మీకూ కావాలి మరి రీగల్ ఆ రోజులు...

5 Jun, 2015 00:18 IST|Sakshi
మీకూ కావాలి మరి రీగల్ ఆ రోజులు...

‘టింకూ లాంటి బాబు మీకూ ఉంటే కావాలి మరి రీగల్’... బట్టలు మురికి చేసుకుని, ముద్దుగా కనిపిస్తున్న ఆ అల్లరి పిల్లవాడి యాడ్ ఆంధ్రప్రభ వీక్లీలోనో చందమామ మంత్లీలోనో.

రిన్ కొన్నది లేదు. రీగల్ కొనే ముచ్చట తీరనే లేదు. పెంకుటిళ్లవాళ్లకి, వసారా ఇళ్ల వాళ్లకి, నాలుగు సిమెంటు రేకులను బోల్టులతో బిగించి ‘మాది కొత్తగా కట్టిన రేకుల ఇల్లు గదా’ అని బడాయి పోయేవాళ్లకి, గాడ్రేజీ బీరువా కొనుక్కోగలిగేవారికి, ఇంటికి ఎవరైనా వస్తే నులక, నవారు గాకుండా ఫ్యాషనుగా వైరు మంచాలను వాల్చేవాళ్లకి బట్టలు ఉతకాలంటే డెట్ సోపే దిక్కు. డిఇటి డెట్. అరవై పైసలకు ఒకటి. ఇక తక్కిన సవాలక్షమందికి  శెట్టిగారి కొట్టుకు వెళితే దారాన్ని లాఘవంగా తిప్పి పావలాకు కోసి ఇచ్చే మైసూరుపాకులాంటి ముక్క- 501 ఉండనే ఉంది.

బట్టల సోప్ రేపర్‌ని పుస్తకాల మధ్య ఉంచుకుంటే మజా లేదు. ఆ మాటకొస్తే లైఫ్‌బాయ్ కవర్లు కూడా ఎన్ని దాచుకున్నా గౌరవం ఏముంది? హమామ్ ఒక మాదిరిగా సరే. రెగ్జోనా, లక్స్... ఎవరైనా చేసే పనే. కాని సింథాల్ రేపర్ అలా నాన్ డీటైల్‌లో మందంగా దాక్కుని ఉందంటే మరిక ఆ కుర్రవాడు కలిగిన బిడ్డ కిందే లెక్క. ఇస్త్రీ యూనిఫామ్, బాటా షూస్, పై జేబులో హీరో పెన్, టెక్స్ట్‌బుక్కుల్లో సింథాల్ రేపర్ ఇవన్నీ కలిమికి గుర్తులు. కాని- ప్రతి వీధికీ ఒక మహరాణి ఉండేది. ఆవిడ పియర్స్ తోనే మొహం కడిగేది. అది చూసి మరీ అంత మిడిమేలమా అని సున్నిపిండితో సరిపుచ్చుకునే అమ్మలక్కలందరూ  ఆమెను అయినకాడికి ఆడిపోసుకునేవారు. పియర్స్‌ను చాలామంది చాలాసార్లు దూరం నుంచి చూసి ఊరుకునేవారు. ఎప్పుడైనా ముఖం కడుక్కునే చాన్స్ దొరికిందా? పదే పదే చేతులని ముక్కు దగ్గర పెట్టుకుని మురిసిపోవడమే.

బ్రాండ్స్ తెలియడం మొదలయ్యింది. కంపెనీ వస్తువుతో ఇంటికి కొత్త మర్యాద వస్తుందనే ప్రచారం ప్రబలింది. ర్యాలీ సైకిల్, హెచ్‌ఎంటి వాచీ, డయొనారా టీవీ, సోనీ కెమెరా, బజాజ్ స్కూటర్, విమల్ షర్ట్ క్లాత్, కొరియా ప్యాంట్ బిట్, హిందూ పేపర్, గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, క్యుటికూర పౌడర్... పాతకాలంలోలా పలాస్త్రి వేసుకున్నవాడు పల్లెటూరి బైతు. లేటెస్ట్‌గా జాన్సన్స్ వారి రోజా పూరంగు బ్యాండ్ ఎయిడ్? ఫ్యాషన్. జలుబు చేస్తే ముక్కు చీదడం ఏం మర్యాద? విక్స్ ఇన్‌హేలర్ పట్టుకు తిరిగేవాడే హీరో.

ప్రాధాన్యాలు మారాయి. శీకాయపొడి, కుంకుళ్లకు ఇన్‌సల్ట్స్ మొదలయ్యాయి. పేనుజాతికి పెను ప్రమాదం ముంచుకొచ్చింది. కొత్తగా వచ్చిన చిక్ షాంపూ నెత్తికెక్కి వెంట్రుక వెంట్రుకలో రసాయనాలు కూరింది. నిమ్మరసాన్ని రస్నా చప్పరించింది. నిర్మా పౌడర్ కొత్తబంధువుగా స్థిరపడింది. గానుగలో కొబ్బరినూనె కొన్నా కాసింత రీటా కలిపితే తప్ప శ్రీమతికి సంతృప్తి కలగదు. డాల్డాకు కుర్చవేయడం మొదలుపెట్టారు. సేమ్యాల స్థానాన్ని బాంబినో వెర్మిసెల్లి తీసుకుంది. బ్రిటానియా బిస్కెట్లు కొని సాయంత్రం పూట కాఫీతో పాటు తీసుకుంటున్నారంటే ఆ ఏరియాలో ఆ ఇంటికి ప్రత్యేక హోదా.

వస్తువులకు స్థలం కావాలి. బ్రాండెడ్ వస్తువులకు మర్యాదగలిగిన ఇల్లు కావాలి. అందుకు తగ్గట్టుగా మనిషి ఎదగాలి. కాసింత పెరడు
దొరికితే బంతో, చేమంతో, నీడనిచ్చే వేపో, అమ్మ జ్ఞాపకంగా ఊరి నుంచి తెచ్చిన అంటుమామిడో పెంచుదామని ఆలోచించేరోజుల నుంచి ఇంటి మీద ఇల్లు, ఇంటి ముందు ఇల్లు, ఇంటితోపాటు ఇల్లు, లంకంత ఇల్లు కట్టడం మొదలయ్యింది.

మెల్లమెల్లగా ఊరు ఒక పెద్ద సిమెంట్ రూఫ్‌గా మారింది.వస్తువులు లోపలికెళ్లాయి.
ఎండలు బయట ఉండిపోయాయి.
పాపం, ఏ బ్రాండూ లేని మనుషులు కొందరు వస్తువుల ప్రీతి కోరుతూ పిట్టల్లా రాలిపోతున్నారు.
 - ఖదీర్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా