-

పెద్ద చిన్ని...!

17 Jul, 2016 00:24 IST|Sakshi
పెద్ద చిన్ని...!

ఒకటా.. రెండా.. మూడా... అన్నీ పెద్ద సినిమాలే... స్క్రీన్ మీద పడితే బాంబుల్లా పేలాయ్... ఇండస్ట్రీ రికార్డులు
 తిరగ రాశాయ్... అంత పెద్ద సినిమాలు రాసింది చిన్నికృష్ణ... మరి అలాంటి పెద్ద రైటర్ చిన్నబోయాడు ఎందుకు?
 పెద్ద కథ వెనక ఓ చిన్ని గాథ...

 

‘నరసింహనాయుడు’ (2001)తో రైటర్‌గా ఎంటరై, ఈ పదిహేనేళ్లల్లో జస్ట్ ఐదు సినిమాలే చేశారేం?
 2002లో ‘ఇంద్ర’, 2003లో ‘గంగోత్రి’, 2011లో ‘బద్రినాథ్’, 2012లో ‘జీనియస్’ చేశా. ఆమిర్‌ఖాన్‌తో వర్క్ చేయాలనేది నా జీవితాశయం. ‘జీనియస్’ తర్వాత ఆమిర్ కోసం స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రాయడం మొదలుపెడితే మూడేళ్లు పట్టింది. లాస్ట్ ఇయర్ పూర్తి చేశా. హిందీ వాళ్ల తో డైలాగ్స్ రాయించా. వచ్చే నెల్లో ఆమిర్‌కి సబ్మిట్ చేస్తా.

నరసింహనాయుడు, ఇంద్ర.. ఇలా మీరిచ్చినవన్నీ మామూలు కథలు కాదు. అసలా కథలకు ఇన్‌స్పిరేషన్ ఏంటి?
 నేను గాడ్ బిలీవర్‌ని. ఉదయం నిద్ర లేచాక మంచం మీద నుంచి కాలు కింద పెట్టేటప్పుడు నా భారాన్ని మోసే భూదేవిని క్షమించమని అడుగుతాను. నిద్రపోయే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తా. దేవుడి ఇన్‌ఫ్లూయన్స్, నేచర్ ఇన్‌ఫ్లూయన్స్ లేకుండా నాకు స్క్రిప్ట్ రాయడం అనేది రాదు. రాసే ప్రతి అక్షరం నేను రాశానని ఎప్పుడూ ఫీల్ కాలేదు. ఆ భగవంతుడే, ఆ అమ్మవారే రాయిస్తున్నారు.

మధ్య మధ్యలో మీ కెరీర్‌లో వచ్చే బ్రేక్స్‌కి కారణం ఏంటి.. ఎవరూ అవకాశాలు ఇవ్వడంలేదా?
 అవకాశాలు రాలేదు అనేది లేదు. ప్రతి నెలా ఎవరో ఒక నిర్మాత వస్తారు. ఇంతకు ముందు పని చేసిన హీరోల నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి. చిరంజీవిగారి 150వ సినిమా నేనే చేయవలసింది. వాళ్లు కోరిన మీదట గ్రాండి యర్‌గా ఓ కథ రెడీ చేశాను. కానీ, చిరంజీవిగారు ‘కత్తి’ రీమేక్ చేయాలనుకున్నారు. నా కథ కంటే ‘కత్తి’ బాగుందనుకున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పిన మేటర్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చెప్పలేదు. అది నా నమ్మకం. చిరంజీవిగారు నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకూ నా జడ్జ్‌మెంట్ ఫ్లాప్ కాలేదు. నేను డెలివర్ చేసిన ఏ గూడ్స్ (సినిమాలు)నీ ప్రేక్షకులు రిజెక్ట్ చేయలేదు. ఆ క్లారిటీ నాకుంది.

