పట్టుకోల్పోతోంది చెయ్యి... పరిష్కారం చెప్పండి

25 Feb, 2016 23:16 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్
 
నా వయస్సు 30 ఏళ్లు. నాకు గత 6 నెలలుగా మలద్వారం దగ్గర బుడిపెల్లాగా ఏర్పడి మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. నొప్పి, మంట ఉండి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ని కలిస్తే పైల్స్ అని చెప్పారు. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?  - రాములు, తుని
 
ఈ మధ్య కాలంలో తరచుగా వినిపించే సమస్యల్లో ఇది ఒకటి. మలద్వారం చివరలో ఉండే సిరలు మలద్వారం గోడలలో మార్పుల వల్ల ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి.
 మొలలు... దశలు
 
గ్రేడ్-1: ఈ దశలో మొలలు పైకి కనిపించవు, నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది.
 గ్రేడ్-2: ఈ దశలో రక్తం పడొచ్చు. పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో మొలలు బయటకు వస్తాయి. విసర్జన తర్వాత వాటంతట అవే లోపలకు వెళ్లిపోతాయి.
 గ్రేడ్-3: మలవిసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి కానీ విసర్జన అనంతరం వాటంతట అవి లోపలికి పోవు. వేలితో నెడితేనే లోనికి వెళ్తాయి.
 గ్రేడ్-4: ఈ దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోపలికి వెళ్లవు.
 
కారణాలు: మలబద్దకం, శారీరక శ్రమ లే కపోవడం, స్థూలకాయం, చాలాసేపు కూర్చొని పనిచేయడం, అతిగా విరోచనాలు కావటం, మంచి పోషకాహారం తీసుకోకపోవడం, నీరు తక్కువ తాగడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, అధిక వేడి ప్రదేశంలో పనిచేయడం, తరచు గర్భస్రావం జరుగుతుండడం, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వారికి ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, నొప్పి, ఎప్పుడూ ఏదో గుచ్చుకుంటున్నట్లుగా ఉండటం, మలవిసర్జన సమయంలో ఇబ్బంది.
 
నిర్ధారణ: రోగి లక్షణాలను బట్టి, మొలలు మరీ పెద్దదిగా ఉంటే మలద్వారంలోనికి ప్రోట్రోన్సిప్ పంపి చూడటంద్వారా నిర్ధారిస్తారు.
 
నివారణ
: మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం ముఖ్యం. రోజు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మసాలాలు, జంక్ ఫుడ్, మాంసం తక్కువ తీసుకోవడం, మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.
 
హోమియో చికిత్స: హోమియోలో రోగి శరీర, మానసిక స్థితిని బట్టి కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తూ, క్రమేణా పూర్తిగా వ్యాధి నివారణ చేస్తారు. మీరు వీలయినంత త్వరలో మంచి హోమియో నిపుణులను సంప్రదించండి.
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
లివర్ కౌన్సెలింగ్
 
నా వయసు 36 ఏళ్లు. మా అన్నయ్యకు కాలేయం పూర్తిగా  దెబ్బతిన్నదనీ, రక్తసంబంధీకులలో ఎవరిదైనా కాలేయదానం అవసరమని డాక్టర్లు అంటున్నారు. నేను మా అన్నయ్యకు కాలేయం ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను అన్నివిధాలా అర్హురాలినని డాక్టర్లు వివిధ పరీక్షలు చేసి, నిర్ధారణ చేశారు. మా అన్నయ్యకు కాలేయం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో నాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా?
 - విజయశ్రీ, నంద్యాల

