యుద్ధము – అశాంతి

27 Apr, 2020 00:52 IST|Sakshi

కొత్త బంగారం

థర్టీ ఇయర్స్‌ వార్‌గా చరిత్రలో నిలిచిపోయిన యూరప్‌ అంతర్యుద్ధం 1618–1648ల మధ్య ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగింది. కాథొలిక్స్, ప్రొటెస్టెంట్స్‌ మధ్య మతవిశ్వాసాల ఘర్షణగా మొదలైన యుద్ధం, వివిధ కారణాల మీదగా విస్తరించి, రోమన్‌ సామ్రాజ్యాన్ని రెండు పక్షాలుగా విభజించి, ఎనభై లక్షల మరణాలకి కారణమయింది. ఈ యుద్ధమే డానియల్‌ ఖిల్మన్‌ నవల ‘టిల్‌’కి నేపథ్యం. 2017లో ఖిల్మన్‌ రాసిన ఈ జర్మన్‌ నవల రోస్‌ బెంజమిన్‌ ఇంగ్లీష్‌ అనువాదంతో ఈ సంవత్సరమే విడుదలై, బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్‌ అయింది. ఈ హిస్టారికల్‌ ఫిక్షన్‌లో ఇది హిస్టరీ తాలూకు ఒక భాగం. టిల్‌ ఉలెన్‌స్పిగల్‌ అనే విదూషకుడు 14వ శతాబ్దానికి చెందినవాడు. అతని గురించి 1515లో తొలిసారిగా కామిక్స్‌ వచ్చాయి. ప్రజల బలహీనతలను ఎత్తిచూపిస్తూ, అల్లరిచిల్లరి చేష్టలతో గొడవ చేస్తూ ఉండే ఆ టిల్, ప్రస్తుతం నవలలోని కథానాయకుడు. అతడిని పధ్నాలుగో శతాబ్దం నుంచి పట్టుకురావడం హిస్టరీ, అతన్ని పదిహేడో శతాబ్దంలోకి ప్రవేశపెట్టడం ఫిక్షన్‌!

యుద్ధఛాయలు కమ్ముకుంటున్న ఒక ఊళ్లో టిల్‌ ఇచ్చే ప్రదర్శనతో నవల ప్రారంభం అవుతుంది. పాదరసం లాంటి టిల్‌ ఒకేసారి అయిదు బంతులతో జగ్లింగ్‌ చేయగలడు. వెంట్రిలాక్విజం చేయగలడు. ఎత్తుగా కట్టిన తాడు మీద చకచకా నడుస్తూ అబ్బురపరచే విన్యాసాలని ‘‘శరీరానికి బరువు, జీవితానికి విచారం అనేవి లేనట్టుగాం’’ చేయగలడు. జనాల మూర్ఖత్వాల మీద ప్రాక్టికల్‌ జోక్స్‌ వేయగలడు. ‘‘చావు గురించే ఆలోచిస్తూ కూచోవద్దు. దానికంటే మేలైన అవకాశం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది,’’ అనేది అతని సిద్ధాంతం. అన్నీ చేస్తూనే, మాట్లాడుతూనే అంతలోనే మాయమైపోగలడు. అతని వైదుష్యం అనంతరం,అతని బాల్యం మనకి పరిచయం అవుతుంది. మిల్లు నడుపుతుండే టిల్‌ తండ్రి క్లౌస్‌కి సృష్టిలోని రహస్యాల మీద ఆసక్తి ఎక్కువ. తెలియని విషయాలని శోధించాలనుకునే ఆయన్ని మంత్రగాడనే నెపంతో క్రైస్తవ మతాచార్యులు హింసించి మరణశిక్ష విధిస్తారు. ఇదంతా చూస్తున్న టిల్, తన స్నేహితురాలు నెలా అనే అమ్మాయితో ఊరు వదిలి పారిపోతాడు.

ఊరూరా వినోద ప్రదర్శనలిచ్చే బృందాలతో కొన్నాళ్లు తిరిగి, అంచెలంచెలుగా పేరు సంపాదించి, ‘వింటర్‌ కింగ్‌’ఫ్రెడరిక్‌ ఆస్థానంలో విదూషకుడి స్థానంలో కుదురుకుంటాడు– తన స్నేహితురాలితో సహా. రాజుని వినోదపరచడమే కాదు– విమర్శించడమూ అతని పనిలో భాగమే, తాడుమీద నడకే! ఫ్రెడరిక్‌ భార్య ఎలిజబెత్, ఇంగ్లండ్‌ రాజు కూతురు. ఎలిజబెత్‌ ఇచ్చిన రాజకీయ సలహాని ఫ్రెడరిక్‌ పాటించడంతో ముప్పై ఏళ్ల యుద్ధానికి తెర తీసినట్టు అవుతుంది. యుద్ధాలతోనూ, దౌత్యాలతోనూ రాజులు తమ అధికారం కోసం శ్రమిస్తూ ఉండగా, అక్కణ్నుంచి బయటపడి రకరకాల ప్రస్థానాలు సాగించిన టిల్, చివరి సన్నివేశంలో మళ్లీ ఎలిజబెత్‌ని కలుసుకోవడంతో నవల ముగుస్తుంది. ‘‘హాయిగా మరణించాలనుకోవడం కంటే, మరణించకుండా ఉండగలగడం అనేది మేలైన విషయం,’’అనే ఆఖరి సందేశంతో మాయమైపోయిన టిల్‌ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నామంటే, అతను దాన్ని పాక్షికంగా సాధించినట్టే! 

స్థూలంగా కథ ఇదే అయినా, ఇదంతా చాలా విస్తృతమైన అంశాల మధ్య నడుస్తుంది. నటనే నిజాయితీగానూ, గారడీయే వాస్తవంగానూ అనిపించే రోజులు అవి. నవలా సంవిధానం కాలంలో ముందుకీ వెనక్కీ వెళుతూ, అవే పాత్రలు మళ్లీ మళ్లీ ప్రత్యక్షం కావడాన్ని సంభ్రమంగా, సరికొత్తగా చూపిస్తుంది. సంక్షోభాలని వర్ణించడానికి ఉద్వేగరహితమైన కథనాన్ని ప్రదర్శించడం, మిగతా కథని సున్నితమైన హాస్యంతో నడపడం, పాదరసంలాంటి టిల్‌ నవలలో కనిపిస్తూ మాయమైపోతూండటం రచయిత చేసిన జగ్లింగ్‌. రచయిత చేసిన గారడీలతో గతం వర్తమానం కలగలిసిపోతాయి; చరిత్రా, కల్పనా వేరుచేయడానికి వీల్లేకుండా ఉంటాయి. ప్రతిభావంతమైన బెంజమిన్‌ అనువాదం ప్రతి పాత్రకీ విశిష్టమైన టోన్‌ అందిస్తుంది. హింసాపూరితమైన చీకటి గతానికి బలైనవారికి ఈ నవల ఒక నివాళి లాంటిది. నవలలో ఒక పాత్ర చెప్పినట్టు, ‘‘ఇదంతా నిజమే. ఒకవేళ కల్పన ఉన్నా, అది కూడా నిజమే!’’

ఎ.వి. రమణమూర్తి
నవల: టిల్‌, రచన: డానియల్‌ ఖిల్మన్‌, తొలి ప్రచురణ: 2017
జర్మన్‌ నుంచి ఇంగ్లిష్‌: రోస్‌ బెంజమిన్‌ 

మరిన్ని వార్తలు