పెళ్లి వేడుకలో మహాద్భుతం

12 Dec, 2016 13:48 IST|Sakshi
పెళ్లి వేడుకలో మహాద్భుతం

 సువార్త

కానా అనే ఊళ్ళో జరిగిన పెళ్లికి యేసు తన తల్లి మరియ, శిష్యులతో సహా హాజరయ్యాడు. పెళ్లివారింటి వేడుకల్లో ద్రాక్షారస పానం అక్కడి సంప్రదాయం. మామూలుగా అయితే సంపన్నులు మాత్రమే ద్రాక్షారసం సేవిస్తారు. కాని వేడుకల్లో పేద గొప్ప తేడా లేకుండా అంతా సేవిస్తారు. అందువల్ల పెళ్లి వేడుకల్లో ద్రాక్షారసమే హైలైట్! ఈ పెళ్లిలో కూడా అందుకు ఏర్పాట్లు చేశారు. అతిథులు ఎక్కువ తాగారో, లేక లెక్కకు మించి వచ్చారో తెలియదు కాని పెళ్లిలో ద్రాక్షారసం నిండుకుంది. విందు చేస్తున్న వారిలో విషాదం నెలకొంది. తమదాకా ద్రాక్షారసం రాకపోతే అతిథులు దాన్ని అవమానంగా భావిస్తారు. అందుకు విందు పెద్దలు ‘పరిష్కారం’ చూపారు. ఇక్కడున్న వాళ్లకు ఏదో విధంగా ద్రాక్షారసం సర్దేద్దాం. ఇంకా రానున్న అతిథుల్ని మాత్రం ఆపేద్దామన్నారు వారు. ఎలా?

ప్రతి యూదుని ఇంటి వెలుపల నీటి బానల్లో నీళ్లుంటాయి. అతిథులు అక్కడ కాళ్లు కడుక్కున్నాకే ఇంట్లోకి రావడం వారి శుద్ధీకరణ ఆచారం. బానల్లో నీళ్లు లేకపోతే అతిథులు ఇక రావడానికి లేదు. అందువల్ల బానల్లో నీళ్లు పారబోయమన్నారు వాళ్లు. ద్రాక్షారసం నిండుకోవడమే అవమానమైతే ‘మా పెళ్లికి రాకండి’ అని అలా చెప్పుకోవలసి రావడం మరింత అవమానకరం. అయినా గుడ్డిలో మెల్లలాగా అదే మంచిదనిపించి, అక్కడున్న ఆరు రాతి బానలూ ఖాళీ చేశారు. ద్రాక్షారసం నిండుకున్నదన్న విషయాన్ని మరియ, యేసుకు తెలిపింది. ‘అమ్మా! నా సమయమింకా రాలేదన్నాడు’ ప్రభువు.

యేసు అసలు ద్రాక్షారసం తాగరు. అయితే సర్వజనరక్షణార్థం చేయనున్న సిలువ యాగానికి ముందు రాత్రి మాత్రం మహా పండుగ విందులో ఆయన ద్రాక్షారసం తన శిష్యులతో కలిసి తాగనున్నారు. ఆ సమయమింకా రాలేదన్నాడు ప్రభువు. కాని విందులో ద్రాక్షారసం కొంత తీర్చడానికి యేసు పూనుకున్నాడు. ఖాళీ అయిన ఆరు రాతి బానల్లో అంచుల దాకా నీళ్లు నింపించాడు. ఆ నీటినే ద్రాక్షారసంగా మార్చాడు. అంతా సమృద్ధిగా సేవించారు. ‘చివరిదాకా ఇంత రుచికరమైన’ ద్రాక్షారసమా? అని అచ్చెరువొందారు అంతా!! మహా విషాదంగా ముగియవలసిన పెళ్లి వేడుకను దేవుడు అలా ఎంతో ఘనమైన వేడుకగా మార్చారు. చుక్క ద్రాక్షారసం లేని పెళ్లి వేడుకలో ప్రభువు కృప వల్ల కాళ్లు కడుక్కునే నీళ్లంతా సమృద్ధిగా ద్రాక్షారసంగా ప్రవహించింది. ద్రాక్షపళ్లనే సృష్టించిన దేవుడు పెళ్లిలో ఉండగా, మిడిమిడి జ్ఞానంతో రాతి బానల్లోని నీటిని పారబోసి, అవమానాన్ని అధికం చేసుకోవాలనుకున్న కుటుంబాన్ని దేవుడు ఆ విధంగా ఆదుకున్నాడు.

సమస్య చిన్నదైనా, పెద్దదైనా యేసు చేతికి అప్పగిస్తే జరిగేది అదే! ఆయన సమస్యను తీరుస్తాడు. ఆయన తీర్చేవాడే కాదు, దాన్ని మహాశీర్వాదంగా మార్చే దేవుడు. లోకం మన సమస్యను తీర్చబోతూ మన అవమానాన్ని అధికం చేస్తుంది. కానీ దేవుడైతే మన పరువు ప్రతిష్ఠలు ఇనుమడించేలా సమస్యను తీరుస్తాడు. సమస్యకు వెయ్యి పరిష్కార మార్గాలున్నా, పనిచేసే పరిష్కారమొక్కటే... అది - యేసును ఆశ్రయించడమే!! - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్

మరిన్ని వార్తలు