అక్షర క్రీడలో అజేయుడు

25 Jul, 2019 09:29 IST|Sakshi
గరికిపాటి నరసింహారావు ఆశీస్సులు అందుకుంటూ..

ఆంగ్ల మాధ్యమంలో విద్య అభ్యసించాడు... ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశాడు... మరోవైపు తెలుగు అక్షర వ్యవసాయం చేస్తున్నాడు...  పిన్నవయసులోనే 32 అష్టావధానాలు చేశాడు... అనేక పురస్కారాలు అందుకున్నాడు... శతావధానానికి సన్నద్ధుడవుతున్నాడు. పాతికేళ్ళ లేత ప్రాయంలోనే ఎన్నో విజయాలు సాధించిన రాజమండ్రి వాస్తవ్యుడు తాతా సందీప్‌ అవధాన ప్రయాణం ఇలా సాగుతోంది...

వారసత్వంగా...
తాతా పార్వతమ్మ హైస్కూలులో తెలుగు పండితురాలు. ఆవిడకు పద్యమంటే ప్రీతి. పదవీ విరమణ అయ్యాక, కంటిచూపు మందగించడంతో, మనుమడు సందీప్‌ను పిలిచి భాగవతంలోని గజేంద్రమోక్షం పద్యాలు చదివి వినిపించమన్నారు. అప్పటికి సందీప్‌కి  12 సంవత్సరాలు. పద్యం చదవడం సరిగా రాకున్నా, నాయనమ్మ కోర్కెను కాదనలేక, పద్యాలు చదివి వినిపించాడు. యథాలాపంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ అతని జీవితాన్ని మార్చడానికి నాంది పలికింది. నూనూగు మీసాల ప్రాయంలో తొలి అష్టావధానం చేసిన సందీప్, పాతికేళ్ళ ప్రాయంలోపే 32 అష్టావధానాలు పూర్తిచేసి, ఇప్పుడు శతావధానానికి సై అంటున్నాడు. ప్రస్తుతం ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసి డాక్టరేట్‌కు సిద్ధమవుతున్న సందీప్‌ అటు ఆధునిక చదువులతో పాటు, ఇటు తెలుగు పద్యాన్ని, తెలుగువారికే సొంతమైన అవధానాన్ని తన జీవితంలో ఒక భాగంగా మలుచుకున్నాడు.

ఇంతింతై వటుడింతౖయె...
నాయనమ్మ ఆశీస్సులతో పద్యం పట్ల మక్కువ పెంచుకున్న సందీప్, తెలుగుసాహిత్యానికి పుట్టినిల్లయిన రాజమహేంద్రవరంలో 1994లో పుట్టాడు. తండ్రి వరప్రసాద్‌ ఒక ప్రైవేటు సంస్థలో చిరుద్యోగి, తల్లి విజయలక్ష్మి గృహిణి. నాయనమ్మ కోరిక మీద గజేంద్రమోక్షంలోని పద్యాలు వినిపించడం ప్రారంభమైన సందీప్‌ క్రమేపీ ఆ పద్యాల ‘రుచి’ మరిగాడు. సందీప్‌లో ఉన్న ఆసక్తిని గమనించిన తెలుగుమాస్టారు సందీప్‌ను పద్యాలు రాయమన్నారు.

తల్లిదండ్రులు విజయలక్ష్మి,వరప్రసాద్‌లతో..
అవధాన ప్రస్థానం
అవధానానికి ధారణాశక్తి, ఏకాగ్రత కావాలి. అప్పటికే గోదావరీ తీరాన ఉన్న ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలలో రీడరుగా సేవలు అందించిన ధూళిపాళ మహాదేవమణి వద్ద శిష్యరికం చేశారు. అటు చదువు, ఇటు అవధానాలలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది.

బిరుదులు... సత్కారాలు
అవధాన చింతామణి, అవధాన యువరాట్, ఘంటావధాన ధురీణ బిరుదులతో పాటు, నోరి నరసింహశాస్త్రి స్మారక పురస్కారం, ఉషశ్రీ సంస్కృతి సత్కారం, ఉగాది పురస్కారాలను అందుకున్నాడు.

అవధాన దిగ్గజాల సరసన
సంస్కృతాంధ్రభాషల్లో అవధానాలు అలవోకగా చేసిన డాక్టర్‌ చిర్రావూరి శ్రీరామ శర్మ, సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్, శతావధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్, అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు వంటి ఉద్దండ పండితులతో పాటు అవధాని సమ్మేళనంలో పాల్గొన్న తాతా సందీప్‌ వంటివారిని చూస్తుంటే, తెలుగు అంతరించిపోతున్న భాష అనే ఆవేదన మననుండి–తాత్కాలికంగానయినా, దూరం కాకతప్పదు.
– వారణాసి సుబ్రహ్మణ్యం,సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్‌– ఫొటోలు: గరగ ప్రసాద్‌

మరిన్ని వార్తలు