చిరంజీవిగారికి ‘ఇంద్ర’లాంటి హిట్ స్టోరీ ఇచ్చారు. ఇప్పుడు మీ కథను నమ్మలేదంటే..?
 నేను చెప్పింది ఆయన అంగీకరించలేదని చెడుగా మాట్లాడితే నేను క్రియేటర్‌నే కాదు. అది చిరంజీవిగారి వ్యక్తిగత నిర్ణయం. దట్సాల్. సినిమా వాళ్లందరూ కష్టపడేది ప్రేక్షకుడి కోసమే. నూన్ షో తర్వాత ప్రేక్షకుడు డిసైడ్ చేసే వరకూ ఎవరూ మాస్టర్స్ కాదు. రిలీజ్‌కి ముందే రిజల్ట్ చెప్పేమాస్టర్స్ ఎవరైనా ఉంటే దేవుడితో సమానం. తమిళ ‘కత్తి’ చూశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది.

రైటర్స్ ఎంత రాసినా స్క్రీన్ మీద కనిపించే హీరోనే ఆరాధిస్తారు.. దీనికి మీరేమంటారు?
 నాకు చిన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు ఇష్టం. సంక్రాంతి, శివరాత్రి అప్పుడు ఎన్టీఆర్, ఏయన్నాఆర్ గార్లలా గెటప్స్ వేసుకుని కొందరు డ్యాన్సులు చేసేవాళ్లు. అప్పటివరకూ అదే వ్యక్తులు బీడీ తాగుతూ కనిపించేవాళ్లు. ఏమీ అనిపించేది కాదు. మేకప్ వేసుకుని స్టేజి మీద డ్యాన్సులు చేస్తుంటే చప్పట్లు కొట్టేవాళ్లం. ఎందుకంటే అక్కడ ఉన్నదీ, స్క్రీన్ మీద కనిపించేదీనటుడు. నటుడికున్న వేల్యూ అది. గత జన్మలో మినిమమ్ వంద గుళ్లు కట్టిస్తే.. ఈ జన్మలో ఆర్టిస్ట్‌లు అవుతారని నమ్ముతా. దటీజ్ స్టార్‌డమ్.

స్టార్‌డమ్ గురించి గొప్పగా చెప్పారు.. మరి ఆ స్టార్స్ దగ్గరకు మీరే వెళ్లి కథలు చెప్పడానికి ఎందుకు మొహమాటం?
 మొహమాటం కాదు. ‘నరసింహనాయుడు’లో ఓ డైలాగ్ ఉంటుంది. ‘కళామతల్లి అనేది సరస్వతి అమ్మవారితో సమానం. కళ దగ్గరికి మీ అమ్మాయి రావాలి గానీ, మీ అమ్మాయి దగ్గరికి కళ రాదు’. ఈ డైలాగ్ నేనే రాశాను. రియల్ లైఫ్‌లో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాను.

రామ్‌చరణ్ డెబ్యూ మూవీ కోసం ‘పూరీ జగన్నాథ్’ అని కథ రాశారట. రియల్ పూరీ జగన్నాథ్ (దర్శకుడు) ఎంటర్ కాగానే ఆ సినిమా మీ చేతుల్లోంచి తీసేసుకున్నారట?
కథ రాశాను. క్లైమాక్స్ అందరికీ బాగా నచ్చింది. అప్పుడు చిన్నికృష్ణ రైటర్, పూరీ జగన్నాథ్ డెరైక్టర్. రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూరీగారు తెలుగులో వన్నాఫ్ ది రెస్పెక్టబుల్ రైటర్స్. వెరీ గుడ్ ఫిలాసఫికల్ రైటర్. నా కథ ఓకే చేసిన తర్వాత ‘పోకిరి’ అనే సినిమా విడుదలై, ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. సో, అతనితో వెళ్లడం కరెక్టే. నా కొడుకు హీరో అవుతున్నా.. నేనూ అదే నిర్ణయం తీసుకుంటా. ఓ రచయిత కథ కంటే.. మహేశ్‌బాబుతో పెద్ద హిట్టిచ్చిన ఓ రైటర్ కమ్ డెరైక్టర్‌తో వెళ్లడంలో తప్పు లేదు.

