స్త్రీలోక సంచారం

11 Oct, 2018 00:09 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

లైంగిక వేధింపుల బాధిత మహిళలు బయటికి వచ్చి మాట్లాడ్డం ఎంత అవసరమో, వారు చెప్పేది సమాజం వినడం కూడా అంతే అవసరం అని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. ఎప్పుడో జరిగిన దాని గురించి, ఇప్పుడు మాట్లాడ్డం ఎందుకని బాధిత మహిళలను కొందరు ప్రశ్నించడంపైన కూడా మేనక ఢిల్లీలోని ఒక సభలో స్పందించారు. ‘‘అనుచితమైన స్పర్శను స్త్రీ ఎప్పటికీ మరిచిపోలేదు. తను లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని బయటికి చెబితే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆమెకు తెలుసు. అయినప్పటికీ ఆమె పరువుకు, ప్రాణాలకు తెగించి నోరు తెరిచిందంటే.. ఆమె పడుతున్న వేదన ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకుని.. ఆమె చెబుతున్నది వినాలి. ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుంటే సరిపోదు. వెంటనే నిందితులపై యాక్షన్‌ తీసుకోవాలి’’ అని మేనక అన్నారు. ‘మీ టూ’ ఉద్యమం ఇండియాలోనూ మొదలైనందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నానాపటేకర్‌ వేధించిన సంగతి పదేళ్ల క్రితం నాటిదే అయినా బాధితురాలు తనుశ్రీ దత్తా ఇప్పటికైనా ఆ విషయాన్ని బహిర్గతం చెయ్యడం అభినందనీయం అని మేనక సమర్థించారు. తనుశ్రీ దత్తాకు మద్దతు తెలిపారు. 

సగటు కన్నా దిగువనున్న జీవితాలను సౌకర్యవంతం చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం ఇన్ఫోసిస్‌ కంపెనీ ‘సి.ఎస్‌.ఆర్‌’ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) విభాగమైన ‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌’..  ‘ఆరోహణ్‌’ అనే అవార్డును ప్రవేశపెడుతోంది. ఇందుకోసం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపక సభ్యురాలైన సుధామూర్తి కోటీ యాభై లక్షల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. మహిళల భద్రత, సాధికారతతో పాటు మొత్తం ఆరు కేటగిరీలలో (ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, అభాగ్యరక్షణ; విద్య, క్రీడలు, నిరంతరత) ఈ అవార్డులను ఇస్తారు. 

లైంగిక వేధింపులపై మీడియాలో, సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి ఒక్క ‘మీ టూ’ ఆరోపణపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ నిర్ణయించింది. ఈ విషయమై కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ మాట్లాడుతూ.. ఎవరైతే లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో.. వాళ్ల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ‘‘అంతేకాదు.. బాధితురాలికి ఫోన్‌ చేసి, స్వయంగా ఆమెను కలిసి స్టేట్‌మెంట్‌ తీసుకోబోతున్నాం’’ అని రేఖ వెల్లడించారు. ఇదిలా ఉండగా, పదేళ్ల క్రితం ఓ సినిమా  సెట్‌లో తనను లైంగికంగా వేధించాడని ఇటీవల తనుశ్రీ దత్తా చేసిన ఫిర్యాదుపై పది రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర మహిళా కమిషన్‌ నటుడు నానా పటేకర్‌కు నోటీసులు పంపింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు ‘ఆలిండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ’ (ఎం.ఇ.పి.) ప్రకటించింది. మానవహక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత సాధన, వక్ఫ్‌ ఆస్తి వివాదాల పరిష్కారం తమ పార్టీ అజెండాలోని ముఖ్యాంశాలని పార్టీ అధినేత్రి డాక్టర్‌ నవేరా షేక్‌ తెలిపారు. 2019లో జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో సైతం ఎం.ఐ.పి. పోటీ చేస్తుందని చెప్పారు. 

బ్రెజీలియన్‌ నటి, మోడల్‌ జిసెల్‌ బుంద్‌చెన్‌.. తన స్తన్యంలో ఔషధ గుణాలు ఉన్నాయని చేసిన ఒక ప్రకటన.. తల్లిపాల విశిష్టతపై ఆరోగ్యకరమైన చర్చకు దోహదపడింది. జిసెల్‌కు బెంజమిన్‌ బ్రాడీ అనే 8 ఏళ్ల కొడుకు, వివియన్‌ లేక్‌ బ్రాడీ అనే కూతురు ఉన్నారు. వీళ్లిద్దరూ పాలు తాగే వయసులో వారికి వచ్చే చిన్న చిన్న కంటి, ముక్కు ఎలర్జీలకు కూడా తన పాల చుక్కల్ని వేసేదాన్నని, అవి వారికి చక్కటి ఔషధంగా పని చేసేవని జిసెల్‌ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు