జ్ఞానసముపార్జనలో నారీ రత్నాలు

11 Mar, 2018 00:51 IST|Sakshi

వేదకాలం నుంచి... స్త్రీలు విజ్ఞాన సముపార్జనలో ముందున్నారు... వేదాధ్యయనం చేశారు... వేదాంత చర్చలో పాల్గొన్నారు... మండన మిశ్రుని భార్య ఉభయభారతి పాండిత్యంలోను, వేదాంతంలోను అగ్రస్థానాన నిలబడింది. జగద్గురు ఆది శంకరాచార్యులకు, తన భర్త మండన మిశ్రునికి మధ్య జరిగిన వాదనకు న్యాయనిర్ణేతగా నిలిచింది ఉభయభారతి. ఈ సంఘటనకు వేల సంవత్సరాల క్రితమే అంటే వేదకాలంలో... గార్గి అనే మహిళ వేదాలను ఔపోసన పట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచంతో మానవ సంబంధం గురించి గార్గి విస్తృతంగా చర్చించింది. ఆమె పేరు మీద గార్గి గోత్రం కూడా ఏర్పడింది.

గార్గి వచక్నువు కుమార్తె. వచక్నువు అంటే నిర్భయంగా మాట్లాడగలిగే వ్యక్తి అని అర్థం. తండ్రి నుంచి గార్గికి నిర్భయంగా, నిస్సందేహంగా మాట్లాడే శక్తి అలవడింది. హిందూ సంప్రదాయంలో మహిళల గొప్పదనాన్ని గురించి ఉదహరించేటప్పుడు గార్గి పేరును తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. యాజ్ఞ్యవల్కునితో వాదనకు దిగి, అతడి పాండిత్యానికి తల వంచింది.విదేహరాజు అయిన జనకమహారాజు రాజసూయయాగం నిర్వహించిన సందర్భంలో వివిధ దేశాల రాజులతో పాటు పండితులు కూడా హాజర య్యారు. వచ్చిన పండితులందరినీ చూసి సంతోషంతో, అందరికంటె ఉన్నతుడిని ఎంపిక చేయాలనుకుని, చర్చ గోష్ఠి ఏర్పాటు చే శాడు.

యాజ్ఞవల్క్యునితో వాదించడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. యాజ్ఞవల్క్యునితో వాదన చేస్తానని సవాలు విసిరింది గార్గి. చివరి వరకు వాదన చేస్తుంది. చివరలో యాజ్ఞవల్క్యుడు వాదనకు పరిసమాప్తి చెబుతాడు. ఈ వాదనలో గెలిచిన యాజ్ఞ్యవల్కునికి మహారాజు వెయ్యి గోవులు, పదివేల బంగారు నాణాలు బహూకరించారు. బహుమానాన్ని తిరస్కరించి యాజ్ఞవల్క్యుడు అడవులకు తన భార్య మైత్రేయితో కలిసి వెళ్లిపోతాడు. ఆవిడ కూడా భర్తతో సమానంగా చదువుకుంది. గార్గి చిన్నతనం నుంచే వేద పరిజ్ఞానం పెంచుకుంది. తన పరిజ్ఞానంతో పురుషులను అధిగమించింది.

అపారమైన, అపరిమితమైన వేదాంత పరిజ్ఞానాన్ని సముపార్జించింది. వేదాలతో పాటు ఉపనిషత్తుల మీద కూడా పట్టు సాధించింది గార్గి. పురుషులతో చర్చల్లో పాల్గొనేది. కుండలినీ శక్తిని సాధించింది. విద్యావ్యాప్తి కోసం ఎంతో పాటు పడింది. ఛాందోగ్యోపనిషత్తులో సైతం గార్గి ప్రస్తావన ఉంటుంది. బ్రహ్మవాదిని అయిన గార్గి, ఋగ్వేదంలో అనేక ఋక్కులను రచించింది. మిథిలా నగర మహారాజైన జనకుని కొలువులో కొలువుతీరిన నవరత్నాలలో గార్గి కూడా ఉంది.

మైత్రేయి: ఋగ్వేదంలో వెయ్యి దాకా ఋక్కులు ఉన్నాయి. ఇందులో 10 ఋక్కులను... యోగిని, వేదాంతి అయిన  మైత్రేయికి అంకితం చేశారు. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వాన్ని, ఆధ్యాత్మిక ఆలోచనలను, జ్ఞానాన్ని వికసింపచేయడానికి కృషి చేసింది. ఉపనిషత్తుల్లో గార్గి పేరుతో పాటు మైత్రేయి పేరు కూడా ప్రసిద్ధిగా వినిపిస్తుంది.అగస్త్యుని భార్య లోపాముద్ర. భార్యాభర్తల మధ్య నిత్యం జరిగే జ్ఞాన చర్చకు సంబంధించిన అంశాలు ఋగ్వేదంలో ఉన్నాయి.

– డా. వైజయంతి

మరిన్ని వార్తలు