మీ దగ్గర ఉన్న కథల గురించి చెబితే తప్పేంటి?
 నేను రాస్తానని అందరికీ తెలుసు కదా. కొందరు బిచ్చగాళ్లు గంగిరెద్దులతో అడుక్కోవడానికి వస్తుంటారు. చిన్నికృష్ణ ఆల్రెడీ ఓ గంగిరెద్దులా అడుక్కుని, ఓ హిట్ ఇచ్చాడని తెలుసు కదా. నాకు మళ్లీ గంగిరెద్దు వేషం ఎందుకు? నేనిక్కడే (హైదరాబాద్) ఉంటున్నానని తెలుసు. నా ఇంటి గృహప్రవేశానికి కూడా వచ్చారు. గత పదిహేనేళ్లుగా నా ఫోన్ నంబర్ మారలేదనీ తెలుసు కదా.

ఇలా మాట్లాడతారు కాబట్టే, కొంతమంది మిమ్మల్ని ‘హైట్స్ ఆఫ్ ఈగోకి కేరాఫ్ అడ్రస్ చిన్నికృష్ణ’ అని అంటుంటారు..
 గుడ్ క్రెడిట్. ఆఫీసు రూముల్లోనో, బెడ్‌రూమ్‌లోనో  అనుకోకుండా ఏదైనా అవార్డు వేడుకలో ‘అండ్ ది హైట్స్ ఆఫ్ ఈగోకి కేరాఫ్ అడ్రస్ అవార్డ్ ఫర్ 2016 గోస్ టు చిన్నికృష్ణ’ అని బహిరంగంగా అవార్డు ఇస్తే ఆనందపడతా. అది మంచి క్రెడిట్. నన్ను ఈగోయిస్ట్ అనడం వల్ల వాళ్లకు ఆనందం దక్కుతోందంటే కాదనడానికి నేనెవర్ని?

తారాచౌదరి విషయంలో మీపై విమర్శలు వచ్చాయి కదా..
 పాపం.. ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ ఇన్‌బ్యాలెన్స్. ఆ తర్వాత చాలాసార్లు అరెస్ట్ అయ్యింది. ఓ బాధ్యత గల వ్యక్తిగా, ఓ సోదరుడిగా ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి లైఫ్‌లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. నాకా అమ్మాయి మీద కోపం లేదు.  

మీ మీద వచ్చే కాంట్రవర్శీస్ గురించి మీరేమంటారు?
 ఐశ్వర్యా రాయ్‌తో అభిషేక్ బచ్చన్ పెళ్లి జరుగుతోంటే ‘నాకు ఇతను కడుపు చేశాడు’ అని ఓ అమ్మాయి వస్తుంది. ఇలాంటి గాసిప్స్ సినిమావాళ్లకు కామన్. టీవీలో 10 సెకన్ల యాడ్ ఇవ్వాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఏ ఖర్చూ లేకుండా వార్త వచ్చినప్పుడు ఫ్రెండ్స్‌తో కూర్చుని నవ్వుకుంటా. టీవీ వాళ్లకీ రేటింగ్ బాగుంటుంది.

యాడ్ పాజిటివ్‌గా ఉంటే ఓకే.. మీ మీద వచ్చేవి నెగిటివ్...?
 (ప్రశ్న పూర్తి కాకముందే..) యాడ్ నెగిటివ్‌గా ఉంటేనే బాగుంటుంది. ‘చిన్నికృష్ణ 200 మందికి అన్నదానం చేశాడు’ అంటే, దాని గురించి రాయరు, చూపించరు. ‘చిన్నికృష్ణ ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. ఆ అమ్మా యి తప్పించుకుంది. ఓ సీసీ కెమేరాలో దొరికాడు’ అంటే రేటింగ్ ఎంత ఉంటుందో చూడండి. మీడియాలో నెగిటివ్ ఎనర్జీ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ దేన్ పాజిటివ్ ఎనర్జీ.

