పేరులో ఏముంది?

11 Dec, 2016 00:32 IST|Sakshi
పేరులో ఏముంది?

శ్రావస్తిలో పాపకుడు అని భిక్షువు ఉండేవాడు. ప్రతివారూ తనను ‘పాపకుడా’ అని పిలవడం ఇష్టం ఉండేది కాదు. ఎంతో బాధపడేవాడు. చివరకు తన పేరు మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని బుద్ధుని దగ్గరకు వచ్చి, విషయం చెప్పాడు. ‘భిక్షూ! పేరులో ఏముంటుంది? మన బుద్ధిలో ఉండాలి. అందమైన పేరు ఉన్నవాళ్లందరికీ మంచి బుద్ధులు ఉండవు. అలాగే పేరు అందంగా లేని వాళ్లందరికీ చెడ్డబుద్ధులు రావు. పేరు అనేది ఒక గుర్తు మాత్రమే. ఒక వ్యక్తిని గుర్తించడం కోసమే ఈ పేరు. అతని మంచి చెడ్డల్ని కొలవడానికి కాదు’’ అని చెప్పాడు.
బుద్ధుడు ఎన్నిసార్లు చెప్పినా అతను పదే పదే ‘‘నా పేరు మార్చండి’’ అనే అడిగేవాడు. దానితో బుద్ధుడు అలోచించి – ‘‘భిక్షూ! గ్రామాల్లోకి వెళ్లు. నీకు ఏ పేరు మంచిదో, దేనివల్ల గుణం తెలుస్తుందో ఆ పేరును ఎంచుకురా!’’ అని చెప్పి పంపాడు.

పాపకుడు సంతోషంగా బయలుదేరాడు. ముందుగా ఒక గ్రామానికి చేరే ముందు ఒక శవయాత్ర ఎదురైంది. ‘‘ఆ చనిపోయింది ఎవరు?’’ అని అడిగాడు పాపకుడు. ‘‘అతను జీవకుడు’’ అన్నారు. ‘‘జీవకుడు చనిపోవడం ఏంటి?’’ అడిగాడు.
‘‘ఓరి పిచ్చివాడా! జీవకుడైనా, అజీవకుడైనా చనిపోవాల్సిందే! జీవకుడనేది వట్టి పేరు మాత్రమే’’ అన్నారు.
ఆ భిక్షువు మరొక గ్రామం వెళ్లాడు. అక్కడ ఒక పశువు కొట్టం మూల తిండిలేక అల్లాడుతూ, పాచి అన్నం తింటున్న ఒక బిచ్చగత్తె కనిపించింది.

‘‘అమ్మా నీవు ఎవరివి?’’ అని అడిగాడు.
‘‘అయ్యా! నా పేరు ధనపాలి. బిచ్చగత్తెను’’ అంది. మరో గ్రామం పోయాడు. ఒకడు భార్యను పచ్చిబూతులు తిడుతూ, కర్రతో కొడుతూ కనిపించాడు – ‘‘అయ్యా! ఆ కొట్టే వ్యక్తి ఎవరు?’’ అని అడిగాడు.
‘‘ఆయన పేరు శాంతిధరుడు. అతను కొడుతున్న ఆమె అతని భార్య భద్ర’’ అని చెప్పారు పక్కవారు.  ఇవన్నీ చూశాక, పేరులో ఏమీలేదు అని నిర్ణయించుకొని, తిరిగి వచ్చాడు పాపకుడు. ఇంకెప్పుడూ తన పేరు మార్చుకోవాలనుకోలేదు. బుద్ధుణ్ణి అడగలేదు.
– బొ్రర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు