కేక్‌ బ్రేక్‌

16 Dec, 2016 23:31 IST|Sakshi
కేక్‌ బ్రేక్‌

ఇక్కణ్ణుంచి న్యూ ఇయర్‌ దాకా బేకినోళ్లకు బేకినంత! తిన్నదే తిని బోర్‌ కొట్టినోళ్లకి బ్రేకినంత!! ఓ రెండు లొట్టలెక్కువేసుకుంటే బ్రేవ్‌మన్నంత!!!

పంప్‌కిన్‌ కేక్‌
కావలసినవి: మైదా – 2 కప్పులు; గుమ్మడికాయ – 1 (చిన్న సైజుది); మైదా – పావు కేజీ, బేకింగ్‌పౌడర్‌ – టీ స్పూన్‌; వంటసోడా – పావు టీ స్పూన్‌; ఉప్పు – చిటికెడు; వెన్న – కప్పు; పంచదార పొడి – కప్పు; వెన్న – టీ స్పూన్‌; గుడ్లు – 6; వెనిలా ఎసెన్స్‌ – అర టీ స్పూన్‌; డ్రై ఫ్రూట్స్‌ పొడి (బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, కిస్‌మిస్‌) – అర కప్పు; సుగుంధద్రవ్యాల పొడి – టీ స్పూన్‌ (ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు.. కలిపి పొడి చేయాలి )

తయారి: గుమ్మడికాయ సగానికి కోసి, గుమ్మడి గుజ్జు తీసి, గింజలు వేరు చేయాలి. గుజ్జు తీసేశాక గుమ్మడికాయ గిన్నెలా ఉంటుంది. దీనిని పెద్ద గిన్నెలో అడుగున నీళ్లు పోసి(ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించవచ్చు), పైన మరో గిన్నె ఉంచి, ఆవిరి మీద ఉడికించి, తీసి పక్కన ఉంచాలి. గుమ్మడి గుజ్జును మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో బాగా కలిపిన నూనె, పంచదార, ఉప్పు, వెనిలా ఎసెన్స్, గుడ్ల మిశ్రమం పోయాలి. మైదా, బేకింగ్‌ పౌడర్, వంటసోడా కలిపి జల్లించి పై మిశ్రమంలో కలపాలి. డ్రై ఫ్రూట్స్, సుగంధద్రవ్యాల పొడి కూడా వేసి మళ్లీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నంతా వెన్నరాసిన గిన్నెలో పోసి, కుకర్‌లో బేక్‌ చేయాలి. బయటకు తీశాక ఉడికించిన గుమ్మడికాయలోకి సర్ది, ఆవిరి మీద మరో పది నిమిషాలు ఉడికించి, దించాలి. ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ చేయాలి.

అవెన్‌లో: కట్‌ చేసి, శుభ్రం చేసిన గుమ్మడికాయ చుట్టూత బ్లాటింగ్‌ పేపర్‌ చుట్టి, లోపల కేక్‌ మిశ్రమం పోసి అవెన్‌లో 30–35 నిమిషాలు బేక్‌ చేసి, తీయాలి.

ప్లమ్‌ కేక్‌
కావలసినవి: మైదా – పావుకేజీ; డాల్డా – పావు కేజీ; పంచదార పొడి – 200 గ్రాములు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూన్‌; వంటసోడా – చిటికెడు; కోడిగుడ్లు – 5; డ్రై ఫ్రూట్స్‌ – పావు కేజీ (జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం, కిస్‌మిస్, ఖర్జూరం మొదలైనవి); సుగంధ ద్రవ్యాల పొడి – టీ స్పూన్‌ (ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు.. కలిపి పొడి చేయాలి)

తయారి: మైదా, బేకింగ్‌ పొడి కలిపి జల్లించుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో గుడ్ల సొన, డాల్డా, పంచదార పొడి వేసి బాగా కలపాలి. దీంట్లో మైదా, డ్రై ఫ్రూట్స్‌ వేసి మళ్లీ బాగా కలపాలి. బేక్‌ చేసే గిన్నెలో అడుగున కొద్దిగా డాల్డా లేదా నెయ్యి రాసి మైదా మిశ్రమాన్ని అందులో పోయాలి. కుకర్‌ అడుగున ఇసుక పోసి పైన బేక్‌ చేసే గిన్నె పెట్టి, పైన మూత ఉంచాలి. 30 నిమిషాలు ఉడికిన తర్వాత దించాలి. పూర్తిగా చల్లారాక మూత తీసి, కేక్‌ గిన్నె బయటకు తీయాలి. ప్లేట్‌లో గిన్నెను బోర్లిస్తే గుండ్రటి పరిణామంలో కేక్‌ వస్తుంది. పైన డ్రై ఫ్రూట్స్‌ని అలంకరించి, కట్‌ చేసి, సర్వ్‌ చేయాలి.

