మాస్టారి పాటలు వింటూ... పాడుతూ బతికాడు

31 Jul, 2016 00:42 IST|Sakshi
మాస్టారి పాటలు వింటూ... పాడుతూ బతికాడు

స్మృతిరాగం / నేడు రామకృష్ణ ప్రథమ వర్ధంతి


ప్రముఖ సినీ నేపథ్య గాయకులు రామకృష్ణ ప్రథమ వర్ధంతిని (తిధుల ప్రకారం) ఈనెల 31వ తేదీ నుండి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా రామకృష్ణ పిన్ని, సీనియర్ గాయని అయిన పి.సుశీల మనోభావాలు.

మా అక్క కుమారుడు కాబట్టి నేనే సినిమాల్లోకి తీసుకువచ్చానని అందరూ అనుకుంటారు. ఇది నిజం కాదు. సంగీత దర్శకులు రమేష్‌నాయుడు గారు ఎవరి ద్వారానో రామకృష్ణ గురించి విని ‘మీ అక్క కుమారుడు అట కదా... పాడించేదా?’ అని నా దగ్గరకు వచ్చి అడిగారు.  నేను సరే అన్నాను. తొలిపాటే మా ఇద్దరి మధ్యన యుగళగీతం. ‘వయసే ఒక పూలతోట’. పంపిణీదారులు రామకృష్ణ పాటలు తీసివేయమంటున్నారు అంటూ నిర్మాత నా సలహా అడిగారు. ‘కొత్తవారు కదా నిరుత్సాహపడిపోతారు. మరొక్కసారి పరిశీలించండి’ అని చెప్పాను. దాంతో వాడి పాటలు ఉంచేయడం, హిట్ కావడం జరిగిపోయింది. ఘంటసాల తరువాత పెద్ద నిర్మాతలంతా రామకృష్ణను ఎంతగానో ప్రోత్సహించారు.
 

‘భక్త తుకారాం’ సమయంలో ఘంటసాల మాస్టారుకు పూర్తిగా అనారోగ్యం. దీంతో రామకృష్ణ చేత ఆదినారాయణరావు, అంజలి పట్టుబట్టి పాడించారు. ఆ సినిమాలో ఘంటసాల మాస్టారు పాడిన పాటలతో సమానంగా రామకృష్ణ పాటలు హిట్ అయ్యాయి. మా అక్క కొడుకు నా ఇంట్లో కాక మరెక్కడుంటాడు. ఇందులో తప్పేంటి. దీంతో రామకృష్ణను సుశీల సిఫార్సు చేస్తున్నారని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. నిజానికి వాడి ప్రతిభను మెచ్చుకునే తీసుకున్నారు. గాత్రంలో మాధుర్యం లేకుంటే ఘంటసాల మాస్టారుతో అలవాటు పడిన ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్‌బాబు, కృష్ణంరాజులు పాడించుకుంటారా? నా కోడలు ఎంతో చక్కగా పాడుతుంది, ఎవరికైనా సిఫార్సు చేశానా?  ఏ కళాకారులకైనా సిఫార్సులు తాత్కాలికమే, ప్రతిభే పర్మనెంటు. ఘంటసాల మాస్టారుకు రామకృష్ణ ఏకలవ్య శిష్యుడు. ఆయనంటే ప్రాణం. అన్నం తిని కాదు మాస్టారి పాటలు వింటూ, పాడుతూ బతికాడని చెప్పవచ్చు. ‘తెలుగువీర లేవరా’ పాటను మాస్టారుతో కలిసి పాడినపుడు రామకృష్ణ ఆనందానికి అవధులులేవు. ఘంటసాల పాటల కోసం మూడుసార్లు వరుసగా అమెరికాకు తీసుకెళ్లగా రామకృష్ణకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. మరో ఘంటసాల అని పొగిడారు. కుమారుడు సాయి కిరణ్ చదువు కోసం, చిత్ర పరిశ్రమతోపాటూ హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అయితే ఆ తరువాత అంతగా ప్రోత్సాహం లభించలేదు. టీవీ సీరియల్స్‌లో నటించాడు. ప్రతిభకు తగిన ప్రోత్సాహం క్రమేణా కరువై పోయింది. పోటీ ప్రపంచంతో అలసిపోయిన మా మధుర గాయకుడు తన 65వ ఏట ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.  - సంభాషణ: కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

 

రామకృష్ణ పాడిన ప్రసిద్ధ గీతాలలో కొన్ని..
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం (తాత-మనవడు)
పాండురంగనామం పరమపుణ్యధామం (భక్త తుకారాం)
ఏదొ ఏదొ అన్నది (ముత్యాల ముగ్గు)
శివ శివ శంకర (భక్త కన్నప్ప)
నా జీవన సంధ్యా సమయంలో (అమరదీపం)

 

 

మరిన్ని వార్తలు