుంది.‘నేనేం తప్పు చేశాను. నేనెందుకు చచ్చిపోవాలి. నాకు ఇంకొన్నాళ్లు బతకాలని ఉంది.. నన్ను బతికించు’ అని ప్రాధేయ పడుతుంది.ఆ తండ్రి నిస్సహాయుడు. సైన్స్‌ మొత్తం ఆ జబ్బు ముందు నిస్సహాయురాలే. నాగార్జునతో కూడా ఇదే మాట అంటుంది. ‘నేను బతకాలి... మరి కొంతకాలం సంతోషంగా బతకాలి’...కాని నాగార్జున కూడా అర్ధాయుష్కుడు అని తెలిసిన క్షణాన ఆమె దిగ్భ్రమ చెందుతుంది. షాక్‌ అవుతుంది. ‘ఇక మీదట నువ్వు నాకు కనిపించకు’ అంటుంది.‘ఏం’ అని అడుగుతాడు నాగార్జున.‘నా కంటే ఎక్కువగా నువ్వు నాకు ముఖ్యం. నీకెలా ఉంటుందో రేపు నువ్వు ఏమవుపోతావో అనే ఆందోళనతో నేను బతకలేను’ అని అంటుంది.

ఆమెకు అతడి మీద ఉన్న ప్రేమ అది. తానేమైనా పర్వాలేదు... అతడు క్షేమంగా ఉండాలనీ అలా ఉండే పరిస్థితి లేదు కనుక కనీసం అతనికి దూరంగానైనా ఉండి ఆ పరిస్థితికి స్కిప్‌ చేద్దామని ఆమె ఆరాటం. కాని ఉండగలదా అలా? తన జీవితంలో ఒయాసిస్సులా ప్రవేశించిన ఆ జీవధారను దోసిలిలో తీసుకోకుండా ఉండగలదా? అందుకనే పెద్ద సర్జరీ ఒకటి జరిగి మృత్యువు దాకా వెళ్లి తిరిగి వచ్చాక అతడి కోసం వెతుకుతుంది. ఆమె నుంచి దూరంగా పోదామనుకున్న అతడు కూడా ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె చేయి పట్టుకుంటాడు.‘ఎంతకాలం బతుకుతారో తెలియదు. కాని బతికినంత కాలం సంతోషంగా బతుకుతారు’ అని స్క్రీన్‌ మీద పడటంతో సినిమా ముగుస్తుంది.

మణిరత్నం దర్శకత్వంలో 1989లో రిలీజైన ‘గీతాంజలి’ తెలుగులో ఒక క్లాసిక్‌గా నిలిచింది. నాగార్జున,గిరిజల నటన, ఇళయరాజా సంగీతం, పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రహణం, వేటూరి పాటలు ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. అంతవరకూ కవిత్వాన్ని చదవడమే జనానికి తెలుసు. కాని వెండి తెర మీద కవిత్వాన్ని చూడవచ్చని కవిత్వంలా ఒక సినిమాని మలచవచ్చని మణిరత్నం, పి.సి.శ్రీరామ్‌ నిరూపించారు ‘గీతాంజలి’తో. అంతవరకూ వచ్చిన సినిమాల్లో హీరోకో హీరోయిన్‌కో ఒక ప్రాణాంతకమైన జబ్బు వస్తే  గ్లిజరిన్‌కు చాలా గిరాకీ ఉండేది. విషాద షెహనాయీ మోగిపోయేది. కాని ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఇరువురూ మృత్యువును హుందాగా ఎదుర్కొనడానికి సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులు కూడా వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న వారిలా సంయమనం పాటిస్తుంటారు. ఎప్పుడో వచ్చే చావు కోసం ఇప్పుడు కొంపలు మునిగిపోయేలా కూచోవడం ఎందుకు అన్నట్టుగా వ్యవహరిస్తారు.

నాగార్జున ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్‌ రోల్‌ చేశారు. అలా చేయడం ఆ రోజుల్లో ఒక సాహసం అని చెప్పాలి. పైకి రావలసిన ఒక హీరో పేషెంట్‌లా కనిపించడం మాటలు కాదు. ఇక హీరోయిన్‌ కోసం సాగిన అన్వేషణలో గిరిజ ఈ సినిమా కోసమే పుట్టిందనట్టుగా సరిపోయింది. ఆ తర్వాత ఆమె పెద్దగా నటించకపోయినా గిరిజకు తెలుగునాట ఇప్పటికీ క్రేజ్‌ ఉందంటే దానికి గీతాంజలే కారణం. సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న నాగార్జునను గీతాంజలి, ఆ వెంటనే వచ్చిన శివ టాప్‌ రేంజ్‌కు తీసుకువెళ్లాయి. ఆయన కెరీర్‌ ఆ దెబ్బతో స్థిరపడిపోయిందని చెప్పొచ్చు.

ఊటీలో అరవై రోజుల పాటు తీసిన ఈ సినిమాలో సినిమా అంతా ఒక అందమైన పొగమంచును వ్యాపించేలా చేయడం అందంగా ఉంటుంది. ‘ఒళ్లంత తుళ్లింత కావాలిలే’, ‘ఆమనీ పాడవే హాయిగా’, ‘ఓ పాపా లాలి’ పాటలు ఊటీ అందాలను చూపుతాయి. ‘ఓ ప్రియా ప్రియా’... పాటను జైపూర్‌లో తీయగా ఆ తర్వాత ఆ ట్రెండ్‌ను చాలా సినిమాలు ఫాలో అయ్యాయి. గిరిజ కాస్ట్యూమ్స్‌ హిట్‌ అయ్యి మార్కెట్‌లో గీతాంజలి డ్రస్సులు ముంచెత్తాయి. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే సినిమా రిలీజయ్యాక మొదటి వారం రోజులు ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. జనానికి సినిమా ధోరణి అర్థం కాలేదు. కాని మెల్లగా టేకింగ్‌ను అర్థం చేసుకుని మాకూ టేస్ట్‌ ఉంది అని తెలుగు ప్రేక్షకులు సినిమాను హిట్‌ చేశారు.ఆర్థిక కష్టమో, ఆరోగ్య కష్టమో, జీవిత కష్టమో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక్క చిర్నవ్వుతో దానిని ఎదుర్కొనడానికి సిద్ధపడితే జీవితం సులవవుతుంది అని చెప్పే ఈ సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులకు ఒక రీవైటల్‌... నైరాశ్యంలో ఉన్నవారి సోల్‌ బూస్టర్‌.              

గీతాంజలి ఒక రియల్‌ కేరెక్టర్‌
మణిరత్నం ఈ సినిమా తీయడానికి ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల గీతాంజలి అనే అమ్మాయి కారణం. కేన్సర్‌తో బాధపడుతున్న ఆ అమ్మాయి తన భావాలన్నీ డైరీలా రాసి పుస్తకంగా వెలువరించింది. దానిని చదివిన మణిరత్నం ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారని అంటారు. ఈ సినిమా షూటింగ్‌ నాటికి మణిరత్నం–సుహాసిని కొత్తపెళ్లి జంట. ఊటీ షూటింగ్‌లో సుహాసిని కూడా భర్తకు కొన్నాళ్లు తోడుగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గిరిజకు నటి రోహిణి డబ్బింగ్‌ చెప్పింది. ఆ గొంతు బాగా నప్పి గిరిజ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యాయత్నాలకు దిగే నేటి యువత... వాకిట ముందు మృత్యువు నిలుచుని ఉన్నా చిర్నవ్వుతో యుగళగీతం పాడిన ఈ జంటను చూసి స్ఫూర్తి పొందాల్సింది ఎంతో ఉంది.

హాలీవుడ్‌లో ‘ద ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’
‘గీతాంజలి’ తీసిన చాలా ఏళ్లకు అంటే ?2014లో అటువంటి కథనే పోలిన ‘ద ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ సినిమా వచ్చింది. ఇందులో హీరోయిన్‌ లంగ్‌ కేన్సర్‌తో బాధ పడుతుంటుంది. ఆమె ఒంటరితనం నుంచి బయట పడటానికి తనలాంటి కేన్సర్‌ పేషంట్ల గ్రూప్‌ను కలుస్తుంది. బోన్‌ కేన్సర్‌ వల్ల కాలు పోగొట్టుకున్న హీరో పరిచయమవుతాడు. వాళ్లిద్దరూ ఎలా ఆకర్షణకు లోనయ్యారనేది కథ. హాలీవుడ్‌ వాళ్లే కాదు వారి కంటే ముందే మనం కూడా మంచి కథలు రాయగలం అనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ.
    – కె

మరిన్ని వార్తలు