ఆకు కూరలతో దృష్టి లోపాలకు చికిత్స

24 Oct, 2018 00:32 IST|Sakshi

కాయగూరలు మరీ ముఖ్యంగా పచ్చటి ఆకు కూరల్లో ఉండే నైట్రేట్లను ఆహారంగా తీసుకోవడం ద్వారా వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలను నిలువరించవచ్చునని వెస్ట్‌మీడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తెలిపారు. దాదాపు యాభై ఏళ్ల వయసున్న రెండు వేల మందిపై 15 ఏళ్ల పాటు తాము పరిశీలనలను జరిపామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బామిని గోపీనాథ్‌ తెలిపారు. రోజుకు వంద నుంచి 142 మైక్రోగ్రాముల కాయగూరల నైట్రేట్లు తీసుకున్న వారికి కంటి సమస్యలు వచ్చే అవకాశాలు 35 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని చెప్పారు.

నైట్రేట్లకు, కంటికి వచ్చే మాక్యులర్‌ డీజనరేషన్‌ సమస్యకు మధ్య సంబంధాన్ని తొలిసారి గుర్తించిన పరిశోధన ఇదేనని తెలిపారు. వంద గ్రాముల బీట్‌రూట్‌లో 20 మైక్రో గ్రాముల నైట్రేట్‌ ఉంటుందని, అలాగే వంద గ్రాముల పాలకూరలో 15 మైక్రోగ్రాములని తెలిపారు. కంటి జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసుకోవడం ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యం కాగా.. ఆహారపు అలవాట్ల ద్వారా జబ్బు ముదరకుండా చూసుకునేందుకు అవకాశమున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని వివరించారు. 

మరిన్ని వార్తలు