హిజాబ్‌ ధరించి ఆటో నడుతుపుతున్న నజ్మా | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి వరకు మూడు షిఫ్టుల్లో.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న నజ్మా

Published Wed, Oct 18 2023 10:23 AM

Inspirational Story Of Woman Who Drives Auto By Wearing Hijab - Sakshi

ఓ యువకుడు యాచకుడి వేషంలో, కేజీల మొత్తంలో కరెన్సీ నాణేలను తీసుకుని ఐఫోన్‌ కొనడానికి వెళ్లిన వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది.మంచి వయసు, ఓపిక ఉన్న వారే ఇలా చేస్తుంటే... ఓపిక లేకపోయినా సమాజంలో గౌరవంగా బతికేందుకు బురఖా వేసుకుని ఆటో నడుపుతోంది నజ్మా అన్సారీ.  అయినా ఇతరుల ముందు చేయి చాచే కంటే.. కష్టపడడమే గౌరవం అనుకుంది. ‘గేర్లు మార్చేయండి చాలు గౌరవంగా బతకవచ్చు’ అని చెబుతూ  ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

నజ్మా అన్సారీ వయసు 45. ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్‌ నగరంలోని కట్‌ఘర్‌లో ఆమె నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. 2010లో భర్త మరణించడంతో ఇంటి భారం ఆమె మీద పడింది. అప్పటిదాక గృహిణిగా ఉన్న నజ్మాకు తన కొడుకు, కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కాలేదు. భర్త నడిపిన టీషాపును అద్దె కట్టలేక వదిలేసింది. ఇంట్లోనే టీ తయారు చేసి విక్రయించింది. అలా పిల్లల అవసరాలు చూసుకుంటూ ఉండగానే భర్త ఇన్సురెన్స్‌ డబ్బులు రూ.4.35 లక్షలు వచ్చాయి. మూడు లక్షల రూపాయలతో 2015లో కూతురికి పెళ్లి చేసింది. 

ఆదాయం సరిపోక..
టీ స్టాల్‌ నడుపుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్న నజ్మాకు డబ్బులు సరిపోయేవి కావు. కూతురి పెళ్లి తరువాత ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో భర్త ఇన్సురెన్స్‌ డబ్బుల్లో మిగిలిన మొత్తంతో ఎలక్ట్రిక్‌ ఆటో కొనుక్కుంది. ఇంటి పనులన్నీ పూర్తిచేసి ఆటో తోలుతూ సంపాదిస్తోంది.

అర్ధరాత్రనే భయం లేదు
నజ్మా మూడు షిప్టుల్లో ఆటో నడుపుతోంది. బురఖా ధరించి ఉదయం తొమ్మిదిగంటలకు ఆటో స్టార్ట్‌ చేస్తుంది. ఎండ వేడికి బురఖాలో ఎక్కువ సమయం ఉండలేక మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వచ్చేస్తుంది.  తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆటో నడుపుతోంది. మళ్లీ రాత్రి తొమ్మిది నుంచి రెండుగంటల వరకు విరామం లేకుండా నడుపుతుంది.

ఇలా మూడు షిప్టుల్లో మొత్తం మీద రోజుకి ఐదు నుంచి ఆరు వందల వరకు సంపాదిస్తోంది. స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు నజ్మా ధైర్యాన్ని మెచ్చుకుని ప్రోత్సహిస్తున్నారు. అయితే నజ్మాను చూసిన ఓ హిందూ మహిళ కూడా ఆటో నడపడం మొదలు పెట్టింది. దీంతో ఆ మహిళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడ్డాయి. ఇలా ఇతరులకు స్ఫూర్తి నిలుస్తూనే, తన కష్టార్జితంతో హజ్‌  యాత్రకు వెళ్తానని చెబుతోంది నజ్మ. 

అడుక్కునే కంటే...
‘‘పేదరికం ఉందని అక్కడా ఇక్కడా చేయి చాచకుండా కష్టపడి ఏ పనైనా చేసి గౌరవంగా బతకవచ్చు. ఆటో గేర్లు మారుస్తూ, ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తున్నాను. ఇక మహిళా డ్రైవర్‌గా నాకు రాత్రి సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం వచ్చాక అర్ధరాత్రి బయటకు రావడానికి కూడా భయం వేయడం లేదు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మాకు రక్షణ కల్పిస్తోంది. పరిస్థితులు మరింత దిగజారినప్పుడు అల్లా కాపాడతాడు’’ అని నజ్మా అన్సారీ ధైర్యంగా చెబుతోంది.
  

Advertisement

తప్పక చదవండి

Advertisement