చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్

6 Nov, 2023 17:04 IST|Sakshi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. తక్కువ శ్రామిక శక్తితో అధిక ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. దాంతో వినియోగదారులు వారి ఆదాయాలను అధికం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐ పరిధిదాటి వ్యవహరిస్తుంది. జీపీటీ-4 ఆధారిత ఏఐని ఉపయోగించి స్టాక్ మార్కెట్‌లో చట్టవిరుద్ధంగా లాభపడవచ్చనే నివేదికలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది.

ఓపెన్‌ఏఐ విప్లవాత్మక మోడల్ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కృత్రిమ మేధస్సుని చూసే విధానంలో మార్పు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ తరహా సాంకేతికత వల్ల పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవల యూకేలో నిర్వహించిన ఏఐ సేఫ్టీ సమ్మిట్‌లోని డెమోలో.. ఈ సాంకేతికత ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని తేలింది. అనంతరం తెలివిగా తన తప్పులను సైతం కప్పి పుచ్చుకోగలదని వెలుగులోకి వచ్చింది. ఈ డెమోలో సంస్థకు తెలియకుండా ఏఐ బోట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం నకిలీ సమాచారాన్ని వినియోగించినట్లు బయటపడింది. ఏఐ బోట్‌ సదరు సంస్థకు చెప్పకుండా స్టాక్‌లను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేయడానికి అంతర్గత సమాచారాన్ని ఉపయోగించింది. అయితే ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను ఉపయోగించారా అని బోట్‌ను అడిగినప్పుడు అది వాస్తవాన్ని తిరస్కరించింది. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.

ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ ఆదేశాలు

స్థానిక ఫ్రాంటియర్ ఏఐ టాస్క్‌ఫోర్స్ ఈ డెమోను ఆవిష్కరించింది. అభివృద్ధి అధునాతన సాంకేతికత ద్వారా జరిగే నష్టాలను ఈ సంస్థ అంచనా వేస్తుంటుంది. ఏఐ భద్రతా విభాగంలో పనిచేసే అపోలో రీసెర్చ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. తన పరిశోధన ఫలితాలను ఓపెన్‌ఏఐతో పంచుకుంది. స్వయంప్రతిపత్తి, సామర్థ్యం కలిగిన ఏఐలు మానవ జోక్యాన్ని అధిగమించే అవకాశం ఉందని హెచ్చరించింది.
 

మరిన్ని వార్తలు