ఎత్తు మడమలు

28 Mar, 2019 01:39 IST|Sakshi

మూవ్‌మెంట్‌

హక్కులు లేవు ఉద్యమించారు. సమానత్వం లేదు. ఉద్యమించారు. పురుషుడు తిన్నగా లేడు. ఉద్యమించారు. ఉద్యమించడం అంటేనే కదలడం కదా.. ఇప్పుడిక ‘కదలడం’ కోసం కూడా ఉద్యమించారు! ఈ ఉద్యమంలో తొలి కదలిక.. ‘కూటూ’ మూవ్‌మెంట్‌. మున్ముందు జరిగే యుద్ధాలన్నీ నీళ్ల కోసమేనన్నట్లు.. ఇకపై స్త్రీలు జరిపే ఉద్యమాలన్నీ ‘కదిలే స్వేచ్ఛ’ కోసమే కావచ్చు! 

మాధవ్‌ శింగరాజు
స్త్రీలో పైకి కనిపించని దేహభాగం ‘ఒద్దిక’! ఆమె పుట్టగానే ఒద్దికను ఆమె ఒంటికి కలిపి కుట్టేస్తుంది సంప్రదాయం. అందుకే ఒద్దికకు, ఆడపిల్లకు చాలాసార్లు తేడా తెలియదు మనకు. కొన్నిసార్లైతే ఒద్దికనే ఆడపిల్ల అని భ్రమపడతాం. ఒద్దికలేని ఆడపిల్లను ఆడపిల్లగా అస్సలే గుర్తించలేం. అయినా సంప్రదాయాలు ఆడపిల్ల వెంటే ఎందుకు పడతాయి? ఆమె అందంగా ఎదగాలి.. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌.. ఒళ్లు విరుచుకోకుండా ఎదగాలి. ఎలా? ఆమె దేహభాగాలను మూసల్లో, వస్త్రాల్లో బిగించడం ఉపాయం. స్త్రీ పాదాలు చిన్నవిగా ఉండడం అందం అనుకున్నారు. అవి అందంగా, చిన్నవిగా పెరగడం కోసం గూడుచెప్పులు కుట్టించి, ఇవి తొడుక్కోవడం సంప్రదాయం అన్నారు. పాదాలు పెరక్కుండా అవి నొక్కి పడతాయి. ఆమె పెరుగుతున్నా పాదాలు ఆ గూళ్ల పరిమితిని దాటి ఎదగవు. బాడీ మొత్తాన్ని కవర్‌ చేసే మరో సంప్రదాయం చీర. అప్పటికీ వీపు, మెడ, నడుము బయటపడుతున్నాయి. ఏమిటి సాధనం? నడుము చుట్టూ చీర కొంగును తిప్పుకోవడం సంప్రదాయం అయింది. వీపు, మెడ కనిపించకుండా తల చుట్టూ కొంగు కప్పుకోవడం సంప్రదాయం అయింది.

సంప్రదాయం సంపూర్ణం! చీర పరుగులు పెట్టనివ్వదు. పెద్ద అంగలు వెయ్యనివ్వదు. పరుగెత్తవలసిన అవసరంలోనూ చీర తట్టుకుని స్త్రీ పడిపోవలసిందే తప్ప, సంప్రదాయం పడిపోదు. అలా ప్లాన్‌ చేశాం. ఇంకా చాలా ఉంటాయ్, మగాళ్లకు తెలియనివీ, ఊహించనివీ.. ఆడవాళ్ల ఒంటి మీద సంప్రదాయాల దుస్తులు, ధారణలు. తెలీదు నిజమే. ఊహించలేం నిజమే. వాళ్లొచ్చి బాధగా ముఖం పెట్టి కంప్లయింట్‌ చేసినప్పుడైనా వినాలి. మనం చేయగలిగింది చెయ్యాలి. చేయ తగనిది మానాలి. స్త్రీ అని కాదు. సాటి మనిషి కదా. ఆ మాత్రం కన్సర్న్‌ ఉండాలి. ‘అమ్మో! సంప్రదాయం. దాన్ని బ్రేక్‌ చెయ్యలేం’ అని దూరంగా జరిగితే.. వాళ్లకై వాళ్లు బ్రేక్‌ చేసుకుని బయటికి వచ్చేయడం న్యాయమే! పాదాలు ఎన్నాళ్లని అలా ఉక్కులాంటి పాదరక్షల్లోపలే ఉండిపోతాయి. శరీరం ఎన్నాళ్లని ఉక్కపోత చీరలో మెల్లిగా ఊపిరి తీసుకుంటుంది? చెప్పుల్ని కాళ్లు, చీరల్ని ఒళ్లు వదిలించుకుని బయటికి వచ్చేస్తాయి. సంప్రదాయాల్ని గౌరవించేవారు.. సంప్రదాయాల్ని ‘బ్రేక్‌ చేసే సంప్రదాయాన్నీ’ గౌరవించాలి.. ఫర్‌ ద సేక్‌ ఆఫ్‌.. హ్యూమన్‌ పెయిన్‌. నొప్పిని పోగొట్టడం కోసం.

ఆ నొప్పిని అనుభవిస్తున్నది ఆడమనిషైనా, మగమనిషైనా. జపాన్‌లో ఆఫీస్‌లకు ఉద్యోగినులు హైహీల్స్‌ వేసుకుని వెళ్లాలి. డ్రెస్‌ కోడ్‌లో భాగం అది. హైహీల్స్‌ నడకను అందంగా మార్చవచ్చు. దేహాన్ని సొగసైన ఆకృతిలో చూపించవచ్చు. హై హీల్డ్‌ కదలికల వల్ల ఆఫీస్‌లకు ‘ఎలిగెన్స్‌’ లాంటిదేదో ఒనగూడవచ్చు. మరి ఆ ఎత్తు మడమలు పెట్టే బాధ సంగతేమిటి? పాదాల బాధ ఒక చోటే స్థిరంగా ఉండదు. దేహంలో ఏ మూలకు ఎఫెక్ట్‌ ఇస్తుందో చెప్పలేం. జపాన్‌వాళ్లకు, చైనావాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. చూశారు.. చూశారు.. ఇక లాభం లేదనుకుని ఈ ‘ఆఫీస్‌ సంప్రదాయం’పై మహిళలు ‘కూటూ’ ఉద్యమం మొదలుపెట్టారు. అవును. జపాన్‌లో ఇప్పుడు ‘కూటూ’ ఉద్యమం నడుస్తోంది. పురుషులు వేధిస్తున్నట్లుగానే, హైహీల్సూ వాళ్లను వేధిస్తున్నాయి మరి. అందుకే ‘మీటూ’ స్ఫూర్తితో.. ‘కూటూ’ మూవ్‌మెంట్‌ని తెచ్చారు. పనిచేసే చోట వేధింపులపై ‘మీటూ’, పనిచేసే చోట హైహీల్స్‌పై ‘కూటూ’.. ఇప్పుడా దేశంలో రెండు మహిళా ఉద్యమాలు సమాంతరంగా నడుస్తున్నాయి.

‘కు’ అంటే జపాన్‌లో షూ అని, ‘కూ’ అంటే నొప్పి అని అర్థం అట. రెండిటినీ కలిపి, ‘కూటూ’ అని కాయిన్‌ చేశారు. అక్కడి మగాళ్లకు ఇది మీనింగ్‌లెస్‌లా అనిపిస్తోంది. ‘అతి కాకపోతే, ఏంటిదీ’ అని అప్పుడే కామెంట్స్‌ మొదలుపెట్టేశారు! బాడీకి కంఫర్ట్‌గా లేకపోతే జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఆ ‘ఇరుకు’ను ఫీల్‌ అయ్యేవాళ్లకే తెలుస్తుంది. ఆడవాళ్ల కంఫర్ట్‌ని మింగేసి కంఫర్ట్‌గా కూర్చునే ఇన్‌స్టింక్ట్‌ మగపుట్టుకలోనే ఉంటుందేమో. టూ మచ్‌ స్పేస్‌ తీసేసుకుంటారు. పక్కన మనిషి ఉందనే జ్ఞానమూ, స్పృహ ఉన్నా కూడా.. దిస్‌ ఈజ్‌ మై ఆటిట్యూడ్‌ అన్నట్టు! ‘కిక్‌ 2’ సినిమాలో ఒక పాట ఉంది. రవితేజ పాడతాడు. ‘మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్‌ లేదనీ.. లిజన్‌ టు మై వర్డ్‌ డూడ్‌ / నేను ఏడూ నెల్లకే బయటికి తన్నుకు వచ్చాను.. దిస్‌ ఈజ్‌ మై ఆటిట్యూట్‌’ అని. కంఫర్ట్‌ కోసం బయటికి వచ్చేయడం అది. అలా కాకుండా, కంఫర్ట్‌ కోసం పక్కకు నేట్టేసేవాళ్లుంటారు. ‘మ్యాన్‌ స్పేసింగ్‌’ అంటారు అలా నెట్టేయడాన్ని. అర్బన్‌ డిక్షనరీలో ఆ మాటకు అర్థం ‘పక్క మనిషిని నెట్టేసి, స్పేస్‌ తీసుకోవడం’.

కంఫర్ట్‌ కోసం నెట్టేయడమే అనాగరికం అనుకుంటే.. మరింత కంఫర్ట్‌ కోసం పక్కవాళ్ల కంఫర్ట్‌ని లాగేసుకోవడం ఆదిమానవరికం. పనిచేసే చోట, ప్రయాణిస్తున్న చోట చేతులు ఆడిస్తారు.  కాళ్లు చాపుతారు. ఆవలిస్తారు. పెద్దగా అరుస్తారు. సర్వావయాలను ఊపుతుంటారు. తోకక్కటే లేదు. ఉంటే దాన్ని కూడా గాల్లోకి తిప్పుతూ కూర్చుంటారు. ఇవన్నీ మ్యాన్‌ స్పేసింగే. వీటితోపాటు సంప్రదాయాల మ్యాన్‌ స్పేసింగ్‌! ఆడపిల్లల్ని సంప్రదాయబద్ధంగా పెంచడం, వాళ్లు సంప్రదాయంగా పెరగడం మంచిదే. అయితే ఎంత వరకు? వాళ్ల బాడీ అండ్‌ సోల్‌ పాడవనంత వరకు. పుట్టకముందు వరకు బిడ్డను తల్లి గర్భం కాపాడుతుందని, పుట్టాక సంప్రదాయమే తల్లి గర్భమై బిడ్డను సంరక్షిస్తుందని అనుకున్నా.. కడుపులో కంఫర్ట్‌గా లేకపోతే బిడ్డ ఎంతకాలమని లోపలే ఉండిపోతుంది?! కదలికల స్వేచ్ఛ కోసం తన్నుకుని బయటికి వచ్చేయదా? గుండె నిండా గాలిని పీల్చుకుని బతుకు జీవుడా అనుకోదా?!  

మరిన్ని వార్తలు