ఇక డాక్టర్ ట్రాఫిక్ పోలీసులు..! | Sakshi
Sakshi News home page

ఇక డాక్టర్ ట్రాఫిక్ పోలీసులు..!

Published Sun, Jul 17 2016 12:13 AM

The traffic police doctor ..!

గుండెపోటు ప్రయాణికులకు సీపీఆర్‌తో జీవం
నిమిషాల్లో ఆస్పత్రిలో చేరేలా చర్యలు..
ట్రాఫిక్ సిబ్బందికి కిమ్స్ వైద్యుల శిక్షణ

 
 సిటీబ్యూరో:  నగరవాసులు సురక్షితంగా ప్రయాణించేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు ప్రాణదాత అవతారమెత్తనున్నారు. సిటీజన్స్ ప్రయాణంలో గుండె సంబంధ సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందేందుకు సిద్ధమవుతున్నారు. గుండెపోటు, హృదయ సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని రక్షించేందుకు ‘కార్డియో పల్మనరీ రెసిస్కుటేషన్’(సీపీఆర్) టెక్నిక్స్‌పై నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో శనివారం ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇచ్చారు. సిటీలో ప్రయాణ సమయంలో చాలామంది గుండెనొప్పి వచ్చి ఆస్పత్రికి వెళ్లేసరికే చనిపోయిన సందర్భాలు ఎక్కువ. ఈ నేపధ్యంలో కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆ కొద్ది నిమిషాలే కీలకం..
దేశంలో ఏటా సుమారు ఏడు లక్షల మంది గుండెపోటుకు గురై హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అంతకుముందే గుండెజబ్బులు ఉన్నవారితో పాటు సాధారణ పౌరులూ ఉంటున్నారు. ఇలాంటివారిలో సుమారు 95 శాతం మంది ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు వదిలేస్తున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి నాలుగు నుంచి ఆరు నిమిషాల్లో మెదడులోని కణాలు మరణిస్తాయి. ఆస్పత్రికి చేర్చడంలో జరుగుతున్న జాప్యంలో ప్రతి నిమిషానికి పది శాతం చొప్పున సదరు వ్యక్తి మరణానికి దగ్గర అవుతున్నాడు. వెంటనే స్పందిస్తే ఆ వ్యక్తి కోలుకునే అవకాశం 300 శాతం మెరుగువుతుంది. ‘ఆటోమేటెడ్ ఎక్సటర్నల్ డిఫ్రిబిలేటర్’ (ఏఈడీ) ఉపయోగించడం ద్వారా ఆ వ్యక్తిని సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. చాలా మంది ప్రయాణ సమయాల్లో గుండెనొప్పి బారిన పడుతుండడాన్ని గుర్తించిన కిమ్స్ వైద్యులు విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లి సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఏఈడీలను వీలైనన్ని చోట్ల ఉపయోగించడం వల్ల ఎక్కువ మందిని రక్షించే అవకాశం దక్కుతుందని వివరించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు సీపీఆర్‌తో పాటు ఏఈడీ ఉపయోగించే విధానంపై ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా  శిక్షణ ఇచ్చారు.  
 
సీపీఆర్ టెక్నిక్‌తో ఎంతో మేలు..

 ‘సీపీఆర్ టెక్నిక్ ఉపయోగించి ప్రాణాలు కాపాడే కీలకమైన ప్రక్రియలో కిమ్స్ వైద్యులు శిక్షణ ఇవ్వడం అభినందనీయం. మా సిబ్బంది నేర్చుకున్న దాని వెంటనే అమలులో పెడతాం. తద్వారా గుండెపోటు మరణాల సంఖ్యను తగ్గిస్తామ’ని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ అన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీలు ఎల్‌ఎస్ చౌహాన్, ఏవీ రంగనాథ్, కిమ్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హయగ్రీవరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement