స్వామి భక్తికి వైఎస్ఆర్ సీపీ షాక్!

12 Jul, 2013 16:23 IST|Sakshi

ఓవైపు ఎన్నికల సంఘం హెచ్చరిస్తోన్నా  సర్పంచ్ పదవుల వేలం పాటలు ఆగడం లేదు. ప్రతీ జిల్లాలోనూ  రిజర్వేషన్ల  ప్రక్రియ పై   విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీల్లో లేని సామాజిక వర్గాల పేరిట రిజర్వేషన్లు చేయడంతో ఇదేం పద్దతంటూ ప్రజలు  నిలదీస్తున్నారు. అధికారుల దగ్గర వీటికి సమాధానాలు దొరకడం లేదు. ఇక పంచాయతీ ఎన్నికల వేళ  సమస్యలను ఏకరవు పెడుతున్నారు జనం.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంతనియోజకవర్గం చిత్తూరు జిల్లా పీలేరు పరిధిలోని అన్ని సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసి.. స్వామిభక్తి ప్రదర్శించాలనుకొన్న ఆయన అనుచర గణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. అన్ని స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ  మద్దతుదారులు పోటీకి దిగడంతో   కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పోశాయి.

సొంత నియోజకవర్గంలో  ఓటమి పాలైతే  తలెత్తుకోవడం కష్టమని భావించిన అధికారపార్టీ నేతలు వ్యూహాలు మార్చారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎక్కెడెక్కడ బలంగా ఉన్నారో ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులుగా పోటీ చేస్తున్న వారికి నజరాలు ప్రకటించారు. ఇందుకు వారు ససేమిరా అనడంతో బెదిరింపులకు దిగారు. అయినా ఫలితం లేకపోవడంతో  రాత్రికి రాత్రే కాంగ్రెస్ నేతలు ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించేలా చేయగలిగారు.

కనీసం పీలేరు పంచాయతీని అయినా ఏకగ్రీవం అయ్యేలా చేసి అధినాయకుడిని  సంతృప్తి పరచాలని  భావించిన ముఖ్యమంత్రి  అనుచరులు ..టీడీపీ తరపున డమ్మీ అభ్యర్ధి ఉండేలా పావులు కదిపారు. అయితే వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడిగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహమ్మద్ షఫి బరిలోకి దిగడంతో కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు.

పీలేరులో అధిక శాతం ఓట్లు ముస్లిం మైనార్టీలకు ఉన్నాయి. దీంతో ఆ ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే ఖాయంగా పడతాయని భావించిన కాంగ్రెస్ నేతలు పథకం ప్రకారం వారి ఓట్లను తొలగించేలా చేశారు.  అధికారపార్టీ తీరుపై  మైనార్టీలు మండిపడుతున్నారు. గత సహకార ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కురాజకీయాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేతలు ఆరోపించారు .

మరిన్ని వార్తలు