ఆకాశానికి స్కీటింగ్ 

12 Apr, 2019 01:51 IST|Sakshi

రెండేళ్లనాటి వీడియో ఆల్బమ్‌ ‘ఆల్ఫా ఫిమేల్‌’ మళ్లీ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. దేశమంతా ఎన్నికల మూడ్‌లో ఉన్నప్పుడు ఈ వీడియో ఇప్పుడెందుకు నెట్‌ ఉపరితలంలోకి వచ్చింది?! స్త్రీ శక్తి అందులోని థీమ్‌. 

ఓటు వేయడంలోనే కాదు, సీట్లకు పోటీ పడడంలోనూ నేటి మహిళ చూపుతున్న చొరవకు, ఉత్సాహానికి ‘ఆల్ఫా ఫిమేల్‌’..ప్రస్తుత తరుణంలో ఒక ప్రతీక అయింది. ఇదే సమయంలో చెరకు పొలాల్లోని శ్రామిక మహిళల దైన్యస్థితిని బహిర్గతం చేసిన ఓ వార్తా కథనం కూడా వైరల్‌ అయింది. స్త్రీ శక్తి అటొకటి, ఇటొకటిగా ఉన్న వైరుధ్యాలివి.

ఇండియా ఇప్పుడు మహిళలు స్వారీ చేస్తున్న ఒక గెలుపు గుర్రం! ఉహు.. గెలుపు గుర్రం పాత పోలిక. ఇండియా ఇప్పుడు ‘స్కేట్‌బోర్డింగ్‌ ఉమన్‌’! చీర కట్టుకుని హైవేపై స్కేటింగ్‌ చేస్తున్న మహిళను ఊహించుకోండి! ఒడుపుగా, వేగంగా, ధీమాగా.. మలుపుల్లో గాల్లోకి పైకి లేచి, లక్ష్యాల వైపు దిగి రయ్యిన సాగిపోతోంది ఇండియా. ‘ఉమెన్‌ హోల్డ్‌ అప్‌ హాఫ్‌ ద స్కై’! అన్నదెవరూ.. మావో జెడాంగ్‌. చైనా మహోన్నత విప్లవకారుడు. ఆయన అన్న ‘ఆకాశంలో సగం’ బాగా పాతబడిపోయిన మాట. ఆకాశంలో అంతా వాళ్లే ఇప్పుడు. మహిళలే. ‘ఉమన్‌ ఫస్ట్‌’ అన్నాడు మోదీ సడన్‌గా ఈవారం ఎలక్షన్‌ సభలో! రాహుల్‌ అయితే.. ఉమెన్‌ పవరేంటో ఎన్నికలకు ముందే గుర్తించి, ‘నో ఉమన్‌.. నో ఇండియా’ అన్నాడు! మహిళ లేనిదే ఇండియా లేదని. ‘‘మాకు పవర్‌ ఇస్తే మీకు పవర్‌ ఇస్తాం’’ అని మోదీ, రాహుల్‌.. ఇద్దరూ, మహిళలకు హామీ ఇచ్చారు.

కామన్‌గా వీళ్లిచ్చిన హామీ చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌లు. రాహుల్‌ ఇంకో స్టెప్‌ వేసి, ఉద్యోగాల్లో కూడా మహిళలకు ముప్పైమూడు శాతం ఇస్తాం అని వాగ్దానం చేశారు. అంతవరకు ఎందుకని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఈ ఎన్నికల్లో 41 శాతం సీట్లు మహిళలకే ఇచ్చారు! ఒడిశా సీఎం ముఫ్పైమూడు శాతం ఇచ్చారు. ఈ రెండు రాష్ట్రాల్లో నిన్ననే ఎన్నికలు ముగిశాయి. భారతీయ రాజకీయాల్ని మహిళలు శాసించబోతున్నారనే దానికి చిన్న సంకేతం ఒకటి గత ఏడాది జరిగిన రాజస్తాన్‌ ఎన్నికల్లో తొలిసారిగా గమనింపుకు వచ్చింది. ఏ ఎన్నికల్లోనూ లేనంతగా ఆ ఎన్నికల్లో ఓటేయడానికి ఇళ్లలోంచి మహిళలు బయటికి వచ్చారు! మహిళా ఓట్లు ఎక్కువగా పోల్‌ అయిన స్థానాల్లోని అభ్యర్థులంతా పార్టీలతో సంబంధం లేకుండా గెలిచారు. మహిళలకు నీళ్లు కావాలి. నీళ్లిస్తానన్నవాళ్లకు, నీళ్లివ్వగలరన్న నమ్మకం ఉన్నవాళ్లకు ఓటేసి గెలిపించుకున్నారు.

