ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపే!

27 Mar, 2014 00:04 IST|Sakshi
ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపే!

సంకల్పం మనసుకు సంబంధించింది అయినా దాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా ఓ పథకం ప్రకారం ముందుకు సాగితే గెలుపు అనివార్యం.
 
 మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం పోరాటంలో ఓడినా భరిస్తుంది కానీ అసలు పోరాటమే లేకుండా గెలుపు సాధించాలనుకునే వాణ్ణి క్షమించదు. ఇది నిజం. చాలా మంది ఏదో సాధించాలని కోరుకుంటారు తప్ప దానికి తగ్గ కృషి చేయరు. కారణం - ఓటమి పాలవుతామేమోనన్న భయం...
 
అసలు ఓటమి అంటే ఏమిటి?
 
ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపు. ఇంకా చెప్పాలంటే ఓటమి కూడా ఓ గెలుపే. ఆ ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని గుర్తు చేస్తుంది. మరి కాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది. అంటే, అక్కడ ఓటమి మనకు ఓ గురువులా హితబోధ చేసినట్టేగా!
 
అయినా ఇవన్నీ చదవడానికి తప్ప ఆచరణకు సాధ్యమేనా అనుకుంటారు చాలా మంది. ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్న ‘ఎడిసన్’ 999 సార్లు విఫలమైన తర్వాత వెయ్యో ప్రయోగంలో తను అనుకున్నది సాధించాడు. మొదటి ఓటమి దగ్గరే ఆగిపోతే ఈ రోజు ప్రపంచానికి విద్యుత్ వెలుగులు ఉండేవా? పైగా తను ఎంతటి ఆశావాదాన్ని ప్రదర్శించాడంటే ‘‘వెయ్యోసారి విజయాన్ని సాధించిన నేను తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు చేసిన ప్రయోగాల్లో ఏం చేయకూడదో అన్న సత్యం తెలుసుకోగలిగాను’’ అన్నాడు.
 అదే... సరిగ్గా ఆ సానుకూల వైఖరే మనిషికి అవసరం.

 మన సృష్టిలో మొదటి సైకోథెరపిస్టు అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా అదే!
 ‘‘కర్మను ఆచరించడం వరకే నీ బాధ్యత తప్ప కర్మఫలం నీకు అనుకూలంగా ఉండాలని కోరుకోవడానికి నువ్వు అర్హుడివి కాదు.’’ గడచిన వేల సంవత్సరాలకే కాక రాబోయే కాలానికీ అద్భుతంగా వర్తించే స్ఫూర్తిదాయకమైన సూక్తి అది.

 ఆరాటం, పోరాటం అనే జంట పదాల ఆసరాతో అర్జెంటుగా అందరినీ అధిగమించి, ముందుకు సాగిపోవాలనుకునే ఇప్పటి యువత, ఓ చిన్న అవాంతరానికి, లేదంటే అనుకున్నది సాధించలేనప్పుడు ఆత్మనూన్యతా భావంతో కుమిలిపోతూ నిరాశావాదంలో కూరుకుపోతున్నారు. అంతేతప్ప గెలుపులాగే ఓటమి కూడా ఓ అనుభవం అన్న విషయాన్ని గుర్తించడం లేదు. ‘‘ఓటమి కాదది... నీ కృషిలో కొద్దిపాటి లోపం’’ అన్న సత్యాన్ని మరిచిపోతున్నారు. లక్ష్యం కోసం అడ్డదోవలు వెదకడంతో ఆ వెదుకులాటలో గెలుపు సాధించక పోవడంతో విపరీతంగా అలసటకు గురవుతున్నారు.

జీవితం మీద రోత పుట్టినట్టు ఒక్కోసారి ప్రయత్నాన్ని విరమించుకోవడం, ఇంకా తట్టుకోలేనప్పుడు అరుదుగా ప్రాణ త్యాగానికి సిద్ధపడడం వంటివి చేస్తూ అపురూపమైన వరం లాంటి జీవితాన్ని చేజార్చుకుంటున్నారు. ఏదన్నా సాధించాలంటే ముందు కావాల్సింది సంకల్పం. ఈ ప్రపంచంలో విషాదానికి హేతువు - కోరికలు అని భగవద్గీతలో చెప్పిన ఓ కన్‌క్లూజన్‌కు వచ్చేయకండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది - ఇంద్రియ  లాలసత్వానికి ముడిపడ్డ కోరికలు లేదా ఆలోచనల గురించి. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది జీవితాన్ని హితంగా మార్చుకునే సంకల్పం గురించి. ఈ సంకల్పానికి షార్ట్‌కట్ మెథడ్స్ ఉండవు...

