అలో లక్ష్మణా.. కిలో రూపాయి..!

27 Feb, 2016 23:48 IST|Sakshi
అలో లక్ష్మణా.. కిలో రూపాయి..!

మాట
టమోటాల ధరలు కుప్పకూలిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా టమోటాను చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్‌లో సాగు చేస్తారు. దాదాపు 30 వేల ఎకరాల్లో  టమోటా సాగులో ఉంది. టమోటా పంట సాగులో మహిళా రైతులు కీలకపాత్ర పోషిస్తున్నారు. నారు పెట్టినప్పటి నుంచి కోత కోసి, మార్కెట్‌కు తరలించేవరకు మహిళలే చూసుకుంటారు. అయితే ధరలు పది రోజులుగా పతనం కావడంతో మహిళా రైతులు కన్నీరు పెడుతున్నారు. కాయలు పొలాల్లోనే వదలివేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో టమోటాలు మార్కెట్‌లోకి రావడంతో ధరలు పడిపోతున్నాయి. ఏ మహిళా రైతును కదిలించినా కన్నీటి కథలే . అప్పులు చేసి పంట పెడితే చివరకు అప్పుల కుప్పలయ్యాయని వారు ఆవేదన చెందారు. టమోటా పంట కాపాడుతుందనుకుంటే చివరకు అప్పులు ఊబిలోకి నెట్టేసిందని వాపోయారు. ధరలు ఇలాగే వుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆందోళన చెందారు. ప్రస్తుతం టమోటా కిలో రూపాయి కూడా దొరుకుతుండడం.. మహిళా రైతుల దుస్థితికి అద్దం పడుతోంది.  - మాడా చంద్రమోహన్, సాక్షి, మదనపల్లె టౌన్

పెట్టుబడి కూడా గిట్టలేదు
ధరలు బాగుంటాయని ఆశతో రెండు ఎకరాల్లో టమోటా పంట పెట్టాను. పంట చేతికి వచ్చే సమయంలో ధరలు పడిపోయాయి. ఇప్పటికి రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టాను. మరో రూ.50 వేలు ఖర్చువుతుంది. కాయలు మార్కెట్‌కు తీసుకుపోతే ధరలు లేవు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.  - జయలక్ష్మి, మహిళా టమటా రైతు, దండువారిపల్లె, మదనపల్లె మండలం

 అప్పులే మిగిలాయి
ఎకరా పొలంలో టమోటా పంట పెట్టాను. దాదాపు రూ.50వేలు ఖర్చు చేశాను. కాయలు కోసేందుకు  ఒక్కో కూలికి రూ.150 ఇవ్వాలి. ఆటో బాడుగ, మార్కెట్ కమీషన్లు పోతే చేతి నుండి రోజుకు రూ.500 పడుతుంది. దీంతో కాయలు పొలాల్లోనే వదిలేశాను. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు. - రెడ్డమ్మ, మహిళా టమోటా రైతు, కొత్తపల్లె, మదనపల్లె రూరల్ మండలం

మరిన్ని వార్తలు