పాన్‌ కేక్‌
కావలసినవి: గోధుమపిండి – 1 1/4 కప్పు; మొక్కజొన్న రవ్వ – 1/3 కప్పు (పాప్‌కార్న్‌ని పొడి చేసి కూడా వాడచ్చు); గుడ్డు – 1 ; పంచదార – 1/3 కప్పు; మజ్జిగ – 1 1/2 కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూన్‌; బేకింగ్‌ సోడా – అర టీ స్పూన్‌; నూనె – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్‌

తయారి: నాన్‌స్టిక్‌ పాన్‌ మీద కొద్దిగా నూనె రాసి వేడెక్కనివ్వాలి. ఒక గిన్నెలో పైన చెప్పిన అన్ని పదార్థాలు వేసి కలిపి,  ఇడ్లీ పిండిలా తయారుచేసుకోవాలి.   వేడి పెనం మీద పెద్ద గరిటెతో పిండి తీసుకొని వేయాలి. అదే గరిటెతో కొద్దిగా వెడల్పు అని, పైనుంచి మూత పెట్టాలి. ఒక వైపు మూడు నిమిషాలు, మరో వైపు మూడు నిమిషాలు బేక్‌ చేసి తీయాలి. ఇలాగే మిగతావి వేసుకొని, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చివరగా తేనె, బటర్‌తో సర్వ్‌ చేయాలి.

స్పాంజ్‌ కేక్‌
కావలసినవి:  మైదా – 1 1/2 కప్పులు; గుడ్లు – 2 (గుడ్లు వద్దనుకున్నవారు యోగర్ట్‌ అర కప్పు వాడచ్చు); పంచదార పొడి – కప్పు; నూనె – 1/2 కప్పు (నూనెకు బదులుగా బటర్‌ వాడుకోవచ్చు); పాలు – 1/2 కప్పు; వెనీలా ఎసెన్స్‌ / పైనాపిల్‌ ఎసెన్స్‌ – టీ స్పూన్‌; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూన్‌; వంట సోడా – పావు టీ స్పూన్‌; ఉప్పు – చిటికెడు; నెయ్యి లేదా నూనె లేదా వెన్న – టీ స్పూన్‌
 
తయారి: గిన్నెలో ఎగ్స్‌ వేసి, నురగ వచ్చేదాక గిలకొట్టాలి. దీంట్లో పంచదార  పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో టేబుల్‌స్పూన్‌ మైదా వేసి కలపాలి. వెన్న రాసిన గిన్నెలో పై మిశ్రమం పోయాలి. దీంట్లో సన్నగా తరిగిన నట్స్‌ డ్రై ఫ్రూట్స్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పోసిన గిన్నెను ప్రెజర్‌ కుకర్‌లో పెట్టి ఉడికించాలి లిడ్, గ్యాస్‌కట్‌ పెట్టకుండా పైన మూతను ఉంచి ఉడికించాలి. మధ్యలో మూత తీయకూడదు.  5–10 నిమిషాలు కేక్‌ మంచి వాసన వస్తుంది. మరో 5–10 నిమిషాల్లో మిశ్రమం గట్టిపడుతుంది. మొత్తం 40–45 నిమిషాలు ఉడికించాక దించాలి. 20–30 అలాగే చల్లారనిచ్చి, కేక్‌ ఉన్న గిన్నెను బయటకు తీసి, ప్లేట్‌లో బోర్లించాలి. కత్తితో కట్‌చేసి, సర్వ్‌ చేయాలి.

