ఐశ్వర్యప్రద వ్రతం

29 Jul, 2017 23:39 IST|Sakshi
ఐశ్వర్యప్రద వ్రతం

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాని, ఆ మాసంలోని రెండవ శుక్రవారం కాని ఈ వ్రతం ఆచరిస్తారు. కుదరని వారు తర్వాత వచ్చే శుక్రవారంనాడైనా సరే, ఈ వ్రతం జరుపుకోవచ్చు. పసుపు, కుంకుమ, వాయనానికవసరమైన వస్తువులు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగా తయారు చేసి ఉంచుకోవాలి. ఎర్రటి రవికె, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానికి నూలు దారం, కొబ్బరికాయలు, దీపపు కుందులు, పంచహారతి, దీపారాధనకు ఆవు నెయ్యి, కర్పూరం, అగరు వత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్య పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

పూజావిధానం: ఉదయాన్నే లేచి తలంటిస్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిముంగిట కళ్లాపు చల్లి, ముగ్గుపెట్టి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరించాలి. ఇంట్లో ఇల్లాలు శుచిగా, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం విఘ్న నివారణకై పసుపు గణపతి పూజ చేయాలి.

ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని పూజకు మాత్రమే ఉపయోగించే ఒక పంచపాత్రనుగాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి  కలశపూజ చేసుకోవాలి. అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచార పూజలతో పూజించాలి.

తెల్లని నూలు దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు పూయాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా ఐదు లేదా తొమ్మిది పోగులతో తయారు చేసిన తోరాలను పీఠం మీద ఉంచి పూజించాలి. కథానంతరం తోరాలు కట్టుకోవాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యంతో సహా విందారగించి రాత్రి భోజనాన్ని త్యజించాలి.

మరిన్ని వార్తలు