వేమన శతకం వేనోళ్ల వర్థిల్లు

23 Mar, 2017 23:12 IST|Sakshi
వేమన శతకం వేనోళ్ల వర్థిల్లు

సందేశం

వేమన తన శతకం ద్వారా ఈ లోకంలో మనుషుల తీరు తెన్నులను సులువైన భాషలో,  సామాన్యులకు అర్ధమయ్యేటట్లు వివరించాడు. ప్రతి పద్యంలో మన జీవితాల్లో దాగున్న సత్యాలు కనిపిస్తాయి. ఆ యోగి చెప్పిన బాటలో నడిస్తే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ప్రయాణించి, అనుకున్న పనులు సులువుగా సాధించి, సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. దైనందిన జీవితంలో మనం నడుచుకోవాల్సిన తీరు సులభంగా ఉండేలా చెప్పాడు వేమన. ‘‘అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు...’’ ఏ పనైనా సాధన ద్వారా అలవడుతుంది, కేవలం ఒకసారి ప్రయత్నిస్తే లాభం ఉండదు,చేసే పనిపై శ్రద్ధాసక్తులు కనబరిస్తే అది తప్పకుండా సాధ్యపడుతుందని చెప్పిన వేమన పలుకులు అక్షర సత్యం.

‘‘ఆపదైనవేళనరసి బంధుల జూడు’’ బంధువులెవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం మన కర్తవ్యం, కానీ మనం చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశిస్తే అది బంధుత్వమే కాదు, స్వార్థం అవుతుందని బంధుత్వాన్ని నిర్వచించాడు వేమన. ‘‘చిక్కియున్నవేళ సింహంబునైనను’’ మనం అశక్తులమైనప్పుడు సహనం వహించడం మంచిది, లేకుంటే ప్రతివారికి చులకనవుతాం, అంటూ ఆవేశం అన్నివేళలా అనర్థదాయకమని మృదువుగా చెబుతాడు శతక కర్త.

‘‘తప్పులెన్నువారు తండోపతండంబు’’ ఇతరుల మీద అనవసరమైన నిందలు మోపుతుంటారు కొందరు, అదే తప్పు వారు చేస్తే మాత్రం కిమ్మనరు. మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం అవి మనం కనీసం గుర్తించము, కాని ఇతరుల తప్పులను మాత్రం వెంటనే వేలెత్తి చూపుతాం. ఆత్మస్తుతి, పరనింద చేసే వారు ఆత్మవిమర్శ చేసుకునేలా హితవు పలికాడు వేమన. ‘‘పట్టుబట్టరాదు పట్టివిడువరాదు’’ ఏ పనైనా ప్రారంభించి మధ్యలోనే వదిలేస్తుంటారు, అది మనతో సాధ్యపడదని తలచి ఆపనిని విరమించుకుంటారు కొందరు, కాని పట్టుదలతో ఏ పనైనా మనం సాధించవచ్చని వేమన ఆనాడే మానవాళికి మంచి చెప్పాడు. ‘‘ఇనుము విరిగినేని యినుమారు ముమ్మారు’’ పరుషంగా మాట్లాడి పరులను బాధపెట్టేవారు, క్షణికావేశంతో ఆ మాటలను అనవచ్చు, కాని ఆ మాట పడ్డవారు అప్పటితో మరచిపోలేరు, అది వారిని చాలా కాలం బాధిస్తుంటుంది అంటూ వైవిధ్యమైన పద్యాలను మనకు అందించాడు యోగి వేమన.

ఒక్కో పద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అన్వయించగల పద్యాలు వేమన సొంతం. ఆయన పద్యాల్లోని సారం అనిర్వచనీయం. ముఖ్యంగా ఆధునిక సమాజంలోని అవకతవకలను తన నీతి వాక్యాల ద్వారా నవసమాజానికి అందించాడు వేమన. ఆయన పద్యాల్లో కొన్నింటినైనా నేర్చుకుంటే, అది మన వికాసానికి తోడ్పడుతుంది. పెద్దలు చిన్నారులకు రోజుకొక పద్యం చొప్పున నేర్పిస్తే మంచి ఫలితముంటుందనడంలో సందేహం లేదు.

మరిన్ని వార్తలు