జ్ఞానమా? శీలమా? ఏది మిన్న?

27 Jan, 2019 02:47 IST|Sakshi

బౌద్ధవాణి

కాశీరాజు ఆస్థానంలో అనేకమంది పండితులుండేవారు. వారిలో ధర్మధరుడు మహాపండితుడే కాదు, శీలవంతుడు కూడా. రాజు పండితుల్ని వారి వారి పాండిత్యానికి తగిన రీతిలో ఘనంగా సత్కరించేవాడు. వారిలో పాండిత్యంతోపాటు శీలసంపన్నులూ ఉండేవారు. శీలగుణం లేని పండితులూ ఉండేవారు. రాజు మాత్రం వారి బుద్ధుల్ని లెక్కించకుండా కేవలం పాండిత్యానికే గౌరవ సత్కారాలు అందించడం ధర్మధరునికి నచ్చలేదు. రాజు మాత్రం అందరికంటే ధర్మధరుణ్ణే మిన్నగా గౌరవించేవాడు. ధర్మధరుడు రాజుకి జ్ఞానోదయం కలిగించాలనుకున్నాడు. ఒకరోజున నగరంలోని ఒక వజ్రాల దుకాణానికి వెళ్లాడు. దుకాణం యజమాని లేచి ధర్మధరునికి నమస్కరించాడు.

యజమానితో మాట్లాడుతూ ఒక వజ్రాన్ని చేతిలో పట్టుకుని వెళ్లిపోయాడు ధర్మధరుడు. ‘మాటల మధ్య మరపుగా తీసుకుని ఉంటారు’ అనుకుని ఊరుకున్నాడు వ్యాపారి. రెండోరోజు అలానే చేశాడు ధర్మధరుడు. రెండోసారీ ఏమీ అనలేదు వ్యాపారి. మూడోరోజూ అలానే చేశాడు. వ్యాపారికి కోపం వచ్చి– ‘‘ఓరీ! దొంగవెధవా! నీ పాండిత్యం తగలబడ. నిన్ను గౌరవించడం నా తప్పు’’ అని గట్టిగా అరచి ధర్మధరుణ్ణి నాలుగు తన్ని, రాజు దగ్గరకు ఈడ్చుకుపోయాడు వ్యాపారి. దొంగగా తన ఎదుట నిలిచిన ధర్మధరుని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. 

‘‘రాజా! ఇప్పుడు నన్ను సత్కరించగలరా?’’అని అడిగాడు ధర్మధరుడు. ‘‘సత్కరించడం కాదు. శిక్షిస్తాను. అదే నీకు సత్కారం’’ అన్నాడు రాజు.‘‘ఔను కదా! మహారాజా! నేను మీకు చెప్పదలచుకుంది ఇదే! పాండిత్యమే కాదు, శీలం కూడా ఉండాలి. అలాంటివారినే గౌరవించాలి. కానీ, మీరు శీలం లేని పండితుల్ని కూడా అందరితోపాటే ఘనంగా సత్కరిస్తున్నారు’’ అన్నాడు ధర్మధరుడు.  తను చేస్తున్న తప్పు తెలియజెప్పడానికే ధర్మధరుడు ఇలా చేశాడని రాజుకు అర్థమైంది.జ్ఞానం కంటే పాండిత్యం కంటే శీలమే గొప్పది అని బుద్ధుడు చెప్పిన కథ ఇది. 
– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు