బుల్లితెర శోభన్‌బాబు

18 Dec, 2019 00:10 IST|Sakshi
విజె సన్ని

సీరియల్‌

బుల్లితెరపై విజె సన్నిగా అలరించిన అరుణ్‌ సీరియల్‌ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ‘అందరూ సీరియల్‌ శోభన్‌బాబు అని కితాబులిస్తున్నారు’ అంటూ సరదాగా వివరించిన అరుణ్‌ సింగిల్‌ ట్రావెల్‌ జర్నీ అంటే అమితంగా ఇష్టపడతానని తన విషయాలు చెప్పుకొచ్చాడు.

‘మాది ఖమ్మం. పీజీ చేస్తున్నప్పుడు అవకాశం వస్తే ముందు ఒక టీవీ చానెల్‌లో లైఫ్‌సై్టల్‌ రిపోర్టర్‌గా పనిచేశాను. ఆ తర్వాత యాంకరింగ్‌ వైపు వచ్చాను. మూడేళ్లపాటు టీవీ యాంకర్‌గా వర్క్‌ చేశాను. నా యాంకరింగ్‌ చూసిన టీవీ సీరియల్‌ వాళ్లు ఆడిషన్స్‌కు పిలిచారు. అలా ‘కళ్యాణవైభోగం’ సీరియల్‌ ద్వారా నటుడిగా పరిచయం అయ్యాను. మూడేళ్లుగా ఈ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ చేస్తున్నాను. 

‘కళ్యాణవైభోగం’ సీరియల్‌లోని దృశ్యం

సూర్యదేవర జయసూర్య అనే నేను
‘జీ తెలుగు’లో వచ్చే ‘కళ్యాణౖవైభోగం’ సీరియల్‌లో సూర్యదేవర జయసూర్యగా లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాను. ఈ సీరియల్‌లో బిజినెస్‌ మ్యాన్‌గా రాణిస్తుంటాను. బిజినెస్‌ ఉమన్‌ నిత్యను చూసి, ఇష్టపడి పెళ్లిచేసుకుంటాను. తనే నా లైఫ్‌ అన్నట్టుగా ఉంటాను. అయితే, అనుకోకుండా మా ఇద్దరి మధ్య బిజినెస్‌ వార్‌ నడుస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో నిత్య చనిపోయిందని అందరూ అనుకుంటారు. నిత్య స్థానంలో అదే పోలికతో ఉండే మంగను చేర్చుతారు. ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని భయం. ఇలా ఓ భిన్న కథాంశంతో సీరియల్‌ నడుస్తుంది. మా టీమ్‌లో అందరూ నన్ను సీరియల్‌ శోభన్‌బాబు అని పిలవడానికి కారణం కూడా అదే. మూడేళ్లుగా ఈ సీరియల్‌ టాప్‌ రేటింగ్‌లో ఉన్నందుకు గాను టీవీ అవార్డు నన్ను వరించింది. ఈ రంగానికి వచ్చినందుకు ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తుంటాను. 

అమ్మ కష్టంతో ఎదిగాం

ఖమ్మంలో అమ్మ విలేజ్‌ హెల్త్‌ రిప్రజెంటేటివ్‌గా వర్క్‌ చేసేవారు. ఇద్దరు అన్నయ్యలు. అమ్మ సింగిల్‌ పేరెంట్‌గా మా ముగ్గురిని చదివించింది. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకుంటూ పెరిగాం. మా ముగ్గురిలో చిన్నవాడిని కాబట్టి నేను కాస్త గారంగానే పెరిగాను. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తుండగా రిపోర్టర్‌గా, అటు నుంచి వీడియోజాకీగా.. అవకాశాలు వచ్చాయి. దీంతో టీవీనే నా ప్రపంచం అనుకుంటూ వచ్చేశాను. అన్నయ్యలిద్దరూ ఉద్యోగాల్లో సెటిల్‌ అయ్యారు. నాకున్న ఇష్టం కొద్దీ ఈ ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మకు మా మీద చాలా నమ్మకం. ఏ వర్క్‌ అయినా స్వేచ్ఛ ఉంటుంది. ఇదే చేయ్, ఇదే చదువుకొని జాబ్‌ తెచ్చుకో.. అని అనలేదు. దీంతో సృజన ఉన్న ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సీరియల్స్‌తో పాటు సినిమాలోనూ రాణించాలనుకుంటున్నాను.

ప్రయాణాలతో ప్రమోదం
సీరియల్‌ షూటింగ్, ఈవెంట్స్, షోస్‌ అంటూ నెలలో పాతిక రోజులు గడిచిపోతాయి. మిగతా రోజులను ట్రావెల్‌కు ఉపయోగించుకుంటాను. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే చాలా ఇష్టం. అలాగని ట్రూప్‌లుగా వెళ్లే జర్నీ అంటే ఇష్టముండదు. అమ్మవాళ్లు తీర్థయాత్రలు చేస్తుంటారు. నేను మాత్రం బైక్‌పైన ఫ్రెండ్స్‌తో ట్రావెల్‌ ఎక్కువ చేస్తుంటాను. ప్రపంచ పర్యాటక స్థలాలన్నీ సందర్శించాలనేది నా కల’ అంటూ తన జీవనవిధానంతోపాటు అభిరుచులనూ షేర్‌ చేశారు సన్ని. – నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు