ఆర్ట్ ఫర్ హోమ్

25 Jul, 2014 04:04 IST|Sakshi

అందమైన ఇంటికి మరిన్ని అందాలు అద్దాలని ఎవరికి మాత్రం ఉండదు. తమ కలల లోగిలిని కళల నెలవుగా మార్చుకోవాలని కోరుకునేవారు ఎందరో. ఇంటీరియర్స్‌కు భారీ మొత్తం వెచ్చించలేని వారికి టైట కళాకృతులు వరంగా మారాయి. తక్కువ బడ్జెట్‌లో గృహాన్ని కళల సీమగా మార్చేస్తున్నాయి.
 
 అందంగా తీర్చిదిద్దిన కుండలు..
 మట్టితో మలచిన శిల్పాలు, బొమ్మలు, ఇతర అలంకరణ వస్తువులు టైట కళావైభవాన్ని నగరం ముందుంచుతున్నాయి. ధ్యానంలో ఉన్న బుద్ధ ప్రతిమ ఇంట్లో ప్రశాంతతను కలిగిస్తుంది. సూర్య భగవానుడి  రూపం, కూర్మం, మీనం ప్రతిమలు వాస్తు సెట్ చేస్తాయనే నమ్మకం కొందరిది. ఉత్తరప్రదేశ్ నుంచి తరలివచ్చిన ఈ కళాకృతులు ప్రస్తుతం హైదరాబాదీల  ఇళ్లలో కొలువుదీరుతున్నారుు. డిఫరెంట్ హ్యాంగింగ్స్, ఫొటో ఫ్రేమ్స్ అందరినీ అలరిస్తున్నాయి.
 
 ఇలా చేస్తారు
 ఈ కళాకృతుల తయారీకి కావాల్సిన మట్టిని నదులు, కాల్వల గట్ల నుంచి సేకరిస్తారు. దీనికి తగిన మోతాదులో నీరు, ఇసుక, గుర్రం లద్దె కలిపి బాగా మిక్స్ చేస్తారు. ఆ ముద్దను కుమ్మరి చక్రంపై ఉంచి కుండలను తయారు చేస్తారు. వివిధ ఆకారాల్లో ఉన్న కుండలైతే, తొలుత రెండు, మూడు భాగాలుగా చేసి వాటిని కలిపి అనుకున్న రీతిలోకి మలుస్తారు. తర్వాత వాటికి రంగులద్ది వన్నె తీసుకొస్తారు. ఇతర ప్రతిమలను, గృహోపకరణాలను అచ్చులలో వేసి రూపొందిస్తారు. సృజనాత్మకత, ఏకాగ్రత లేకపోతే ఈ బొమ్మలను అందంగా తీర్చిదిద్దలేం.
 - శ్రీనివాస్, విక్రేత, సుచిత్ర క్రాస్ రోడ్స్
 
 విరివిగా అమ్మకాలు
 ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టైట కళాకృతుల అమ్మకాలు నగరంలో చాలా ప్రాంతాల్లో సాగుతున్నాయి. వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు వివిధ ధరల్లో దొరుకుతున్నాయి. కేవలం గృహాలంకరణ వస్తువులే కాదు.. టైట ఫ్యాన్సీ ఐటమ్స్‌కు కూడా ఫుల్ క్రేజ్ ఉంది. గాజులు, లోలాకులు, నగలు ఇలా ఎన్నో వెరైటీలు మగువల మనసును దోచేస్తున్నాయి.
-  శిరీష చల్లపల్లి

>
మరిన్ని వార్తలు