 మీ అన్నయ్యకు మీరు కాలేయం ఇవ్వడానికి అన్నివిధాలా అర్హులని వైద్యులు నిర్ధారణ చేశారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా కాలేయాన్ని దానం చేయవచ్చు. కాలేయానికి పునరుత్పత్తి స్వభావం ఉంటుంది. మీ నుంచి 20-25 శాతం కాలేయాన్ని తొలగించి, దాన్ని మీ అన్నగారికి అమర్చుతారు. కాలేయ దానం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కాలేయానికి ఉన్న పునరుత్పత్తి శక్తి వల్ల దాతలోని కాలేయం మళ్లీ  6-8 వారాలలో యథాస్థితికి పెరుగుతుంది. సర్జరీ తర్వాత అన్ని రకాల ఆటలూ ఆడవచ్చు. అందరిలాగే ఏవిధమైన ఇబందులూ లేకుండా సాధారణ జీవితం గడపవచ్చు. మీ అన్నయ్యకు కాలేయం పూర్తిగా విఫలమై కాలేయ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు మీరు తెలిపారు. కాబట్టి మీ అన్నయ్యకు వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయించాలని డాక్టర్లు సూచించారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ శస్త్రచికిత్స చేయించాలి. లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి మీ అన్నయ్యకు మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కాలేయం చాలా కీలకమైన అవయవం. అది ఒక రసాయన కర్మాగారంలా పనిచేస్తూ మనం తిన్న ఆహారంలోని పదార్థాలను చిన్న పోషకాల్లోకి మార్చుతుంది. జీర్ణప్రక్రియలో భాగంగా పైత్యరసాన్ని స్రవింపజేస్తుంది. కొవ్వులను, పిండిపదార్థాలను, ప్రోటీన్లను, విటమిన్లను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డకట్టటానికి ఉపయోగపడే అంశాలను రూపొందిస్తుంది. శరీరంలోకి చేరే విషాలను విరిచేస్తుంది. ఒకవేళ కాలేయం సరిగా పనిచేయకపోతే చిన్న దెబ్బతగిలినా తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలకే ముప్పు వస్తుంది. మీరు కాలేయాన్ని ఇవ్వడం ద్వారా మీ అన్నయ్యకు కొత్త జీవితాన్ని ప్రసాదించినవారవుతారు.
 
డాక్టర్ పి. బాలచంద్రన్ మీనన్
సీనియర్ లివర్
ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్
 
న్యూరాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 38 ఏళ్లు. నాకు గత మూడు నెలలుగా కుడి చేతిలో తిమ్మిర్లు వస్తున్నాయి. ఎక్కువ పనిచేసినప్పుడు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈమధ్య చెయ్యి పట్టుతప్పుతోంది. తగిన పరిష్కారం చెప్పండి.
 - కుమారస్వామి, నందిగామ

 మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. చేతికి వెళ్లే నరం ఒత్తుకుపోవడం వల్ల తిమ్మిర్లు వస్తాయి. థైరాయిడ్, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారికి కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొంతమందిలో నరం తీవ్రంగా ఒత్తుకుపోవడం వల్ల చేతిలో స్పర్శ తెలియకపోవచ్చు. చెయ్యి బలహీనంగా కూడా మారవచ్చు. మొదటి దశలో మణికట్టుకి పట్టీ వేయడం, మందుల ద్వారా తగ్గించడం సాధ్యమవుతాయి. అయితే చేతిలో బలం తగ్గినవారికి చిన్న సర్జరీ ద్వారా జబ్బు పెరగకుండా చూడవచ్చు. కాబట్టి మీరు ఇంకా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.
 
నా వయసు 60 ఏళ్లు. నాకు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయి. అప్పుడప్పుడూ మంటగా కూడా ఉంటున్నాయి. కాళ్లు రెండూ బరువుగా అనిపిస్తున్నాయి. నడుస్తుంటే తూలిపోతున్నట్లుగా ఉంది. తగిన సలహా ఇవ్వండి.
 - రామేశ్వర్, కాకినాడ

 నరాలు దెబ్బతిన్నప్పుడు మీరు చెబుతున్న లక్షణాలు కనిపిస్తుంటాయి. మీ వయసులో ఉన్నవారికి షుగర్ వ్యాధి వల్లగానీ లేదా విటమిన్ బి12 లోపం వల్లగానీ ఈ లక్షణాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. మీరు ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. ఎన్‌సీఎస్ అనే పరీక్ష ద్వారా నరాలు ఏమేరకు దెబ్బతిన్నాయో తెలుస్తుంది. కొంతమందిలో మరీ ముఖ్యంగా శాకాహారుల్లో విటమిన్ బి 12 లోపం వల్ల తిమ్మిర్లు, మంటలు కనిపించవచ్చు.  షుగర్‌ను అదుపులో పెట్టుకోవడంతో పాటు విటమిన్ బి12 ఇంజెక్షన్‌లతో, ఇతర మందులతో మీ వ్యాధి లక్షణాలను అదుపు చేయవచ్చు. ఇంకొంతమంది ఎస్‌ఏసీడీ అనే జబ్బు వల్ల సరిగా నడవలేరు. చీకట్లో కిందపడి పోయే అవకాశం ఉంది. పాదాలు భూమి మీద ఆని ఉన్నదీ లేనిదీ గుర్తించలేరు. ఇన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీకు దగ్గర్లోని నరాల నిపుణులను సంప్రదించండి.
 
డాక్టర్ మురళీధర్ రెడ్డి
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్
బంజారాహిల్స్ హైదరాబాద్
 

మరిన్ని వార్తలు