వెయిట్‌ లాస్‌..? ప్లీజ్‌ వెయిట్‌ బాస్‌

10 May, 2017 23:17 IST|Sakshi
వెయిట్‌ లాస్‌..? ప్లీజ్‌ వెయిట్‌ బాస్‌

అధికబరువుతో జిమ్‌కి వెళ్లిన వారిలో అత్యధికులు స్వల్పకాలంలోనే వ్యాయామాలకు గుడ్‌బై చెప్పేయడం జరుగుతోందంటున్నారు నిపుణులు. వీళ్లు జిమ్‌కి వెళ్లడం  మరిన్ని ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోందట. ఈ అంశంపై హైదరాబాద్‌లోని ప్రతిమ హాస్పిటల్‌కు చెందిన చీఫ్‌ ఆర్థోపెడిషియన్‌ సర్జన్‌ డాక్టర్‌ రాధాకృష్ణ విళ్లేషణ ఇదీ...

కఠినంగా కాదు !
రన్నింగ్, క్రాస్‌ ట్రైనర్, సైక్లింగ్, ట్రెడ్‌మిల్‌... తదితర కార్డియో వర్కవుట్స్‌ ఎక్కువ చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గుతాం అనుకుంటారు. ప్రారంభంలోనే జిమ్‌లో అత్యధిక సమయం వ్యాయామానికి కేటాయిస్తారు. నొప్పులు వస్తే బాగా చేశాం అనుకోవడం... ఇవి జాయింట్‌ పెయిన్స్‌ వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అధికబరువు తగ్గించుకునే క్రమంలో జిమ్‌కి వెళ్లడానికి ముందు శరీరానికి ప్రీ టోనింగ్‌ కోసం రోజూ కనీసం 10 నిమిషాలు చొప్పున బ్రిస్క్‌ వాకింగ్‌ చేయాలి.

వర్కవుట్‌ మిషన్‌లపై అవగాహన
జిమ్‌లో ప్రతి వర్కవుట్‌ మిషన్‌ గురించి తెలుసుకోవాలి. ట్రెడ్‌ మిల్‌ ఎలా అడ్జస్ట్‌ చేయాలి, సైకిల్‌ మీద కరెక్ట్‌గా కూర్చున్నామా లేదా అనేది సరిచూసుకోవాలి.. ట్రెడ్‌మిల్, క్రాస్‌ ట్రైనర్‌ లేదా పెలక్టికల్, స్టెప్పర్, సైకిల్‌ వంటి వాటి పని తీరు గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. మనం ట్రెడ్‌ మిల్‌ చేస్తున్నప్పుడు దాని సర్ఫేస్‌ ఫ్లాట్‌గా లేదా సమాంతరంగా ఉండాలి. ఇన్‌క్లినేషన్‌ జీరోలో ఉండాలి. కేలరీల ఖర్చు, మిషన్‌పై గడుపుతున్న సమయం... ఈ నంబర్స్‌కి మీ ఆరోగ్యంతో సంబంధం లేదని గుర్తించండి. ముఖ్యంగా కేలరీలతో పాటు ఏమేం కోల్పోతున్నామో తెలుసుకోండి. వేగం 5.5 తర్వాత బ్రిస్క్‌వాక్‌లో నుంచి రన్నింగ్‌గా మారుతుంది. కాని కేవలం బ్రిస్క్‌వాకింగ్‌కే పరిమితం అవడం మంచిది.

నిస్సత్తువ వచ్చాక మజిల్‌ సామర్ధ్యం తగ్గిపోతుంటుంది. అందుకని ఏ కార్డియో స్టేషన్‌ మీదైనా 20 లేదా 25 నిమిషాల కంటే ఎక్కువ సమయం వెచ్చించకూడదు. ఎందుకంటే ఒకటే మజిల్‌పై ప్రెషర్‌ పడితే ఆ మజిల్‌ డామేజ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. స్టెప్పర్‌ ఒకింత కఠినంగా అనిపిస్తుంది కాబట్టి అధిక బరువున్నవాళ్లు బాగా కేలరీలు బర్న్‌ చేస్తున్నాం అనుకుంటారు. కాని అది మోకాలికి  హాని చేస్తుంది.  కూర్చుని చేస్తాం కాబట్టి సైక్లింగ్‌ చాలా మం చిది. జాయింట్‌ మీద బాడీ వెయిట్‌ పడదు.  వెయిట్‌ లాస్‌ ప్రక్రియలో కేలరీ ఖర్చు అవడంతో పాటు మజిల్‌ కూడా లాస్‌ అవుతామని గుర్తుంచుకోవాలి. వెయిట్‌ ట్రైనింగ్‌తో మాత్రమే మజిల్‌ సామర్ధ్యం పెరుగుతుంది కాబట్టి స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌కూ ప్రాధాన్యం ఇవ్వాలి.

ఓవర్‌ వెయిట్‌... చేయకూడని వర్కవుట్‌?
ఉండాల్సిన బరువుకన్నా  పది కిలోలు ఎక్కువుంటే ఓవర్‌ వెయిట్, అంతకు మించి ఉంటే ఒబేసిటీ అంటారు. ఓవర్‌ వెయిట్‌ ఉన్నవాళ్లు కార్డియో వర్కవుట్స్‌ చేస్తే సరిపోతుంది. ఒబేసిటీ ఉన్నవాళ్లు మాత్రం కార్డియో, డైట్‌ కంట్రోల్, వెయిట్‌ ట్రైనింగ్‌ కూడా చేయాలి. ఇలాంటి వ్యక్తులు స్కిప్పింగ్, జంపింగ్, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయకూడదు. ఒక నెల వరకూ అబ్డామినల్‌ వ్యాయామాలు వ్యక్తిగత ట్రైనర్‌ పర్యవేక్షణలో చేయాలి. బాడీ ఫ్యాట్‌లో పొట్ట దగ్గరున్న ఫ్యాట్‌ మాత్రమే పోవాలి.
- డాక్టర్‌ రాధాకృష్ణ సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌

మరిన్ని వార్తలు