జనరల్‌గా గ్యాప్ వచ్చినప్పుడు ‘వీళ్లు ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారా? ఇప్పటి తరానికి కావల్సినది ఇవ్వగలుగుతారా?’ అనే సందేహం ఉంటుంది.. మరి.. మీ కథలు?
 ఆర్టిస్టులకి రిటైర్‌మెంట్ ఉంటుంది కానీ, రైటర్స్‌కి రిటైర్‌మెంట్ ఉండదు. ఆ మధ్య ఓ పెద్ద నిర్మాతను కలిశా. ఆయన పేరు కేయస్ రామారావు. ఆయన తారక్‌కి (ఎన్టీఆర్) కథ ఇవ్వాలన్నారు. అలా అంటూనే...  ‘‘ఇప్పుడున్న హీరోలందరూ మంచి యంగ్‌స్టర్ స్క్రిప్ట్స్ ఇష్టపడుతున్నారు. మీరు, విజయేంద్రప్రసాద్‌గారు.. ఓల్డ్ స్మెల్ కదా’’ అన్నారు. పాపం ఆయనది తప్పు కాదు. రామారావుగారికి ఎవరో యంగ్ హీరో యంగ్‌స్టర్ స్టోరీ కావాలని చెప్పి ఉంటారు. ఆయన చెప్పినది ఈయన నాతో అని ఉంటారు. కానీ, వాళ్ల మనసుకి అర్థం కావాలి కదా. రామారావుగారు అలా అనగానే నేనేం మాట్లాడలేదు. జస్ట్ ‘అవునండి..’ అని వచ్చేశాను. నేను బాగా గౌరవించే వన్నాఫ్ ది బెస్ట్ రైటర్స్ విజయేంద్రప్రసాద్. ఆయనంటే చాలా అభిమానం. రామారావుగారు నాతో అలా మాట్లాడిన కొన్నాళ్లకు మా విజయేంద్రప్రసాద్‌గారు రాసిన ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజన్’ విడుదలయ్యాయి. అలాగని రామారావుగారికి ఫోన్ చేసి, ‘దేశవ్యాప్తంగా మాట్లాడుకున్న ఆ రెండు కథలూ రాసినది మా ఓల్డ్ రైటరే. ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని నవ్వలేదు. అంత దిగజారే మనిషి కాదు నేను..

నాకో ఐడెంటిటీ, గుర్తింపు వచ్చింది రజనీకాంత్‌గారి ‘నరసింహా’ వల్లే. ఆ కథను యాక్సెప్ట్ చేసినందుకు రజనీగారికీ, చిత్రదర్శకుడు కేయస్ రవికుమార్‌గారికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగులో బాలకృష్ణగారు, చిరంజీవిగారు. పేర్లు ఆర్డర్‌లో చెబుతున్నాను. ఒకళ్లు ఎక్కువ, ఒకళ్లు తక్కువ అని కాదు. అల్లు అర్జున్‌గారు, ఓంకార్‌గారు. వీళ్లందరూ నన్ము నమ్మి కథ రాసే అవకాశం ఇచ్చారు. దర్శకుల్లో బి.గోపాల్‌గారు, రాఘవేంద్రరావుగారు, వీవీ వినాయక్‌గారు.. వీళ్లందరికంటే ముందు ఇతని కథ హిట్ అవుతుందని, ఇతను పెద్ద రైటర్ అవుతాడని చెప్పిన పరుచూరి బ్రదర్స్‌లో పరుచూరి గోపాలకృష్ణగారికి.. జన్మజన్మలకు నేను రుణపడి ఉంటా. ఎటువంటి ఈగో లేకుండా వాళ్లందరికీ  శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
 

మీరన్నట్లు హీరోల్లా రైటర్‌కి రిటైర్‌మెంట్ లేకపోయినప్పటికీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటేవెనకపడిపోయినట్లే కదా?
 నన్ను చూస్తే.. వెనకపడిపోయినట్లుగా అనిపిస్తోందా? గడ్డం పెంచుకుని, చెట్టు కింద కూర్చుని కథలు రాసుకుంటూ, ఓ చేత్తో సగం కాలిన సిగరెట్టు పట్టుకుని ఆకాశంలో శూన్యంలోకి చూస్తూ..అదే చెట్టు కింద నేను పడిపోయి.. ‘అయ్యో... ఫలానా రచయిత’ అంటూ ఎవరైనా ఆస్పత్రికి తీసుకెళ్లి, జాలిపడేలా నేను కనిపిస్తున్నానా? లేదు కదా. హ్యాపీగానే ఉన్నానుగా. నేను ఆస్ట్రాలజీ, న్యూమరాల్జీని నమ్ముతాను. ఏదీ మన చేతుల్లో ఉండదని నా ఫీలింగ్.

మీ భవిష్యత్తు గురించి మీ ఆస్ట్రాలజీ, న్యూమరాల్జీ ఏం చెబుతోంది.. రేసీగా సినిమాలే చేస్తారంటోందా?
 అక్టోబర్ నుంచి బాగుంటుందని చెబుతోంది. అయినా నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు నవ్వొచ్చే విషయం ఒకటి చెప్పాలి. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడితే కిక్ ఉంటుంది. పాకిస్తాన్ ఒక్కటే ఆడితే? కిక్ ఉండదు కదా. ఇప్పుడున్న సినిమాల పరిస్థితి కూడా అంతే. కిక్ లేదు.

అదేంటి..?
 ఇప్పుడు కాంపిటీషనే లేదు. బాలకృష్ణగారి ‘నరసింహనాయుడు’, చిరంజీవిగారి ‘మృగరాజు’, వెంకటేశ్‌గారి ‘దేవీపుత్రుడు’ ఒకే రోజున (జనవరి 11) విడుదలయ్యాయి. స్టేట్ మొత్తం హీట్. ఏది బెస్ట్ రిజల్ట్ అనే ఎగ్జైట్‌మెంట్. అలాంటి కిక్ ఇప్పుడు లేదు. సినిమాలన్నీ దాదాపు కాంపిటీషన్ లేకుండా సోలోగా విడుదలవుతున్నాయ్.

వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటీ పడనున్నాయి? ఇద్దరితోనూ మీరు సినిమాలు చేశారు. మరి.. ఈ రెండు సినిమాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
 రెండు సినిమాలూ ఆడితే ఇండస్ట్రీకి మంచిది. చిరంజీవిగారు చేస్తున్న సినిమా ఆల్‌మోస్ట్ జిరాక్స్ కాపీలాంటిది. తమిళ ‘కత్తి’కి రీమేక్ అది. పోటీలో ఉన్నవి రెండూ స్ట్రయిట్ చిత్రాలైతే మాట్లాడగలను. రీమేక్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సినిమా. ఇంకోటి చరిత్ర చెప్పే సినిమా. సో.. రెండింటినీ పోల్చలేం. కంపేర్ చేయాలంటే రెండూ స్ట్రెయిట్ సబ్జెక్ట్సే తీసుకోవాలి. అప్పుడది కాంపిటీషన్ అవుతుంది. దట్ ఈజ్ ద రియల్ వర్త్ ఆఫ్ రన్నింగ్ రేస్.

ఎక్కడ కామెడీ, ఎక్కడ రౌద్రం ఉండాలో చిన్నికృష్ణకు తెలు సని వినాయక్ ఓ సందర్భంలో అన్నారు. ఎలా నేర్చుకున్నారు?
 భాగ్యరాజాగారు నా గురువుగారు. ఏది ఎక్కడ ఎంత కొలతలో ఉండాలో నేర్చుకున్నది ఆయన దగ్గరే. డెరైక్టర్ శంకర్‌గారి దగ్గర చేయకపోయినా ఆయన కూడా నా గురులాంటివారే. ఔటర్ కాన్‌ఫ్లిక్ట్స్, ఇన్నర్ కాన్‌ఫ్టిక్ట్స్ అని రెండు ఉంటాయి. ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్స్ అనుబంధాల చుట్టూ తిరుగుతాయ్. ఔటర్ కాన్‌ఫ్లిక్ట్స్ సమాజంతో ముడిపడి ఉంటాయ్. శంకర్‌గారు, మురుగదాస్‌గారు చేసే సినిమాలన్నీ అవుటర్ కాన్‌ఫ్లిక్ట్స్. నా ‘బద్రినాథ్’ అలాంటి సినిమానే. ఆ సినిమా అప్పట్నుంచీ నా ఆలోచనా విధానం మారిపోయింది. ఔటర్ కాన్‌ఫ్లిక్ట్స్‌లో కథలు రాస్తున్నా.