 సంకల్పం మనసుకు సంబంధించింది అయినా దాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా ఓ పథకం ప్రకారం ముందుకు సాగితే గెలుపు అనివార్యం. అంటే... లక్ష్యం సాధించడం ఒక్కటే కాదు... ఎలా సాధించాలీ అన్నదాన్ని ముఖ్యంగా ఆకళింపు చేసుకోవాలి.

 ఒక్కోసారి మనం కోరింది వెంటనే సాధించలేం. అంత మాత్రం చేత జీవితం అయిపోలేదు. స్తంభించని కాలంతో మనమూ ప్రయాణం సాగిస్తూనే ఉంటాం. అవకాశాలు మనకు తారసపడుతూనే ఉంటాయి. ఒక్కోమారు నీరసపడే మనల్ని సేద తీరుస్తుంటాయి.

 ‘నువ్వు ఈ నేల మీద పడక ముందే నీ తల్లి రొమ్మును పాలతో నింపిన దేవుడు నీకు అన్యాయం చేయడు’. జీవితానికి పాజిటివ్ థింకింగ్ ఎంత అవసరమో ఈ ఒక్క వాక్యంలో మనం జీవిత కాలం పాటు మననం చేసుకునేట్టు చేసాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఎంతటి అపూర్వమైన ఓదార్పు అది.


 ఆశావాది సమస్యలో జవాబును ఎదుర్కొంటాడు. నిరాశావాది ప్రతి జవాబులోనూ సమస్యల్ని ఏకరువు పెడతాడు. ఆశావాది ‘ఈ పని కష్టమే కానీ అసంభవం కాదు’ అంటాడు. కానీ, నిరాశావాది ‘ఇంత కష్టమైన పని నా వల్ల ఎలా అవుతుంది’ అని తప్పించుకుంటాడు. ఆలోచించుకోండి. మీరు ఆశావాది కావాలనుకుంటున్నారా? నిరాశావాదిగా బతకాలనుకుంటున్నారా? నిర్ణయించుకోండి.
 
వర్షాలు పడకపోవడంతో ఒకసారి కొందరు గ్రామస్థులు మేఘాన్ని ప్రార్థించడానికి ఆరుబయట నిలబడి మేఘాల వైపు చూస్తుంటే, ఓ పసివాడు ఏకంగా గొడుగుతో వచ్చాడు. అదే Faith. పాపను పెకైత్తుకుని ఎగరేస్తూ ఓ తండ్రి ఆడిస్తూంటే పాప ఆనందంగా నవ్వుతుంది. పడిపోతానేమో అన్న భయం ఆమెకు లేదు. తండ్రికి ప్రేమ మీద నమ్మకం.. అదీ Trust. ఈ రాత్రికి నిద్రపోయే మనం పొద్దుట బ్రతికి లేస్తామన్న నమ్మకం లేదు... కానీ రేపేం చేయాలో ఆలోచిస్తాం. అదీ Hope
 ఈ మూడు ఆయుధాలు మీవిగా మార్చుకుంటే... నేడు, రేపు, ఆ తర్వాత భవిష్యత్తు మీదే.
 
 ‘నువ్వు ఈ నేల మీద పడక ముందే నీ తల్లి రొమ్మును పాలతో నింపిన దేవుడు నీకు అన్యాయం చేయడు’. జీవితానికి పాజిటివ్ థింకింగ్ ఎంత అవసరమో ఈ ఒక్క వాక్యంలో మనం జీవిత కాలం పాటు మననం చేసుకునేట్టు చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఎంతటి అపూర్వమైన ఓదార్పు అది.
 
 కొమ్మనాపల్లి గణపతిరావు
 ప్రముఖ రచయిత

 

మరిన్ని వార్తలు