ఎగ్‌లెస్‌ కేక్‌
కావలసినవి: మైదా – పావు కేజీ; బేకింగ్‌ పౌడర్‌ – పావు టీ స్పూన్‌; వంట సోడా – చిటికెడు; ఫ్రూట్‌ మిక్చర్‌ (డ్రై ఫ్రూట్స్, నట్స్‌) – కప్పు; అన్‌సాల్డెడ్‌ బటర్‌ – అర కప్పు (100 గ్రాములు); నీళ్లు – అర కప్పు; గోల్డెన్‌ సిరప్‌ – అర టేబుల్‌ స్పూన్‌; పంచదార – అర కప్పు; వంట సోడా – అర టీ స్పూన్‌; పెరుగు లేదా యోగర్ట్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; వెనిల్లా ఎసెన్స్‌ – అర టీ స్పూన్‌; మసాలా పొడి – (లవంగాలు–1, ఇలాచీ –1, జాజికాయ– చిన్న ముక్క కలిపి పొడి చేసినది); బంగాళదుంప – అర కప్పు (ఉడకబెట్టి గుజ్జు చేసినది); ఆరెంజ్‌ జెస్ట్‌ లేదా ఆరెంజ్‌ తురుము – టేబుల్‌ స్పూన్, చిరోంజీ పప్పు – టేబుల్‌ స్పూన్‌

ప్రెజర్‌ కుకింగ్‌:  ఉప్పు లేదా ఇసుక – అర కేజీ; ప్రెజర్‌ కుకర్‌ ప్లేట్‌– 1; అల్యూమినియమ్‌ బేకింగ్‌ పాన్‌ – కుకర్‌లో పట్టేటంత గిన్నె; బటర్‌ పేపర్‌ – పాన్‌ అడుగున పరవడానికి కావల్సినంత; వెన్న లేదా నూనె – పాన్‌ అడుగున రాయడానికి కావల్సినంత

తయారి: వెడల్పాటి గిన్నెలో మైదా, సోడా, బేకింగ్‌పౌడర్‌ వేసి జల్లించాలి. డ్రై ప్రూట్స్, నట్స్‌ సన్నగా తరిగి ఉంచాలి. బంగాళదుంప ఉడికించి, మసాలా పొడి చేసి ఉంచాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నట్స్‌ కాకుండా డ్రై ఫ్రూట్స్‌ మాత్రమే వేయించాలి. దీంట్లో నీళ్లు పోసి ఆ తర్వాత పంచదార వేసి కలపాలి. (నీళ్లు–పంచదార సమంగా ఉండాలి). 15 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాక పాకం చిక్కగా అవుతుంది. మంట తీసేసి వంట సోడా కలపాలి. తర్వాత మైదా మిశ్రమం వేసి కలపాలి. బేకింగ్‌పాన్‌ అడుగున బటర్‌పేపర్‌ పరిచి, అందులో మైదా మిశ్రమం వేయాలి. పైన మరి జీడిపప్పులు, బాదాంపప్పులతో అలంకరించాలి. 5 లీటర్ల ప్రెజర్‌ కుకర్‌లో అడుగున అరకేజీ మెత్తటి ఉప్పు లేదా ఇసుక పోసి ఆ పైన రంధ్రాలున్న ప్రెజర్‌కుకర్‌ ప్లేట్‌ పెట్టి హై ఫ్లేమ్‌ మీద కనీసం 10 నిమిషాలు వేడెక్కనివ్వాలి. తర్వాత ఆ ప్లేట్‌ పైన మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచి, కుకర్‌ మూత పెట్టాలి. వెయిట్‌ మాత్రం ఉంచకూడదు. ఇలా సాధారణ మంట మీద 26–30 నిమిషాలు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత లోపలి మిశ్రమం ఉడికి, మంచి వాసనం వస్తుంది.   అన్నీ కలిసిన తరువాత అందులో డ్రైఫ్రూట్స్, మైదా వేసి కలపాలి. బేక్‌ చేసే గిన్నె అడుగున బటర్‌పేపర్‌ పరచాలి. సిద్ధం చేసుకున్న కేక్‌ మిశ్రమాన్ని అందులో పోయాలి. కుకర్‌ అడుగున ఇసుక పోసి పైన బేక్‌ చేసే గిన్నె పెట్టి, ఆ పైన మూతను సెట్‌ చేయాలి. 30 నిమిషాలు తర్వాత దించాలి. చల్లారాక తీసి, పైన డ్రై ఫ్రూట్స్, చిరోంజీ పప్పుతో అలంకరించాలి.

 

మరిన్ని వార్తలు