చెడును వాయిదా వెయ్యాలి...

3 Jul, 2017 23:02 IST|Sakshi
చెడును వాయిదా వెయ్యాలి...

ఆత్మీయం

కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా పర్వదినాలలో చాలామంది కొత్త పనులకి శ్రీకారం చుడతారు. ‘ఇవాళ్టి నుంచి నేను అన్నీ నిజాలే చెప్పాలి’, ‘ఇతరులకు మంచి చేయలేకపోయినా, కనీసం చెడు చేయకూడదు’,  ‘నా చెడు అలవాట్లన్నీ మానుకోవాలి...’ ఇలా చాలా నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని నిలబెట్టుకోవాలని ప్రమాణాలు చేస్తారు, మొక్కులు మొక్కుకుంటారు. అయితే, నిర్ణయాలు ఎంత ఆవేశంతో, తొందరపాటుగా తీసుకుంటారో... వాటిని మరచిపోవడంలోనూ అంతే ఆవేశం, తొందరపాటు చూపుతారు. ఒక నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడమంటే ఎంత కష్టమో అర్థం అయిన తరవాత నిర్ణయాలను గాలికి వదిలేస్తారు. తమ తమ అలవాట్లను, పంథాను మార్చుకోవడంలో విఫలమవుతుంటారు.

తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి ఉండాలి. అప్పుడే అనుకున్న నిర్ణయం ఆచరణలో పెట్టగలుగుతాం. ‘మంచి చేయాలనుకున్నప్పుడు వెంటనే ప్రారంభించాలి, చెడు చేయాలనుకుంటే వాయిదా వేయాలి’ అని పౌరాణికులు ప్రవచిస్తున్నారు. ఎందుకంటే, రావణాసురుడు సముద్రంపై వార ధిని నిర్మించాలనుకున్నాడు కానీ వాయిదా వేశాడు. సీతమ్మను అపహరించాలనుకున్నాడు, వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేశాడు. అందుకే భ్రష్టుపట్టిపోయాడు. కాబట్టి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? మంచిని ఆ క్షణంలో ప్రారంభించడం వల్ల అందరూ సుఖశాంతులతో ఉంటారు. చెడును వాయిదా వేసుకోవటం వల్ల మనిషిలో రోజురోజుకీ చెడు ప్రభావం కొంతయినా తగ్గుముఖం పట్టి కొంతకాలానికి పరివర్తన వచ్చి చెడు చేయటం మానుకుంటారు. అందుకే నిర్ణయాలు చెడ్డవయినప్పుడు వాటిని వాయిదా వేయాలి.

మరిన్ని వార్తలు