పిలిస్తే పలుకుతా..!

2 Oct, 2017 23:34 IST|Sakshi

ఆత్మీయం

దైవం మానుష రూపేణా... అన్నదానికి నిలువెత్తు నిదర్శనం షిరిడీ సాయి జీవితం. బాబా బోధల్లో దానధర్మాలు చేయడం, ఇతరులకు ఆపద సమయంలో సాయం చేయడం ప్రధానమైనవి. ఎప్పుడూ సత్యం మాట్లాడాలి. ధర్మమార్గాన్ని అనుసరించాలి. దొంగతనం, వ్యభిచారం చేయరాదు. మూఢనమ్మకాలను, మూర్ఖపు ఆలోచనలు విడిచిపెట్టాలి. సమాజ శ్రేయస్సుకు తోడ్పడే శుభకార్యాలు ఆచరించాలి. అయితే మంచి చేయకుండా కొందరు అంతరాయాలు కల్పిస్తారు కాబట్టి కార్యం పూర్తయ్యే వరకూ గుప్తంగా ఉంచటం మంచిది. హింసతో చేసినది ఎంతటి మహత్కార్యమైనా అది శుభప్రదం కాదు. కనుక ఏ పనిలోనూ హింసకు తావివ్వరాదు. అహంకారాన్ని పరిత్యజించాలి. అహంకారాన్ని వదలిపెట్టకుండా షిరిడీ వచ్చినా ప్రయోజ నం శూన్యం. మంచిపనులకు ఫలం సుఖం రూపంలోనూ, చెడుపనులకు ఫలం కష్టం రూపంలోనూ అనుభవించవలసి ఉంటుంది. అయితే ఆయన చెప్పేది ఒకటే, జలతారు వస్త్రం ఇవ్వడానికి తాను సిద్ధపడితే గుడ్డపీలికలు కోరుకోవద్దంటాడు.

అంటే ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో తనకు తెలుసునని, అల్పమైన కోరికలు కోరకుండా, ఆత్మజ్ఞానం కలగాలని కోరుకున్న వారికి తాను అన్నీ ఒసగుతానంటాడు. మొక్కులు మొక్కి, అది తీరగానే అది చేస్తాం యిది చేస్తాం అని ఆ తర్వాత ముఖం చాటేసేవారిని సాయినాథుడు వదలడు. వారినుంచి తనకు రావలసిన బాకీని బహుచక్కగా వసూలు చేసుకుంటాడు. సమాధి నుంచే తాను భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పిన సాయిభగవానుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఒక్కనాటికి కూడా మరచిపోలేదు. ఆయన మహా సమాధి చెంది వందేళ్లు గడుస్తున్నా, ప్రశాంత చిత్తంతో మొరపెట్టుకుంటే చాలు... భక్తుల మొర ఆలకిస్తాడు. కోరినది ఇస్తాడు. అందుకు ఆయన భక్తులే సాక్షులు. సాయిబాటలో నడవాలంటే ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. హింసతో కూడుకున్నది ఎంతటి మహత్కార్యమైనా అది శుభప్రదం కాదు. కనుక ఏ పనిలోనూ హింసకు తావివ్వరాదు. అహంకారాన్ని వదలిపెట్టకుండా షిరిడీ వచ్చినా ప్రయోజ నం శూన్యం. 

మరిన్ని వార్తలు