దారి వెతుక్కుంటూ ఓ నిరంతర బాటసారి

26 Feb, 2018 01:12 IST|Sakshi

నివాళి
24 ఫిబ్రవరి 2018. యీరోజు గూడా యెప్పటిలాగే తెల్లవారింది. పదకొండు గంటల ప్రాంతంలో వాట్సాప్‌లో సాహితీ మిత్రుడొకరు మునిపల్లె రాజుగారి ఫొటో పెట్టి కింద ‘నివాళి’ అని రాశాడు. సాదాసీదాగా తెల్లవారిన యీరోజు వొక్కసారిగా సాహిత్య అస్తిత్వాన్నంతా వూపి పారేసింది. యేనాటి మునిపల్లె రాజు గారు? రెండు నెలల క్రితం ఇచ్ఛాపురం జగన్నా«థరావు గారు. యిప్పుడు మునిపల్లె రాజు గారు. తెలుగు కథ రెండో దశలో, దాన్ని అత్యున్నత శిఖరాలకెక్కించిన మహా రచయితలు క్రమంగా నిష్క్రమిస్తున్నారు.

93 సంవత్సరాల నిండైన జీవితం గడిపిన వ్యక్తి మరణించినప్పుడిలా మనస్సు కలగుండు పడిన చెరువులా అలజడి చెందుతోందెందుకు? మరణం సహజమేనని తెలిసినా, ప్రతిరోజూ రకరకాల జీవన పరిణామాలను గమనిస్తూనేవున్నా, కొందరు వ్యక్తులు మరణించినా వాళ్ళ స్ఫూర్తి వాళ్ళు చేసిన పనిలో సజీవంగానే వుండిపోతుందన్న నమ్మకం కలిగినా, యింకా యీ ఆందోళన యెందుకు తగ్గదు?

ఆరడుగుల నల్లటి చేవ బారిన శరీరం, పొడవెంతో కన్పించేలా మాత్రమే పెరిగిన ఆకారం, తలపైన వయస్సును తెలిపే తెల్లటి వెంట్రుకలు, తనవి గావనిపించే పాంటూ షర్టూ, ఆ పైన అప్పుడప్పుడూ పాత మిలిటరీదేమోననిపించే స్వెట్టరూ, దేనిపైనా నిలవని చూపులు, నిద్రలోనే నడచి వస్తున్నాడేమోననిపించే వ్యక్తి, పలకరిస్తే వులిక్కిపడి తిరిగి చూడటం, అప్పుడే నిద్ర మేల్కొని చూస్తున్నట్టుగా వుండే వైనం... గుర్తించినట్టుగా నవ్వే నవ్వు... జీవితానుభవాల్ని నిరూపిస్తున్నట్టుగా మిగిలిన కొన్ని పళ్లు... ఆ వ్యక్తిని నేను 1993 లేకపోతే 94 ప్రాంతాల్లో మొదటిసారిగా చూశాను. చివరిసారిగా, రెండేళ్ల క్రితం, యేదో సాహితీసభకు వచ్చినప్పుడూ అలాగే కనిపించాడాయన.

మునిపల్లె రాజు చిత్రమైన వ్యక్తి. పదిమందిలో పెద్దగా మాట్లాడరు. పరిచయం కుదిరిన వ్యక్తితో మాట్లాడటం మొదలుపెడితే ఆపరు. ఆయన మాట్లాడుతూంటే ఆ వ్యక్తే ‘వీరకుంకుమ’, ‘బిచ్చగాళ్ల జెండా’, ‘అరణ్యంలో మానవ యంత్రం’, ‘వారాల పిల్లాడు’ మొదలైన గొప్ప కథలు రాసిన వ్యక్తని గుర్తుకు తెచ్చుకుని ఆశ్చర్యపోతాం. మాట్లాడుతున్నప్పుడు ఆయన యెదుటి వ్యక్తితో మాట్లాడుతున్నట్టుండదు. అరమోడ్పు కళ్లతో ఆయన తనతో తాను మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తారు.

రాయలసీమ కరువు గురించి రాసిన తొలి కథల్లో ముఖ్యమైనదైన ‘వీరకుంకుమ’ రాసిన మునిపల్లె రాజు గారు నిజానికి రాయలసీమ వాసి గాడు. దాదాపు వంద, వందాయాభై సంవత్సరాల క్రితం కొందరు కోస్తా ప్రాంతపు వైద్యులు (ఎంబీబీయెస్‌ గాదనీ, ఆర్‌ఎంపీల వంటి రెండో రకం డిగ్రీలుండేవారనీ తర్వాత తెలిసింది) చిత్తూరు, కడప జిల్లాలకొచ్చి స్థిరపడ్డారు (యాభై అరవై సంవత్సరాల క్రితం వాళ్ళు మళ్లీ తమ స్వంత ప్రదేశాల కెళ్ళిపోయారు). వాళ్లలో మునిపల్లె రాజు గారి అన్న పిచ్చిరాజు గారొకరు. (మునిపల్లె రాజు పూర్తి పేరు మునిపల్లె బక్కరాజు). కడపలో ఉన్న అన్న దగ్గరికొచ్చిన తమ్ముడు అప్పటి రాయలసీమ జీవనగతుల్ని గురించి రాసిన కథ అది.

మునిపల్లె రాజు సైన్యంలో వుద్యోగిగా పనిచేసినవారు. హిమాలయ పర్వత సానువుల్లో చాలా కాలం గడిపి వచ్చినవారు. యెక్కడికెళ్లినా ఆయన చూపులు మాత్రం గాయపడినవాళ్ళు, అవమానించబడుతున్నవాళ్ళపైనే వుండేది. డాస్టోవిస్కీని ద్రష్ట (్కటౌpజ్ఛ్టి)గా గుర్తించిన ఇ.ఎం.ఫాస్టర్‌ ‘‘యిప్పుడు యెంతమంది గొప్ప రచయితలున్నా వీళ్లలో డి.హెచ్‌.లారెన్సు మాత్రమే ద్రష్ట’’ అంటాడు. గతాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని, వర్తమానాన్ని నిర్దుష్టంగా అవగతం చేసుకున్న రచయిత మాత్రమే రాబోయే పరిణామాల్ని ముందుగా కనిపెట్టగలడు.

యిటువంటి ద్రష్టత్వం వున్న చాలా కొద్దిమంది ఆధునిక భారతీయ రచయితల్లో మునిపల్లె రాజు గారిది విశిష్టమైన స్థానం. ‘బిచ్చగాళ్ల జెండా’లోని బిచ్చగాళ్ళ తిరుగుబాటూ, ‘అరణ్యంలో మానవయంత్రం’లో ముసుగు దొంగలు అక్రమ వ్యాపారిని దోచుకోవడం – యీ రెండు కథలూ ఆ తర్వాతి కాలంలో తెలుగు రాష్ట్రంలో విజృంభించిన వామపక్ష పోరాటాల బీజాలను చాలా ముందుగా పసిగట్టాయి. తిరగబడుతున్న పీడితులతో మమేకమైన రచయిత పీడనలోంచి పోరాటం పుట్టడం అనివార్యమని హెచ్చరిస్తాడు.

1950–75 ప్రాంతాల్లో యిన్ని గొప్ప కథలు రాసిన మునిపల్లె రాజు గారు దాదాపొక రెండు దశాబ్దాల కాలం మౌనంగా వుండటమెందుకో అర్థంగాదు. బహుశా అప్పుడాయన వుద్యోగపు పనుల్లో వూర్లు తిరుగుతూ జన్మభూమికి దూరమైపోయి వుంటారు. కానీ రెండోసారి మొదలెట్టిన తర్వాత గూడా తనలో పాత వాడీ, వేడీ తగ్గలేదని నిరూపించి చూపెట్టారు.

‘సవతి కొడుకు’, ‘విశాఖ కనకమాలక్ష్మి’ వంటి గొప్ప కథల్ని నిలపకుండా మరో దశాబ్దపు కాలంలో రాశారు. ‘పుష్పాలు–ప్రేమికులు’, ‘దివోస్వప్నాలతో ముఖాముఖి’, ‘అస్తిత్వ నదం ఆవలి తీరాన’, ‘మునిపల్లె రాజు కథలు’ అనే నాలుగు కథల సంకలనాల్ని తీసుకొచ్చారు. ‘వేరొక ఆకాశం – వేరెన్నో నక్షత్రాలు’, ‘అలసిపోయిన వాడి అరణ్యకాలు’ అనే రెండు కవితా సంపుటాలనూ, ‘జర్నలిజంలో సృజన రాగాలు’ అనే వ్యాస సంకలనమూ రాశారు.

తొలినాటి కథల్లో స్పష్టంగా వామపక్ష అభిమానాన్ని కలిగివుండిన మునిపల్లె రాజుగారిలో ఆ తరువాతి కాలంలో సంప్రదాయ సాహిత్యం పైనా, ఆధ్యాత్మిక ధోరణి పైనా మొగ్గు చోటుచేసుకున్నాయి. వర్తమానంతోనూ, వాస్తవికతతోనూ పోరాటం చేసి అలసిపోయినవాడిలా ఆయన ఆ తర్వాత ఆధ్యాత్మికతనూ, మాజిక్‌ రియలిజంనూ ఆలంబన చేసుకున్నారు. మాంత్రిక వాస్తవికత అనేది విదేశీయమైనది గాదనీ, అది భారతీయ ప్రాచీన సాహిత్యంలోనే వుందనీ గాఢంగా నమ్మారు.

జీవితంలో అన్ని వూర్లు తిరిగినా, మునిపల్లె రాజుగారు తమ స్వంత వూరు ‘తెనాలి’ని తలచుకుంటూనే పులకించిపోయేవారు. యెప్పుడూ కొడవటిగంటి కుటుంబరావు గారి తప్పిపోయిన తమ్ముడు కొడవటిగంటి వెంకట సుబ్బయ్యనూ, అనిసెట్టి సుబ్బారావునూ గుర్తుకు తెచ్చుకునేవారు. శారద జ్ఞాపకాలనూ తవ్వుకునేవారు.

మునిపల్లె రాజు బాగా చదువుకున్న రచయిత. యింగ్లీషులో యెప్పుడూ షెర్‌వుడ్‌ ఆండర్‌సన్‌ గురించి పేర్కొనేవారు. తెలుగులో తనకు నచ్చిన కథల్ని చెప్పమంటే అనిసెట్టి సుబ్బారావుగారి ‘ఎవరు, ఏమిటి? ఎందుకు?’, బి.వి.ఎస్‌. రామారావు గారి ‘ఎసరూ– అత్తెసరూ’ను యెంచుకునేవారు. హృదయమూ– మేధస్సూలతో ప్రభావితమైన కథల్లో తనకు యెక్కువగా హృదయమే పునాదిగా వుండే కథలు యిష్టమని చెప్పేవారు.

పాత ఆంధ్రపత్రిక వుగాది సంచికల్లోనూ, భారతి మాసపత్రికల్లోనూ తరచుగా కనిపించే పేరు మునిపల్లె రాజు గారిది. ఆయన రాయడం మొదలుపెట్టిన రెండో దశలో వచ్చిన చాలా విశేష సంచికలకు ఆయన రచనలు అలంకారాలయ్యాయి. తెలుగులో సాహిత్య పత్రికలు అంతరించిపోవడమూ, ఆయన రాయడం మానేయడమూ దాదాపుగా వొకసారిగానే జరిగినట్టున్నాయి. యిప్పుడాయన భౌతికంగా గూడా వెళ్లిపోయారు.

