పిచ్చుకేదీ! పెంకుటిల్లేదీ!

20 Mar, 2018 00:50 IST|Sakshi

నేడు స్పారో డే

పిచ్చుకలు అడవిలోనైతే నాలుగైదేళ్లు బతుకుతాయి. సిటీల్లోనైతే.. చెప్పలేం! ఎవరి గింజల్ని వాళ్లు వెతుక్కోడానికి పరుగులు తీస్తున్న నగరాల్లో.. పిచ్చుకల కోసం ఇంటి ముందు కంకులు వేలాడదీసేవాళ్లెవరు? మట్టి పాత్రలో వాటికి నీళ్లు పెట్టేవాళ్లెవరు? పెంకుటిళ్ల లాగే పిచ్చుకల ఆయుషూ  తీరిపోతోంది!

ఈ జనరేషన్‌ పిల్లలు కొన్నింటిని చూడ్డం అదృష్టం. వాటిల్లో పిచ్చుకను చూడ్డం ఒక అదృష్టం. పిచ్చుకలు పూర్తిగా అదృశ్యం అయిపోలేదు. ఇంకా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, వాటిని ఆగి చూసే అదృష్టమే మనకు ఉండడం లేదు. నేడు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం. పిచ్చుకలను చూడలేకపోయినా, పిచ్చుకల గురించి మాట్లాడుకోడానికి ఒక సందర్భం. ఐదే ఐదు విషయాలు చెప్పుకుని ఎవరి పనుల్లోకి వాళ్లం ఎగిరిపోదాం!

01. పిచ్చుకల ఈకలపై ఉండే రంగులను బట్టి అవి ఆడో మగో చెప్పేస్తారు రైతులు. వీపు మీద గోధుమ రంగు ఈకలుంటే అవి ఆడవి. ఎరుపు రంగు ఈకలు ఉంటే అవి మగవి. గోధుమ అంటే పూర్తి గోధుమ, ఎరుపంటే పూర్తి ఎరుపు కాదు. నలుపు చారలు కూడా మిక్స్‌ అయి ఉంటాయి.  మీ దగ్గర్లో రైతు ఎవరైనా ఉంటే ఆయన్ని అడగండి. మరికొన్ని కొండ గుర్తులు చెప్తారు. రైతుని గుర్తుపట్టడం ఎలా అని మాత్రం అడక్కండి.. ప్లీజ్‌. 

02. చాలా పక్షుల్లాగే పిచ్చుకలు కూడా గుంపు జీవులు. ఒంటరిగా ఉండవు. ఒకవేళ ఏ పిచ్చుకైనా ఒంటరిగా కనిపించిందంటే.. అది దారి తప్పి వచ్చిందనే. మీ దగ్గర గుబురుగా ఉండే చెట్టు ఉంటే, సాయంత్రం చీకటి పడుతుండగా గమనించండి. మీ చుట్టుపక్కల ఉండే పిచ్చుకలన్నీ ఆ గుబుర్లలో చేరి కిచకిచమని ఆవేళ్టి కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తాయి.

03. పిచ్చుకలు నీటి జీవులు కాదు. అయితే నీటిలో వేగంగా ఈదగలవు. ఏదైనా ప్రమాదం రాబోతోందని పసిగట్టగానే వేరే దారి లేనప్పుడు అవి నీటి దారిలోనైనా ఎస్కేప్‌ అవుతాయి. 

04. పిచ్చుకలు సాధారణంగా ‘ఇది నా అడ్డా’ అని గిరి గీసుకుని ఉండవు. అయితే తమ గూడును కాపాడుకోడానికి మాత్రం చేతులు మడిచి ఫైటింగ్‌కి వస్తాయి. 

05. గూళ్లను కట్టే బాధ్యత మగ పిచ్చుకలదే. అలా కడుతున్నప్పుడు.. అవి ఆడ పిచ్చుకలను ఆకర్షించడానికి ఓ లుక్‌ ఇస్తాయి.. ‘చూశావా, ఎలా కడుతున్నానో’ అని!! 

మరిన్ని వార్తలు