ఇదొకటే సంకేతం కాదు. దేశంలోని రాష్ట్రాలన్నిటిలో మహిళా ఓటర్లు పెరిగారు. ఓటేసే మహిళలూ పెరిగారు. విద్య, ఉద్యోగ, సేవా రంగాల్లోనే మాత్రమే ఇంతవరకు అన్నిటా పురుషుడితో సహ భాగస్వామ్యం కలిగి ఉన్న మహిళలు.. రాజకీయాల్లో ఆ సహత్వాన్ని, సమత్వాన్ని దాటి ‘ఈ దేశం ఎలా ఉండాలంటే?’ అని నిర్ణయించే శక్తిగా ఎదిగారు. అయితే ఇదంతా రాజకీయ రంగంలో. ఎన్నికల సందర్భంలో ఉన్నాం కాబట్టి.. ‘స్కేట్‌బో ర్డింగ్‌ ఉమన్‌’ గురించి మాట్లాడుకున్నాం. కానీ శ్రామికరంగంలో రోజువారీ మహిళా కూలీల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇందుకు ఒక నిదర్శనం.. మహారాష్ట్ర బీద్‌లోని చెరకు పొలాల్లో పని చేస్తున్న మహిళా కార్మికుల దయనీయస్థితి. ఏ రోజైనా కూలీ పనికి వెళ్లలేకపోతే యాజమాన్యానికి ఆ రోజుకు చెల్లించవలసిన రూ.500 నష్టపరిహారాన్ని తప్పించుకోవడానికి ఆ మహిళలు బహిష్టు అవాంతరాలు రాకుండా గర్భసంచిని తీయించుకున్నారనే విషయం తాజాగా దేశాన్ని దిగ్భ్రాంతి పరచింది.

ఎన్నికలే లేకపోతే.. పార్లమెంటే జరుగుతుంటే.. పత్రికలకు, టీవీలకు ఇదొక బ్రేకింగ్‌ స్టోరీ అయి ఉండేది. అంతలోనే మహిళల్ని ఆకాశానికి ఎత్తేసి, మళ్లీ అంతలోనే కిందికి దింపేయడం కాదిది. రాజకీయ అధికారం కలిగిన, రాజకీయ అధికారం ఇస్తున్న మహిళలు ప్రాధాన్యం ఇవ్వవలసిన అంశాలలో.. మహిళల జీవితాలను దుర్భరం చేస్తున్న పేదరికం ఒక ప్రధానాంశం అని చెప్పుకోవడం.స్త్రీల ఆరోగ్యం నెలలో అన్ని రోజులూ ఒకేలా ఉండదు. పని మాత్రం అన్నీ రోజులూ ఉంటుంది. ఆడైనా, మగైనా ఆరోగ్యం బాగుంటేనే కదా.. పని చేయడం. కానీ పని ఇచ్చినవారు, పనికి డబ్బులు ఇచ్చేవారు పని జరిగిందా అనే చూసుకుంటారు. ఆడా, మగా అని చూసుకోరు. స్త్రీ,పురుషులకు ఇచ్చే వేతనం ఒకేలా లేకపోయినా, పురుషుడితో సమానంగా స్త్రీ కూడా పని చేయాలని ఆశిస్తారు. నెలసరి రోజుల్లో ఒంట్లో బాగోలేకపోవడంతో వాళ్లకు సంబంధం లేదు. పని జరగాలి అంతే. పనికి రాకపోతే ఆరోజు కూలీ కట్‌. అయితే బీద్‌లోని చెరకు పొలాల పంట కోత పనుల్లో ఇంతకన్నా దారుణమైన పని నిబంధనలు ఉన్నాయి.

పనికి రాని రోజు కూలీలు ఆ రోజు వేతనాన్ని తిరిగి తామే పరిహారంగా చెల్లించవలసి ఉంటుంది! చెల్లించలేకపోతే ఉపాధికే అది ఆఖరి రోజు అవుతుంది. బహిష్టు రోజులలో స్త్రీలకు నీరసంగా, నిస్సత్తువగా ఉంటుంది. పొత్తికడుపు నొప్పి ఉండొచ్చు. అకారణంగా చికాకు, విసుగు ఉంటాయి. కొందరు నిస్పృహలోకి వెళ్తారు. మరికొందరు అసలే లేవలేరు. ఈ స్థితిలోనూ వారి నుంచి పనిని, సేవల్ని ఆశించడం క్రౌర్యమే. ఇళ్లలోనూ, ఆఫీస్‌లలోనూ స్త్రీ పట్ల ఈ రకం క్రౌర్యం, నిర్దయ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడు కొన్ని దేశాలు.. బహిష్టు రోజులకు జీతంతో కూడిన సెలవును ఇచ్చే చట్టాలు తెస్తున్నాయి. అయితే రోజువారీ కూలీల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆ చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. బీద్‌ విషయానికే వస్తే.. పనికి వెళ్లని రోజున ఒక రోజు వేతనాన్ని యజమానికి చెల్లించే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండేందుకు అసలు బహిష్టులే రాకుండా, గర్భాశయాన్ని తీయించుకోవడం.. అన్నది ఏడు సముద్రాలంత దుఃఖాన్ని కలుగజేసే విషయం.

మీడియాలో ఈ వార్తను చదివి చలించిపోయిన మహారాష్ట్ర జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.పి.ఎస్‌. మదన్‌కు మంగళవారం నోటీసులు పంపుతూ, జరిగిన దానిపై తక్షణం విచారణ జరిపించాలని, మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని కోరారు. ‘‘ఉపాధి పోతుందన్న భయంతో గర్భసంచిని తీయించుకునే (హిస్టెరెక్టమీ) దుస్థితి ఉండడం మానవ నాగరికతకే తలవంపు’’ అని ఆ లేఖలో రేఖ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ మహారాష్ట్రలో అక్టోబర్‌ – మార్చి మధ్య కాలంలో చెరకు పంట కోతలు ఉంటాయి. అక్కడి కాంట్రాక్టర్లు కోత పనికి వచ్చే భార్యాభర్తలిద్దర్నీ ‘ఒకే కూలీ’గా రిజిస్టర్‌లో నమోదు చేసుకుని, వాళ్లిద్దరిలో ఏ ఒక్కరు పనికి రాకపోయినా రోజుకు రూ.500 చొప్పున వాళ్లకు ఇవ్వబోయే జీతంలో తగ్గించుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. జీతంలో కోత పడకుండా చూసుకోవడం కోసం ఇద్దరు ముగ్గురు పిల్లలున్న తల్లులు గర్భాశయాన్ని తీయించుకున్న ఘటన వెలుగు లోకి రావడంతో మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.  

మహిళల సమస్యల్లో ముందుండేవి వివక్ష, అసమానత్వం, గృహహింస, పని చేసే చోట లైంగిక వేధింపులు, అత్యాచారాలు, లైంగిక హత్యలు. అయితే ఇవన్నీ పైకి కనిపించేవి. వీటన్నిటికన్నా కూడా మహిళా జీవితాన్ని దుర్భరం చేసేదీ, ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి రూపాయిని చేజారిపోనివ్వని పరిస్థితుల్ని కల్పించేది.. పేదరికం! అధికారంలోకి రాబోయే మహిళలు, తమ అభ్యర్థులను అధికారంలోకి తీసుకురాబోతున్న మహిళలు.. మహిళల పేదరికాన్ని నిర్మూలించేందుకు ‘స్కేట్‌బోర్డింగ్‌’ చేయాలి. మహిళల శ్రమకు తగిన ఫలితమో, తగుమాత్రం ఫలితం కాకుండా.. ఒక విలువను సృష్టించాలి. పనికి రాలేని రోజున కూడా వేతనం ఇచ్చినప్పుడు నిజంగా ఈ దేశం స్త్రీ శ్రమ విలువను గుర్తించినట్లు. స్త్రీ శ్రమకు గౌరవం ఇచ్చినట్లు. 

ఆల్ఫా ఫిమేల్‌ 
మహిళలు స్కేటింగ్‌ చేస్తున్న ఈ ఫొటో రెండేళ్ల క్రితం ‘వైల్డ్‌ బీస్ట్స్‌’ అనే ఇంగ్లిష్‌ ఇండీ రాక్‌ బ్యాండ్‌ విడుదల చేసిన ‘ఆల్ఫా ఫిమేల్‌’ అనే వీడియో ట్రాక్‌ లోనిది. ఆల్ఫా ఉమెన్‌ అంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్న మహిళలు అని అర్థం. సమాజంలోని వివిధ రంగాలతో పాటు రాజకీయ రంగాన్నీ మహిళలు అతి శక్తిమంతంగా ప్రభావితం చేస్తున్న ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఈ వీడియోకు మళ్లీ ప్రాధాన్యం లభించింది. 3 నిమిషాల 43 సెకన్ల ఈ వీడియోలో.. స్కేటింగ్‌ చేస్తున్న మహిళల నేర్పు నివ్వెరపరిచేలా ఉంటుంది. 

మరిన్ని వార్తలు