సర్వర్‌ రోబోలు వచ్చేస్తున్నాయి!

8 Jan, 2018 01:10 IST|Sakshi

రోబోలతో ఉద్యోగాలు పోతాయి అంటే ఏమో అనుకున్నాం. కానీ వరస చూస్తూ ఇది నిజమే అనిపిస్తోంది. ఫొటోల్లో కనిపిస్తున్న రోబలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కొరియా కంపెనీ ఎల్‌జీ తయారు చేసింది వీటిని. మొత్తం మూడు రకాలున్నాయి. ఒకటి ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులకు సాయపడేదైతే... ఇంకోటి హోటళ్లలను మన ఆర్డర్లకు తగ్గట్టుగా ఆహారాన్ని టేబుళ్లపైకి తీసుకొచ్చేది. ముచ్చటగా మూడోది షాపింగ్‌ మాల్స్‌లో సరుకులు మోసుకొచ్చేందుకు పనికొస్తుందని చెబుతోంది ఎల్‌జీ. దీని పేరు ‘క్లో –ఈ’. హోటళ్లు సిబ్బందిని తగ్గించుకునేందుకు... ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సమస్యలను తక్కువ చేసేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని కంపెనీ చెబుతోంది.

హోటళ్లలో సర్వర్లకు బదులుగా క్లో –ఈ లను వాడితే అలుపన్నది లేకుండా 24 గంటలూ పనిచేస్తాయి. అలాగే ఎయిర్‌పోర్టుల్లో పనిచేసే వాళ్లపై నిత్యం సెర్చ్‌ చేయాల్సిన అవసరమూ తగ్గుతుందని.. రోబోలైతే ఎంచక్కా లోపలే అన్ని పనులూ చక్కబెట్టగలవని సంస్త వివరిస్తోంది. చాలా హోటళ్లలో ఆర్డర్లు కూడా కంప్యూటర్ల ఆధారంగా జరిగిపోతూండటం వల్ల క్లో –ఈ వంట గది నుంచి ఆహారాన్ని నేరుగా వినియోగదారుడి టేబుల్‌పైకి చేర్చేస్తుంది. ఇక షాపింగ్‌ మాల్స్‌లో మనం ఎంత వేగంగా షాపింగ్‌ ముగించినా.. బిల్లింగ్‌ దగ్గర విపరీతమైన జాప్యం జరుగుతూంటుంది. అదే క్లో–ఈ దగ్గరుంటే.. మనం సెలెక్ట్‌ చేసుకునే ప్రతి వస్తువును అక్కడికక్కడే బార్‌కోడ్‌ స్కానర్‌ సాయంతో లెక్కలు వేసేసి ఉంచుతుంది. ఫలితంగా కౌంటర్‌ వద్ద నేరుగా బిల్లు కట్టేస్తే సరి అన్నమాట!

మరిన్ని వార్తలు