ఎవరు.. ఎందుకు ఉపయోగిస్తున్నారు?

18 Jan, 2020 02:44 IST|Sakshi

ఆన్‌లైన్‌

‘స్మార్ట్‌ ఫోన్లు వచ్చినదగ్గరనుంచి ఈ ఆడవాళ్లు ఎప్పుడు చూసినా ఇంటర్నెట్‌లోనే ఉంటున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ తప్ప వీరేం చూస్తారు’ అని నెట్‌సెర్చింగ్‌ చేసే ఆడవాళ్లను ఆడిపోసుకుంటుంటారు కొందరు పురుషపుంగవులు. అయితే, ఇంటర్నెట్‌ వినియోగంలో భారతీయ మహిళ ఏ దిశగా వేళ్లు కదుపుతుందో తెలిస్తే ఇక నుంచి అనవసర మాటలను పెదవి దాటించడానికి కూడా సాహసించరు. భారతీయ మహిళ ‘సాధికారత శక్తి’గా అదీ వేగంగా అభివృద్ధి చెందడానికి తపన పడుతోంది. ఈ నిజాలను భారతదేశం అంతటా మహిళా ఇంటర్నెట్‌ వినియోగదారుల అలవాట్లను సర్వే చేసిన ‘న్యూ వెరిజోన్‌ మీడియా’ అధ్యయనం చేసి, విషయాలను తేటతెల్లం చేసింది. చదువు, కెరియర్‌ డెవలప్‌మెంట్, సాధికారత, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటివి మహిళలు ఎక్కువగా శోధించే అంశాలుగా తేలింది. ఇక ‘యువ భారతీయ మహిళల అన్‌లైన్‌ అలవాట్ల’పై నీల్సన్, వెరిజోన్‌ మీడియా కలిసకట్టుగా సర్వేలు నిర్వహించారు.  2019 జూలైలో భారతదేశంలో 12 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో కళాశాల విద్యార్థులు, యువశ్రామిక మహిళలు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నారు.

వృత్తి నైపుణ్యాలు మెరుగు
భారతీయ మహిళలు ఆన్‌లైన్‌లోకి వెళ్లిన ప్రతిసారీ వృత్తిపరంగా ముందుకు సాగడానికి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి శోధిస్తున్నట్లు వెల్లడైంది. 44 శాతం మంది మహిళలు ఆంగ్లంలోనూ, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు సెర్చ్‌చేస్తూ ఉద్యోగం చేయడానికి అనువైన శక్తిని నింపుకుంటున్నారు. ఈ తరహా దృష్టి 18 నుంచి 23 సంవత్సరాల వయసు యువతులలో తీవ్రంగా ఉంది. యువతులు విద్య, కెరియర్, నైపుణ్యాలకు సంబంధించి ఎక్కువ కంటెంట్‌ను యాక్సెస్‌ చేయగా, 29 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు వ్యక్తిగత శ్రేయస్సుకు సంబంధించి ఆన్‌లైన్‌ వీడియో కంటెంట్‌ను యాక్సెస్‌ చేసినట్టు తెలుసుకున్నారు.

కచ్చితమైన సమయవేళలు
సర్వే చేసిన మొత్తం మహిళలో 80 శాతం భాషకు సంబంధించి ఉండగా వీరిలో 1/5 మంది మాత్రమే ఇంగ్లిష్‌ భాషకు సంబంధించిన కంటెంట్‌ను యాక్సెస్‌ చేశారు. మహిళలు ఎక్కువ శాతం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.

ఆరోగ్యం – ఫిట్‌నెస్‌
ఆరోగ్య స్పృహ, శారీరక ఫిట్‌నెస్‌కు సంబంధించిన కేటగిరీలో 35 ఏళ్లు దాటిన మహిళల సంఖ్య 70 శాతం ఉంది. వీరే తరచూ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను చూడటం, ఆర్టికల్స్‌ను చదవడం, షేర్‌ చేయడం చేస్తున్నారు. వీరు 5 నిమిషాల నిడివి గల వీడియోలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో సబ్‌స్క్రైబ్‌ చేయడం వంటివి మెట్రో నగరాల్లో 60 శాతం మంది మహిళలు ఆసక్తి చూపుతుండగా, మిగతా పట్టణాలలో ఈ శాతం 46 ఉంది.

>
మరిన్ని వార్తలు