బజాజ్‌ ఫైనాన్స్‌కు లాభాల బూస్ట్‌

24 Oct, 2018 00:33 IST|Sakshi

క్యూ2లో రూ.923 కోట్లు; 54% వృద్ధి

ఆదాయం రూ.4,296 కోట్లు

ముంబై: నిర్వహణలోని ఆస్తుల్లో చక్కని వృద్ధి సాధించటంతో బజాజ్‌ ఫైనాన్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకంగా 54 శాతం పెరిగి రూ.923 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.598 కోట్లు. కన్సాలిడేటెడ్‌ ఆదాయం సైతం 40 శాతం వృద్ధితో కిందటేడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,066 కోట్ల నుంచి రూ.4,296 కోట్లకు వృద్ధి చెందింది. సబ్సిడరీ కంపెనీలైన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సెక్యూరిటీస్‌ ఫలితాలు కూడా ఇందులో కలిసే ఉన్నాయి.

నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్‌ చివరికి రూ.1,00,217 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఏయూఎం రూ.72,669 కోట్లతో పోలిస్తే 38 శాతం వృద్ధి కనిపిస్తోంది. సెప్టెంబర్‌ క్వార్టర్లో బలమైన పనితీరు చూపించామని, నిర్వహణలోని ఆస్తులు 38 శాతం పెరిగాయని బజాజ్‌ ఫైనాన్స్‌ ఎండీ రాజీవ్‌జైన్‌ తెలిపారు. రుణాలపై నష్టాలు, కేటాయింపులన్నవి క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.221 కోట్ల నుంచి రూ.315 కోట్లకు పెరిగాయి. స్థూల ఎన్‌పీఏలు 1.49 శాతంగా, నికర ఎన్‌పీఏలు 0.53 శాతంగా ఉన్నాయి. నిధుల సమీకరణ వ్యయం మార్పు లేకుండా 8.21 శాతంగా ఉంది.  బీఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌ 1.63 శాతం నష్టపోయి రూ.2,083.95 వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తలు