అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..

9 Oct, 2023 10:29 IST|Sakshi

వారణాసి పట్టణంలో సుప్రబుద్ధి అనే వ్యాపారి ఉన్నాడు. దేశవిదేశాల్లో వ్యాపారం చేసి ఎంతో ధనం సంపాదించాడు. అతనికి సుజాత అనే పెళ్ళీడుకొచ్చిన కుమార్తె ఉంది. సుగుణాల రాశి. అందాల బొమ్మ. అందానికి అందం. సంపదకి సంపద పుష్కలంగా ఉండటంతో ఎందరో ఆమెను పెళ్ళాడలనుకున్నారు. తమ తమ ఆస్తి వివరాలు, చిత్రపటాలూ పంపారు. సుప్రబుద్ధి భార్యకు వారిలో ధననందుడు నచ్చాడు. ఎందుకంటే ఆ పెళ్ళి కుమారులందరిలో అతనే అందగాడు. రంగూ, రూపం చాలా బాగుంది. ‘‘ధననందుని తల్లిదండ్రులకి కబురు పంపండి’’ అంది ఆమె. 

సుప్రబుద్ధుని తండ్రికి మాత్రం విక్రముడు నచ్చాడు. అతను అవంతీనగర శ్రేష్ఠికుమారుడు. ధనం, వంశగౌరవం కలవాడు కాబట్టి ‘‘విక్రముని కుటుంబంతోనే వియ్యమందుదాం’’ అన్నాడు పెద్దాయన. ధనం కంటే వంశం కంటే ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నాడు సుప్రబుద్ధి. కాబట్టి అతనికి ఉజ్జయినీ యువకుడు ఉదయనుడు నచ్చాడు. తన కుమార్తెను చేపట్టేవాడు ఆరోగ్యంతో దీర్ఘాయువుగా ఉండాలి. పెళ్లంటే నూరేళ్ళ పంట. కాబట్టి ఉదయనుడే తనకు అల్లుడైతే చాలు అనుకున్నాడు.  అలా ఆ ముగ్గురి అభిప్రాయాలూ వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి తన కుమార్తె అభిప్రాయం అడగాలనుకున్నాడు.

వెంటనే పిలిచి తమ తమ అభిప్రాయాలు చెప్పి–‘‘అమ్మా! సుజాతా! మా ముగ్గురి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. వీరిలో ఎవరు అయితే నీకిష్టం?’’ అని అడిగాడు. సుజాత చిరునవ్వు నవ్వింది. మౌనం వహించింది. ‘‘సందేహించక చెప్పు తల్లీ!’’ అన్నాడు. ‘‘నాన్నా! నాకు ఈ మూడు రకాల వారూ వద్దు. గుణవంతుడు, శీలవంతుడు అయితే చాలు’’ అని లేచి అక్కడి నుంచి మేడ మీదికి పరుగు తీసింది సిగ్గుపడుతూ. 

ఆ వచ్చిన వారిలో అలాంటి యువకుడు మగధకు చెందిన శీలభద్రుడున్నాడు. ఈ విషయంపై ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి. ఎటూ తేల్చుకోలేకపోయాడు సుప్రబుద్ధి. మధ్యాహ్నం దాటాక సారనాథ్‌లోని జింకల వనానికి చేరాడు. అక్కడ వెదురు చెట్ల కింద కూర్చొన్న బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. నమస్కరించి, విషయం చెప్పాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘సుప్రబుద్ధీ! ఒకడు చాలా అందగాడు. మంచి శరీర వర్ణం గలవాడు. కన్నూ, ముక్కు తీరు బావుంటుంది. కానీ వాడు ఒక దొంగ అనుకో. అందగాడని దొంగను ఇష్టపడతావా?’’ ‘‘లేదు భగవాన్‌!’’ 

‘‘అలాగే.. ఒకడు సోమరి. అజ్ఞాని. కానీ, ఆరోగ్యవంతుడు. అతణ్ణి ఇష్టపడతావా?’’‘‘ఇష్టపడను భగవాన్‌!’’ ‘‘ధనవంతుడు, గొప్ప వంశం కలవాడు. కానీ.. వాడు జూదరి. తాగుబోతు. తిరుగుబోతు. అతను నీకు ఇష్టమేనా?’’ ‘‘కాదు భగవాన్‌! ఇష్టం కాదు’’‘‘చూశావా! అందగాడైనా, ఆయుష్షు గలవాడైనా, ధనవంతుడైనా ఇష్టం కాదు అనే అంటున్నావు. అవునా! సుప్రబుద్ధీ! వీటన్నిటి కంటే గుణమే ప్రధానం. నీ కుమార్తె కోరినట్లు గుణవంతుడు, శీలవంతుడు నీకు అల్లుడైతే, నీవూ, నీ కుమార్తె, నీ కుటుంబం, నీ బంధువర్గం అందరికీ గౌరవం.’’ అన్నాడు.   ‘‘భగవాన్‌! నా కుమార్తె ఇష్టం ప్రకారమే ఆమె పెళ్ళి చేస్తాను పెద్ద మనస్సుతో అంగీకరిస్తాను’’ అంటూ సుప్రబుద్ధి సంతోషంతో లేచి వెళ్ళాడు. అలాగే చేశాడు. 
– డా. బొర్రా గోవర్ధన్‌ 

(చదవండి: క్షమయే దైవము)

మరిన్ని వార్తలు