దిల్‌వాలా

23 Jan, 2018 01:16 IST|Sakshi

విశిష్ట వ్యక్తి

ఆటో చూడు ఆటో చూడు.... మనసున్న మనిషిని చూడు... నిస్వార్థ సేవను చూడు... మానవత్వపు మార్గం చూడు.... మంచిని పెంచె పనిని చూడు... జాదవ్‌ భాయ్‌ ఘనతను చూడు... ఆ ఆటో గొప్పను చూడు.... అతడిలా మంచిని పెంచరా... అతని మార్గం అందరికీ మేలురా...

‘నీ గాంధీగిరితో ఇంట్లోవాళ్లను చంపేస్తావా? చూడు ఏమైందో? స్కూల్‌ ఫీజు కట్టలేదని వాడి ఫైనల్‌ రిజల్ట్స్‌ ఏంటో చెప్పలేదు టీచర్లు’ అరుస్తోంది భార్య. ‘ఒరేయ్‌.. రెక్కాడితే కాని డొక్కాడని మనకెందుకురా ఈ ఉచితసేవా కార్యక్రమాలు? నీ సంపాదన మీదే మేమంత ఆధారపడ్డాం.. కాస్త చూసుకో.. బాధ్యతగా నడుచుకో’ సలహా లాంటి హెచ్చరిక నాన్న నుంచి. అసహనంతో ఇంట్లోంచి బయటపడ్డాడు. ఊరంతా ఆటో తిప్పుతున్నాడు. ఆలోచనల్లో పడ్డాడు.‘నేనేమైనా తప్పు చేస్తున్నానా? నా అలవాటుతో ఇంట్లోవాళ్లను బాధ పెడ్తున్నానా? ఇంటిని నడిపే బాధ్యత తన మీద ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లను కష్టపెట్టకూడదు కదా. నా తత్వానికి నా కొడుకు ఎందుకు బలి కావాలి? తప్పు నాదేనా? ఎవరికి వాళ్లు ఇలా బంధాలు, బాధ్యతలు అనుకుంటూ  వాటికి బందీ అయితే మంచి ఎలా బతుకుతుంది? ఎవరో ఒకరు కష్టపడితేనే కదా.. పది మంది బాగుపడేది. లేదు... నేనే తప్పూ చేయట్లేదు. ఇంకో కష్టం చేసైనా సరే పిల్లాడి ఫీజు కడ్తాను. అంతే కాని నా దారి మార్చుకునేది లేదు’ అంతర్మధనంలోంచి గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. 

ఇంతకీ ఆయన ఎవరు?
ఓ సాదాసీదా ఆటోవాలా! పేరు ఉదయ్‌సిన్హ్‌ రమణ్‌లాల్‌ జాదవ్‌. ఊరు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌. మరి ఇంట్లో వాళ్లు అభ్యంతర పెట్టేంత పని ఈయన ఏం చేస్తున్నాడు? ఏంలేదు.. మీటర్‌ వేయకుండా బేరం చేయకుండా ఆటో నడుపుతుంటాడు. గమ్యం చేర్చాక ‘మీకు తోచినంత ఇవ్వండి’ అంటాడు చిరునవ్వుతో! అదీ కూడా తర్వాత ఎక్కే ప్యాసెంజర్స్‌ కోసమే అని విన్నవిస్తాడు. అంటే వీళ్ల ప్రయాణం ఉచితంగానే సాగినట్టన్నమాట. దయగల మహాత్ములు వచ్చిన దూరం కంటే ఎక్కువే డబ్బులు ఇవ్వచ్చు. కొంతమంది బొటాబొటి కట్టొచ్చు. ఇంకొంత మంది తక్కువే ఇవ్వచ్చు. చాలా మంది అసలు ఇవ్వకపోనూ వచ్చు. అయినా సరే అతడిది అదే ధోరణి. అదీగాక ఈ ఆటోవాలా పేదవాళ్లకు, వికలాంగులకు ఫ్రీ సర్వీస్‌ ఇస్తుంటాడు. అలా ఆయన అనుసరిస్తున్న గాంధీమార్గం వల్ల ఇంటి ఖర్చులకు సరిపడా కాసులు రావడం లేదు. భారం అంతా ఇంటిని చక్కదిద్దుతున్న ఉదయ్‌సిన్హ్‌  భార్య మీద పడుతుంటుంది. కాని మంచి పనికి మొదట కష్టం ఎదురు కావచ్చు. తర్వాత విజయమే వరిస్తుంది.

ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందాడు?
అహ్మదాబాద్‌లో పేదవాళ్ల కోసం ‘మానవ్‌ సాద్‌నా’ అనే ఓ ఎన్‌జీవో పని చేస్తుంటుంది. కుల, మతభావాలకు అతీతంగా పేదవాళ్లకు అన్నం పెడ్తుంటుంది. బయట ఎంత కొట్టుకుంటున్నా ఆకలయ్యే సరికి జనం ఈ మానవ్‌ సాద్‌నా అనే ఒకే చూరుకిందకు రావడం అన్ని మరిచి పోయి కడుపు నింపుకోవడం చూసి ఆశ్చర్యపోయేవాడు ఉదయ్‌ సిన్హ్‌. వీళ్లందరినీ ఇలా ఒక్కటి చేస్తున్న మానవ్‌ సా«ద్‌నా వలంటీర్ల ప్రయత్నానికి ముగ్ధుడయ్యి తనూ వారితో కలిశాడు. చేరాడు. రెండేళ్లు పనిచేశాడు. ఆ తత్వాన్ని ఒంటబట్టించుకున్నాడు. బయటకు వచ్చాక అక్కడ నేర్చుకున్న సంస్కారాన్ని కార్యరూపంలో పెట్టాలనుకుని ‘అహ్మదాబాద్‌ నొ ఆటోరిక్షావాలో’ (పే ఇట్‌.. ఫార్వర్డ్‌) పేరుతో ఆటో స్టార్ట్‌ చేశాడు. అదే తోచినంత ఇచ్చే కాన్సెప్ట్‌ ఆటో. ఎక్కిన ప్యాసెంజర్‌ తర్వాత ఎక్కబోయే ప్యాసెంజర్‌ డబ్బులు కట్టాలన్నమాట. గమ్మం చేరాక ప్రయాణికులు దిగగానే హార్ట్‌షేప్‌లో ఉన్న మెనూకార్డ్‌ లాంటి కార్డ్‌ ఇస్తాడు. ‘ఆదరంగా ఇవ్వండి’ అని చెప్తాడు. అతని ఆటో వెనక పెద్ద పెద్ద అక్షరాలతో ‘పే ఫ్రమ్‌ యువర్‌ హార్ట్‌’ అని రాసి ఉంటుంది. ఏమీ ఇవ్వలేని వాళ్లు మనసారా నవ్వితే చాలని ఆరాటపడ్తాడు ఉదయ్‌. అయితే అతను ఈ సర్వీస్‌ మొదలుపెట్టినప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కాని రాను రానూ ఈ కాన్సెప్ట్‌ అందరిలోకి వెళ్లి ఉదయ్‌సిన్హ్‌కి డిమాండ్‌ పెరిగే సరికి తోటి ఆటోవాలాలు అతని మీద పెద్ద పోరాటానికే దిగారు. నవ్వు చెడిందే కాక మా గిరాకీ చెడగొడ్తున్నావ్‌ అంటూ. అయినా ఉదయ్‌ తన ఆటోకి బ్రేక్‌ వేయలేదు. చివరకు తోటి ఆటోవాలాలే నెమ్మదిగా తగ్గి అడ్డుఅదుపు లేకుండా తిరుగుతున్న మీటర్‌ను క్రమపద్ధతికి మార్చారు. ‘ఉదయ్‌ భాయ్‌లా పెద్ద మనసు మాకు లేదులే కాని నిజాయితీగా పని చేయాలని మాత్రం అనుకున్నాం’ అని చెప్తారు ఆ ఆటోవాలాలు. 
ఉదయ్‌ సిన్హ్‌ నిజంగానే గ్రేట్‌.               

అమితాబ్‌ ఎక్కిన ఆటో
ఉదయ్‌సిన్హ్‌ సర్వీస్‌ ఊసు ఆ మీడియా ఈ మీడియా ద్వారా  దేశమంతా ప్రచారమైంది. ముంబైలో ఉన్న అమితాబ్‌కి, చేతన్‌భగత్‌కీ తెలిసింది. అతనిని కలుసుకోవడం కోసం ఈ ఇద్దరూ అహ్మదాబాద్‌ వచ్చి అతని ఆటో ఎక్కి ఊరంతా తిరిగారు. అతని కుటుంబాన్ని కలుసుకున్నారు. తోచినంత డబ్బిచ్చారు. అతని గాంధీగిరిని చూసి కళ్లెర్ర చేసిన ఆయన భార్య ఇప్పుడేం చేస్తుందో తెలుసా? ‘మావారు చేస్తున్న పని చాలా ఆలస్యంగా అర్థమైంది. ఆయన్ని చూసి నాకూ ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే మా ఆయన ఆటోలో ఎక్కే పేద ప్రయాణికుల కోసం ఢోక్లా, లస్సీ తయారు చేసి ఆటోలో పెడ్తాను’ అంటుంది. ఉదయ్‌ వాళ్ల నాన్న ఆకలిగొన్న పశువులకు దాణా వేస్తుంటాడు. ఇలా తన కుటుంబాన్ని, చుట్టుపక్కల వాళ్లకూ స్ఫూర్తి పంచుతున్న ఉదయ్‌సిన్హ్‌ రమణ్‌లాల్‌ను  రెడ్‌ ఎఫ్‌.ఎమ్‌ ‘బడే దిల్‌వాలే’ పురస్కారాన్ని, రోటరీ క్లబ్‌ కూడా సేవా అవార్డ్‌ను ఇచ్చి సత్కరించింది. తన సేవకు బరోడా మేనేజ్‌మెంట్‌ అవార్డ్‌నూ అందుకున్నాడు ఉదయ్‌సిన్హ్‌.  ‘ఎవరికి వాళ్లు నేనేమై పోవాలి అనుకుంటే ఏదీ ముందుకు కదలదు. ఎదుటి వ్యక్తికి సహాయపడ్డమనేది చెప్తే వచ్చేది కాదు.. అది మనలో సహజసిద్ధంగా ఉండాలి’ అంటాడు మనసున్న ఆటోవాలా ఉదయ్‌సిన్హ్‌ రమణ్‌లాల్‌ జాదవ్‌.  

మరిన్ని వార్తలు