సాధారణంగా అల్లు అరవింద్‌గారు కథ రాశాక పారితోషికం ఇస్తారట.. కానీ, మీకు ముందే ఇచ్చారట?
 ఆయన హృదయంలో నాకు సెపరేట్ స్థానం. మా పాప ఫైనలియర్ అప్పుడు బన్నీ హీరోగా నాతో మళ్లీ సినిమా చేస్తా అన్నారు.

మరి ఏమైంది..?
 అన్నారు కదా అని కథ రాసేసుకుని, తెల్లారేసరికల్లా వాళ్ల గుమ్మం ముందు నిలబడలేం కదా. ఆ సమయంలో ఏ పనావిడో కళ్లాపి జల్లుతూ ఉంటుంది. ఆ కళ్లాపికి నేనెందుకు అడ్డం పడాలి (నవ్వుతూ). అభిమానంతో అంటారు. అన్నారు కదా అని వెంటాడేస్తే ఎలా?

మీ పెద్ద అబ్బాయిని హీరోని చేయబోతున్నారట?
 మా అబ్బాయి హీరోనా? పోయిన జన్మలో వంద గుళ్లు కట్టుంటే ఈ జన్మలో హీరోలవుతారని ఇంతకు ముందు చెప్పాను కదా. మరి మావాడు కట్టాడో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ వాడు వంద గుళ్లు కట్టుంటే హీరో అవుతాడు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు.

మీ కథలో యాక్ట్ చేసిన హీరోలతో మీరు టచ్‌లో ఉన్నారా?
 అందరితోనూ నాకు మంచి అనుబంధమే ఉంది. కాకపోతే నేను ‘భజన సంఘం’లో లేను. మామూలుగా ఏ ఇండస్ట్రీలో అయినా భజన సంఘం ఉంటుంది. నేనా ట్రూప్‌కి చెందిన వ్యక్తిని కాదు. నా దగ్గర చిడతలు లేవు. ఒకట్రెండు సార్లు అవి ఇచ్చి, ఎలా కొట్టాలి? ఎలా కొడితే వాళ్లకు నచ్చుతుంది? ఏ సౌండ్‌ని ఇష్టపడతారు... అని కొందరు టిప్స్ ఇచ్చారు. నేను ట్రై చేసినా అవి పగిలిపోయాయి. దాంతో భజన సంఘానికి పనికి రానని ఫిక్సయ్యాను. అందుకే ఎప్పుడూ వాళ్ల చుట్టూ కనిపించను.

మరి.. భజన చేయకపోతే దగ్గరకు రానివ్వరట కదా?
 ఐ డోంట్ మైండ్. ఎవరు నన్ను కాదనుకుని సినిమా తీశారో.. ఎవరు నన్ను కాదనుకుని డెరైక్ట్ చేశారో.. ప్రకృతి వాళ్లకు అన్నీ కరెక్ట్‌గా ఇచ్చేసింది. ఆల్రెడీ వాళ్లకు దక్కింది కాబట్టి, ఇప్పుడు పనిగట్టుకుని ఎవరెవరికి ఏం దక్కింది? అని పర్టిక్యులర్‌గా నేను చెప్పడం అనవసరమైన సబ్జెక్ట్. ఎవరూ దగ్గరకు రానివ్వకపోయినా చిన్నికృష్ణ భజన చేయడు.. దట్సాల్.
- డి.జి. భవాని

మరిన్ని వార్తలు