వుద్యోగం చేస్తున్న రోజుల్లో సికిందరాబాదులో యిండ్లుగా మారిన బ్రిటీషు సిపాయిల గుర్రపుశాలల్లో నివసించినప్పుడూ, వుద్యోగ విరమణ తర్వాత చిక్కడపల్లిలో చిన్నయిళ్లలో వుంటున్నప్పుడూ, సైనికపురిలో తన కొడుకు కట్టిన స్విమ్మింగ్‌పూల్‌ కూడా వుండే విశాలమైన బంగళాకు మారినప్పుడూ– యెప్పుడూ ఆయన తనదిగాని యింటిలోకి దారితప్పి వచ్చిన బాటసారిలాగే కనిపించేవారు. తనదైన అసలైన యిల్లేదో తెలుసుకున్నట్టుగా యిప్పుడాయన యథాలాపంగా యెవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు.

కొండచిలువకు ఆహారం కాబోయి...
నలభై ఏళ్ల పాటు రక్షణరంగంలో ఉద్యోగం చేసి 1983లో రిటైరయ్యారు మునిపల్లె రాజు. ‘నేను ఆయుధం వాడాల్సిన అవసరం పెద్దగా రాలేదు. కానీ ఆయుధాల నిర్వహణ, వాటిని ఉపయోగించడం వంటివన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాను’ అని గతంలో ‘సాక్షి’తో మాట్లాడిన సందర్భంలో పేర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాకు దగ్గరగా ఫీల్డ్‌ ఏరియాలో, అస్సాం, మద్రాస్, వైజాగ్, పూనాలలో పనిచేశారు.

గుడారంలో ఒక నులకమంచం, సమాచారం అందించడానికి అవసరమైన సామగ్రి అమర్చుకునేవాళ్లు. అదే వారి కార్యాలయం. అప్పుడు రాడార్‌లు లేవు కాబట్టి బైనాక్యులర్స్‌తో గగనతలాన్ని పరికించి చూసేవారు. ‘ఆకాశంలో ఒక నల్లటి విమానం సంచరించింది, దూరంగా బాంబింగ్‌ జరిగిన చప్పుడు వినిపించింది. మేమున్న ప్రదేశానికి ఫలానా దిక్కులో బహుశా కిలోమీటరు దూరంలో పడి ఉండవచ్చు...’ వంటి వివరాలను టెలిగ్రాఫ్‌ కోడ్‌ ద్వారా పంపించేవాళ్లమని చెప్పారు.

కుటుంబాన్ని తీసుకెళ్లలేని ప్రదేశాలను ‘నో ఫ్యామిలీ స్టేషన్‌’ అంటారు. సాహిత్యాభిమాని కావడంతో అలాంటి ప్రదేశాల్లో కూడా హాయిగా ఉద్యోగం చేశారాయన. ‘వారానికోసారి పట్టణానికి వెళ్లి వారపత్రికలు తెచ్చుకుని చదువుకునే వాడిని. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేవాడిని. ఏనుగుల గుంపు జలపాతం కింద జలకాలాడటం వంటి దృశ్యాలు అద్భుతంగా ఉండేవి. ఒకరోజు కిషన్‌లాల్‌ అనే సహోద్యోగితో అస్సాం అడవుల్లో తిరుగుతుండగా చెట్టుకి కొండ చిలువ వేళ్లాడుతోంది. జంతువుల కోసం దాని వేట.

దాని నోటికి ఆహారం కాబోయి క్షణాల్లో తప్పించుకున్నాం. ఫీల్డ్‌ ఏరియాలో శత్రువుల నుంచి ప్రమాదాలను ఊహిస్తాం. కానీ ఇలా ప్రకృతి సహజమైన ప్రమాదాలను కూడా ఊహించి రక్షించుకోవాల్సిందేనని అప్పుడే తెలిసింది’ అని తన అనుభవాల్ని పంచుకున్నారు.
- మధురాంతకం నరేంద్ర

మరిన్ని వార్తలు